calender_icon.png 2 November, 2024 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ మద్యం ఎక్కడిది?

02-11-2024 12:52:49 AM

  1. పార్టీలోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి?
  2. ఫాంహౌస్ పార్టీపై చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ 
  3. రాజ్‌పాకాలపై ప్రశ్నల వర్షం
  4. స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు 
  5. న్యాయవాదులతో కలిసి హాజరైన నిందితుడు

రంగారెడ్డి, నవంబర్ 1 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో గల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది  రాజ్‌పాకాల ఫాంహౌస్‌లో గత(శనివారం) నెల 26న జరిగిన అనుమతి లేని మద్యం పార్టీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 

ఈ కేసులో ఏ1 నిందితుడు అయిన రాజ్ పాకాల శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తునకు హాజరయ్యారు. ఇప్పటికే మోకిల పోలీసులు ఆయనను విచారించిన విషయం తెలిసిందే. రాజ్ పాకాల తన న్యాయవాదితో కలిసి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ, ఏఈఎస్ జీవన్‌కుమార్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు (రాత్రి 8) గంటల వరకు వివిధ కోణాల్లో విచారించారు. రాజ్ పాకాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫాంహౌస్‌లో జరిగిన పార్టీలోకి ఫారిన్ లిక్కర్ బాటిళ్లు, గేమింగ్ పరికరాలు, డ్రగ్స్ ఎలా వచ్చాయి అనే కోణంలో అధికారులు  ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. పార్టీలో స్వాధీనం చేసుకున్న 37 రకాల ఫారిన్ (నాన్‌డ్యూటీ పెయిడ్) లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారు? ఇందుకు సహకరించింది ఎవరు? లేదంటే ఇంకెవరైనా సమకూర్చారా అనే విషయాలపై ప్రశ్నించారు.

అదేవిధంగా క్యాసినోకు సంబంధించిన గేమింగ్ పరికరాలు ఎక్కడివి? ఫ్యామిలీ పార్టీ అయితే క్యాసినో ఆడుతారా అని ప్రశ్నించారు. పార్టీలో పాల్గొన్న మొత్తం 34 మంది కుటుంబసభ్యులేనా లేక బంధువులా.. లేదంటే స్నేహితులా అని పోలీసులు ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. 

కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నారు: ఎక్సైజ్ డీసీ

ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ అన్నారు. రాజ్ పాకాలను విచారించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ దర్యాప్తునకు ఆయన సహకరిస్తున్నారని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.  

స్థానిక మద్యం బాటిళ్లనే వినియోగించాం..

కాగా ఎక్సైజ్ పోలీసులు విచారణకు పిలవడంతో హాజరైనట్లు రాజ్ పాకాల తెలిపారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పానని తెలిపారు. స్థానికంగా కొన్న మద్యం బాటిళ్లనే తమ దావత్‌లో వినియోగించామని ఆయన చెప్పారు.