హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలండర్ నిజమైనదే అయితే, ఆ క్యాలెండర్‌లో ఏడాదికి ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యా యని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. అశోక్‌నగర్‌లో విద్యార్థులు ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టుగా చెప్పినా మేమంతా రాజీనామా చేస్తామని సవాల్ చేశారు. జాబ్ క్యాలండర్ పేరు తో ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా ప్రకటించకపోవడంపై గన్‌పార్కు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం నిరసనకు దిగారు. ఈ సంద ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, స్వయంగా రాహుల్ గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ వాళ్లు బయట కనపడితే నిరుద్యోగులు తన్ని తరిమే పరిస్థితి ఉందన్నారు. దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అశోక్‌నగర్‌కు రావాలన్నారు. జీవో నంబరు 46ను సవరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఆ ఎమ్మెల్యే బజారు భాష మాట్లాడిండు. ఆ భాష వినలేక మనం ఇక్కడి నుంచి పోదాం అని కోవా లక్ష్మీ చెప్పినట్టు తెలిపారు. ఇంత దివాళాకోరు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. మా ఆడబిడ్డలను, మా ఎమ్మెల్యేలను తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న రేవంత్ రెడ్డి ఓ శాడిస్ట్‌లా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు.
రాష్ట్రం అప్పులపాలైందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఆరు నూరైనా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని చెప్పి, ఇప్పటివరకు హామీలను అమలుచేయక పోవడంపై ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు గన్ పార్కు వద్దకు భారీగా చేరుకోవడంతో నిరసన తెలిపే హక్కు లేదా అంటూ వాగ్వాదానికి దిగారు. ఇదేనా ప్రజాపాలనా అంటూ విమర్శించారు. అనంతరం నిరసన చేపడుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు.