calender_icon.png 9 October, 2024 | 10:56 PM

బీఆర్‌ఎస్ అగ్రనేతలు ఎక్కడ?

04-09-2024 12:59:23 AM

  1. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్
  2. విదేశీ టూర్‌లో కేటీఆర్
  3. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు
  4. వరదలతో బాధపడుతున్న ప్రజలు
  5. అండగా లేకుంటే పార్టీ మనుగడకు ముప్పే 
  6. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆవేదన 

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో జలవిలయం తాండవిం చినా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రకటనలు తప్ప బాధితులను పరామర్శించేందుకు దూరంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరు ఫామ్‌హౌస్‌కు పరిమితం కాగా, యువనేత మాత్రం విదేశాల పర్యటనలో బీజీగా గడుపుతూ ఎక్స్ వేదికగా ప్రకటనల మోత మోగిస్తున్నారు.

వరద బీభత్సానికి రాష్ట్రం అతలాకుతులం కాగా రేవంత్ సర్కార్‌పై విమర్శలు చేయడం తప్ప ప్రజలను ఓదార్చేందుకు ప్రయత్నాలు చేయడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు మాస్కోలో జరిగే కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతున్నారు. దానిని వెంటనే రద్దు చేసుకుని వరద బాధితులకు అండగా నిలిచి సహాయం అందేలా చేస్తే పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.

సోషల్ మీడియాలో చురుకుగా ఉంటే ప్రజలు నమ్మరని, వారి వద్దకు వెళితేనే అక్కున చేర్చుకుంటారని చెబుతున్నారు. మంగళవారం ఆ పార్టీ మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ముంపు ప్రాంతాల్లోని స్థానిక నాయకులతో కలిసి వరద బాధితులను పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందనే విమర్శలు చేస్తూ ముంపునకు గురైన ప్రాంతాల్లో కలియ తిరిగారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ. 25లక్షల పరిహారం ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. 

ఫౌమ్ హౌస్‌కు కేసీఆర్ పరిమితం 

  మాజీ సీఎం కేసీఆర్ గత నెల రోజుల నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు పరిమితమైయ్యారు. తన కూతురు ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై వచ్చిన తరువాత ఆమెను కలిసిన ఫొటోల్లో కనిపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంలో హడావుడి చేసిన కేసీఆర్ ఆ తరువాత జాడ లేకుండా పోయారు. పలు సందర్భాల్లో ఆయన ఆరోగ్యం బాగాలేదని, వైద్యులతో చికిత్స తీసుకుంటు న్నారని ప్రచారం జరిగింది. ఇది నిజం కాదని అప్పట్లో పార్టీ సీనియర్లు కొట్టిపారేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని త్వరలో ప్రజల మధ్యకు వచ్చి ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తారని పేర్కొన్నారు. కానీ నేటివరకు ఆయన ఏం చేస్తున్నారో పార్టీ శ్రేణులకు, ప్రజలకు తెలియడం లేదు.

అండగా లేకుంటే స్థానిక పోరులో ఓటమి.. 

  వానలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ సమయంలో అండగా నిలిస్తే త్వరలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు సహకరిస్తారని, దూరంగా ఉంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూడాల్సి వస్తుందని పార్టీ  శ్రేణులు పేర్కొంటున్నాయి. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందని, దానిని బీఆర్‌ఎస్ క్యాచ్ చేసుకుంటే స్థ్దానిక పోరులో ఆశించిన ఫలితాలు వస్తాయని వారు చెబుతున్నారు.