హైస్కూల్ చదువు ముగించుకొని బయటికి వెళ్ళబోతున్న విద్యార్థులను వాళ్ల టీచరు “మీ జీవిత లక్ష్యం ఏమిటి? భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారు?” అని అడిగితే, పాత రోజుల్లో అయితే డాక్టర్ అనో, ఇంజినీర్ అనో పిల్లలు ఠక్కున సమాధానం చెప్పేవారు. కానీ. నేటి ఆధునిక యుగంలో దాదాపు విద్యార్థులంతా సాప్ట్‌వేర్ ఇంజినీర్ అని జవాబు ఇస్తున్నారు. చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు పోలీస్ అనో, టీచర్ అనో, లెక్చరర్ అనో చెప్పవచ్చేమో కానీ ప్రజాసేవ చేస్తా, రాజకీయ నాయకుడిని అవుతానని ఒక్కరంటే ఒక్కరు కూడా అనరు.
నాయకత్వ లక్షణాలున్న ప్రతి వ్యక్తి నాయకుడే. ప్రజల జీవితాలను ప్రభావితం చేయగల అవకాశం నాయకుడికి మాత్రమే ఉంటుంది. పౌరులు అందరూ నాయకులుగా కావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి యువనేతలు చాలా అవసరం. మన ఎన్నికల విధానాన్ని పాలకులు పూర్తిగా రోజురోజుకు మార్చేస్తున్నారు. యువకులు అన్ని రంగాలలో ముందుండాలంటూ ప్రోత్సహిస్తున్నా రాజకీయ అవకాశాలు ఇవ్వడంలో పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి. విలువలతోకూడిన చదువులు చదివి సమాజం పట్ల అవగాహన ఉన్న యువతకు అవకాశాలు ఇవ్వకుండా యాబై ఏళ్లు దాటిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు యువకులు, విద్యార్థులు లేకుండా ఏ ఉద్యమం జరగలేదు. సమాజానికి మంచి చేయాలనే తపన కలిగి సామాజిక సృహ కలిగిన యువతలో రాజకీయ నైపుణ్యం ఉన్నప్పటికీ దానిని ఎప్పటి కప్పుడు కొందరు పెద్ద నాయకులు ఎదగకుండా చేస్తున్నారు. అయినా, ఎంత అణచి వేసిన అక్కడక్కడా యువ చైతన్యం తమ సత్తాను చాటుతూనే ఉన్నారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, వివిధ రంగాలలో యువతను అడ్డుకునే వారు లేరు. ఎందుకంటే, అవి వారి ప్రతిభ ఆధారంగా పొందినవి. కానీ, విలువలు కలిగిన యువకులు నాయకులుగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.
ఆయా రాష్ట్రాలలో ఆదర్శభావాలు గల కొందరు యువకులు స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచి, గెలుస్తున్నారు. ఇటువంటి యువత దేశం కోసం మరింత పెద్ద సంఖ్యలో ముందుకు రావాల్సి ఉంది. ప్రపంచ దేశాలలో అత్యధిక యువతను కలిగి వున్న దేశంగా రెండో స్థానంలో ఉన్న మన ఇండియా యువ నాయకత్వంలో జీరోగా మారుతున్నది. అందుకు ఆయా పార్టీలు, ధనస్వామ్య రాజకీయాలు కారణాలుగా చెప్పాలి. అలాగే అక్కడక్కడ యువతలో రాజకీయ చైతన్యం, పరిజ్ఞానం, అవగాహన కొరవడడమూ మరో కారణం.
అభివృద్ధికి ఆమడ దూరంలో బతుకుతున్న ఎందరికో దారి చూపడానికి, ఆధునిక పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా నాయకత్వంలో ప్రధాన పాత్ర పోషించడానికి యువశక్తి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే స్వచ్ఛందంగా తాము చేసే పనిని సంపూర్ణంగా, ఏకాగ్రతతో, నిజాయితీగా చేస్తారో, తమ శ్రేయస్సు కోసం కాక ఇతరుల మంచికోసమూ ప్రయత్నిస్తారో వారే నిజమైన నాయకులుగా గుర్తింపు పొందగలరు. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థి నాయకులను సమాజ సేవకులుగా తీర్చిదిద్దే బాధత్య నేటి నాయకులపై ఉంది. మేధావులు, విద్యావంతులు సమాజ శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరూ ఇందుకు తమ వంతు కృషి చేయాలి.
లకావత్ చిరంజీవి నాయక్