calender_icon.png 1 November, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ క్యాలెండర్ ఎక్కడ?

21-07-2024 12:48:48 AM

నిరుద్యోగులను మోసగించిన కాంగ్రెస్ మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగ భృతి సహా అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉద్యోగార్థులను నిట్టనిలువునా మోసం చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు. 100 రోజుల్లో హామీలు నెరవేరు స్తామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని విమర్శించారు.

శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగుల పట్ల రేవంత్ సర్కారు వైఖరిని ఎండగట్టారు. రాష్ర్ట సాధనలో తెలంగాణ యువత ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేశారని, సుమారు 1,500 మంది బిడ్డలు బలిదానమయ్యారని గుర్తుచేశారు. ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులను అవమానపర్చేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నరు. ఎక్కడపోయాయి? జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వారి బాటలోనే నడుస్తోంది. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏవి? 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు. ఎక్కడ ? అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేవైఎం కార్యకర్తలు, నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. హామీలను వెంటనే నెరవేర్చాలని లేదంటే తమ పోరాటం మరింత ఉధృతంగా మారుతుందన్నారు.

ప్రజాభవన్‌కు వెళ్లడమే లేదు 

సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు వెళ్లడంలేదని, ప్రజల దరఖాస్తులను తీసుకోవడం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇక సచివాలయంలోకి వెళ్లేందుకు పైైరవీకారులకు అనుమతిస్తున్న ప్రభుత్వం నిరుద్యోగ యువకులను మాత్రం గేటు వద్దకు కూడా రానివ్వడం లేదన్నారు. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నాయన్నారు. మోసం చేయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్యగా కిషన్‌రెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారాయి. కేసీఆర్ దోపిడీ పోయి రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి దోపిడీ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీ మంత్రులు, హైకమాండ్‌కు మాత్రమే లాభం జరిగింది. మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చకుంటే.. నేడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. మార్పు కోసం కాంగ్రెస్ అన్నారు. కానీ పాలనలో, ప్రజల జీవితాలలో మాత్రం మార్పు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికీ ప్రజలు బుద్ధి చెబుతారు అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

బీఆర్‌ఎస్ కన్నా ఘోరం

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో యువతను పూర్తిగా విస్మరించి, తీవ్ర అన్యాయం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అన్యాయం చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. యువత డిక్లరేషన్ పేరుతో 2 లక్షల ఉద్యోగాల కల్పన, రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాటమార్చి అన్యాయం చేసిందన్నారు. అనుకూలంగా ఉన్న చానెళ్లు మీకు ప్రచారం చేయొచ్చు కానీ మీరు చేస్తున్న తప్పులను ప్రజలు లెక్కబెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. పోలీసులు కూడా సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఉందని, పోలీసులను నమ్ముకుని యువతను దూరం చేసుకుంటే అధోగతి పాలవుతారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిరసన చేపడితే లాఠీలతో కొట్టించారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ ఆరోపించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాన్ని నీరుగార్చేలా కార్యకర్తలను, నిరుద్యోగులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. నిరుద్యోగులంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోరీ కడతారని హెచ్చరించారు.