01-03-2025 12:00:00 AM
దోర్బల బాలశేఖరశర్మ :
ఒకప్పుడు “జీవితంలో మీరేమవుతారు?” అని ఎవరైనా అడిగితే, అమ్మాయి లైనా అబ్బాయిలైనా ‘ఇంజినీర్లం లేదా డా క్టర్లమవుతాం’అనేవారు. అందరూ వెళుతున్న దారిలో కాకుండా భిన్నమార్గాన్ని ఎన్నుకొనే వారు కూడా కొందరు అప్పుడేకాదు, ఇప్పటికీ ఉన్నారు.
వారు పై రెండు వృత్తులవైపు కాకుండా ఆర్ట్స్, కామర్స్, సీఏ, సైన్సు, న్యాయశాస్త్రం వంటి రంగాలవైపు మళ్లుతుంటారు. గత దశాబ్ద కాలంగా ముఖ్యంగా మహిళల్లో ఉన్నత విద్యా కోర్సుల ఎంపిక విషయంలో ఒక కొట్టొచ్చే మార్పు కనిపిస్తున్నది. టెన్త్ కాగానే, చాలామంది మ్యాథ్స్‌తో ఇంజినీరింగ్, ఐటీ కో ర్సులవైపు వెళ్లే ట్రెండ్‌ను పక్కన పెట్టేసి, మెడిసిన్ సహా ఇతర రంగాలవైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.
ఇంటర్‌లో బైపీ సీ చేసి, మెడిసిన్ వైపు వెళుతున్న వారి సం ఖ్య ఇంజినీరింగ్, ఐటీ ప్రొఫెషనల్స్‌కంటే ఎక్కువగా ఉంటున్నది. ముఖ్యంగా గత పదేళ్లుగా ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) కోర్సులను ఎంపిక చేసు కుంటున్న అమ్మాయిల సంఖ్య తగ్గుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
కామర్స్‌కు 42 శాతం పెరుగుదల
కారణాలు ఏవైతేనేం, ఇంజినీరింగ్‌లోని వివిధ కోర్సుల వైపు వెళ్లకుండా, బి ఎస్‌సీ, ఎంఎస్‌సీ తర్వాత బిసీఎ, ఎంసీఏ లు చదివి ఐటీ రంగంవైపు వెళుతున్న వా ళ్లు గతంలో కొందరు లేకపోలేదు. ఇప్పు డు ఐటీ రంగంవైపు వస్తున్న అమ్మాయిల సంఖ్యకూడా తగ్గుతున్నది.
ఐతే, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలోకి ప్రవేశిస్తున్న మ హిళల భాగస్వామ్యమైతే స్థిరంగా పెరుగుతున్నప్పటికీ, ప్రత్యేకించి ఇంజినీరింగ్-టెక్నాలజీ కోర్సులకు మాత్రం ఇతర మెడిసిన్ ఇతరేతర కోర్సులకు మధ్య అసమా నత కొనసాగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నా యి.
2013--14 విద్యా సంవత్సరం నుంచి 2021--22 ఏడాది వరకు మధ్యకాలంలో అండర్ గ్రాడ్యుయేట్ కో ర్సులలో మహిళల నమోదు 46 శాతం, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో 55.5 శా తం పెరిగింది. కానీ, ప్రత్యేకించి ఇంజినీరింగ్ డిగ్రీలలో నమోదు, అండర్ గ్రాడ్యు యేట్ కోర్సులకు 1.35 శాతం, పోస్ట్ గ్రా డ్యుయేట్ కోర్సులకు 43 శాతం తగ్గుము ఖం పట్టినట్లు ప్రభుత్వ డేటానుబట్టి తెలుస్తున్నది. పై విద్యాసంవత్సరాల కాలం లోనే అండర్ గ్రాడ్యుయేట్ కామర్స్ కో ర్సులలో అయితే మహిళల నమోదు
42 శాతం పెరిగింది. అలాగే, అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లలోనూ నమోదు 15 శాతం పెరిగింది.
ఐటీ పీజీ కోర్సులకు 23% తగ్గుదల
‘ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ (ఏఐఎస్‌హెచ్‌ఈ) అధికారిక డేటానుబట్టే పై గణాంకాలు వెల్లడైనాయి. అదే సమయంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఐటీ, కంప్యూటర్ విభాగాలలో మాత్రం మహిళల నమోదు 23.4 శాతం పెరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐటీ కోర్సులకు 27.4 శాతం మేర తగ్గినట్లు తెలు స్తున్నది.
పరిస్థితులు ఏవైనా ఎక్కువమంది మహిళలు నేచురల్ సైన్సెస్, మెడిసిన్‌లలో చేరుతున్నట్టు వివిధ గణాంకాలు చెబుతున్నాయి. ఇంజినీరింగ్, ఐటీ(ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ)లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు పెరుగుదల నమోదు కాని విషయాన్ని కూడా అదే సమయంలో విద్యా రంగ నిపుణులు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాలలో సైన్స్, మెడిసిన్ వైపు..
దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో, పాఠశాలల్లో బాలికలు సైన్స్‌ను ఎక్కువగా ఎం చుకుంటున్నారు. దాదాపు 100 శాతం పాఠశాలలు 11, 12 తరగతులలో సైన్స్‌ను విధిగా అందిస్తున్నాయి. 75 శాతం కంటే ఎక్కువమంది బాలికలు 12వ తరగతిలో సైన్స్‌లో ఉత్తీర్ణులవుతున్నారని వారు తెలిపారు.
తెలుగురాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలలో సైన్స్‌ను అభ్యసించడానికి బాలికలకు తల్లిదండ్రులనుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తున్నట్టు తెలుస్తున్నది. సామాజిక ఆకాంక్షలు ఎక్కువగా కలిగిఉం డే ఉన్నత మధ్యతరగతి మహిళల కెరీర్ ఎంపికలను ఈ పరిస్థితి ప్రతిబింబిస్తున్నది. సైన్స్‌తోపాటు మెడిసిన్ రంగాలలోనూ ఎక్కువగా మహిళల ప్రవేశం జరుగుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు.
మార్పు కోసం ప్రభుత్వాల కృషి
‘స్టెమ్’కు చెందిన నాలుగు రకాల కో ర్సులవైపు తగ్గుముఖం పడుతున్న మహిళల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వాలు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆరునుంచి ఎనిమిది తరగతుల విద్యార్థుల కోసం తమిళనాడు ప్రభుత్వం ‘వనవిల్ మండ్రం’ పథకం కింద 100 మొ బైల్ ల్యాబ్స్‌ను స్థాపించింది. ఆ రాష్ట్రంలో 710 ‘స్టెమ్’ దోహదకారులకు శిక్షణ లభించింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ బాలికలకు ‘స్టెమ్’ విద్యకు మద్దతు ఇచ్చే విధానాలు అమలులో ఉన్నాయి. వీటిలో స్కూల్ కి ట్లు, ఆర్థిక సహాయం, స్మార్ట్‌బోర్డులు, ఇం డియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టె క్నాలజీ (ఐఐఐటీ)లో ప్రవేశాలు వంటివి దోహదకారిగా ఉంటున్నాయి. తరగతి ఫలితాల ఆధారంగా, హయ్యర్ సెకండరీ బాలి కలలో 70 శాతం మంది ‘స్టెమ్’ కార్యక్రమాలలో చేరినట్లు తెలుస్తున్నది.
ఇది జాతీ య సగటుతో పోల్చినప్పుడు 32 శాతంగా ఉంది. హర్యానాలో ‘మెయిన్ భి క్యూరీ’ కార్యక్రమంతోపాటు ‘స్వాతలీమ్ ఫౌండేషన్’, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త సహకారంతో ‘కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ’ పాఠశాలల్లోని బాలికలలో ‘స్టెమ్’పట్ల ఆసక్తిని రేకెత్తించడమే లక్ష్యంగా పెట్టుకొని అధికారులు పని చేస్తున్నారు.
అసోంలోని ప్రధాన నగరమైన గౌహతిలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ’ (ఐఐటీ)లో ‘స్టెమ్’ బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి 1,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అక్కడి ‘ఖాన్ అకాడమీ’తో భాగస్వామ్యం కుదుర్చుకుని 48,000 పాఠశాలల్లోని ఐదు లక్షలకు పైగా విద్యార్థులకు గణిత నైపుణ్యాలను పెంపొం దించింది. ఢిల్లీలోని ‘స్కూల్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్’ 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఉన్నత స్థాయి నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తున్నది.
ఆర్థిక సమస్యలు ప్రధాన కారణం
‘స్టెమ్’లో మహిళలు, బాలికల భాగస్వామ్యంలో ప్రపంచవ్యాప్త ధోరణులపై ‘ప్ర పంచ బ్యాంకు-2020’ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం, పురుషు లకంటే మహిళల్లో తృతీయ గ్రాడ్యుయేషన్ భాగస్వామ్య శాతాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, మహిళలు ‘స్టెమ్’ రంగాలలో, మరీ ముఖ్యంగా ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్‌లలో అధ్యయనాలు చేపట్టే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది.
‘స్టెమ్’ విద్యకు అవసరమయ్యే ఆర్థి క పెట్టుబడి కారణంగా మహిళలకు ఆ విభాగాలు ఎక్కువగా అందుబాటులోకి రావడం లేదని నిపుణులు గుర్తించారు. వనరులు తక్కువగా ఉన్న పరిస్థితులలో, మగపిల్లల విద్యలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో రాబడి వస్తుందనే భావన ఒకవైపు తల్లిదండ్రులలో ఉంటున్నది. ఫలితంగా అమ్మాయిలకన్నా అబ్బాయిలకు విద్యలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ‘సత్వ నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూట్’ 2023 జూన్ నాటి నివేదిక వెల్లడించింది.
‘స్టెమ్’ విద్యాభ్యాసానికి ఆచరణాత్మక విధానాలు కొన్ని ఉంటాయి. ప్రత్యేక పరికరాలు, ల్యాబ్ సౌకర్యాలు, అధునాతన సాంకేతికతల ప్రాప్యత వంటివి ఆ కోర్సులకు అవసరమవుతాయి. పట్టణ ప్రాంతా ల్లోని ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో ‘స్టె మ్’ సబ్జెక్టులను అభ్యసించడానికి అయ్యే ఖర్చు మానవీయ (హ్యుమానిటీస్) శాస్త్రా ల అధ్యయనానికి చేసే ఖర్చుకంటే 139 శాతం ఎక్కువగా ఉంటున్నట్టు విద్యారంగ నిపుణులు గుర్తించారు.
అదే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ‘స్టెమ్’ కోర్సులు మా నవీయ శాస్త్రాలకంటే 58.5 శాతం ఎక్కువ ఖరీదైనవిగా ఉంటున్నట్టు వారు చెబుతున్నారు. దీనినిబట్టి, కేంద్రం, ఆయా రాష్ట్రా ల ప్రభుత్వాలు ‘స్టెమ్’ కోర్సుల అభివృద్ధికి మరిన్ని మహిళా సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు అర్థమవుతున్నది.