calender_icon.png 5 April, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ ఆఫీసర్ల జాడెక్కడ?

05-04-2025 12:32:28 AM

  1. పల్లెల్లో లోపించిన అభివృద్ధి
  2. సమస్యలుంటే కార్యదర్శులకే చెప్పాలంటున్న అధికారులు

మెదక్, ఏప్రిల్ 4(విజయ క్రాంతి): గ్రామ పంచాయితీలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీ పాలన వ్యవహారాలు చక్కబెట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. వివక్ష లేకుండా గ్రామాల అభివృద్ధికి స్పెషల్ అధికారులు కృషి చేస్తారని భావించినప్పటికీ గ్రామాల్లో వారి జాడ కనిపించడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఇతరత్రా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

పల్లెల్లో లోపించిన అభివృద్ధి...

మెదక్ జిల్లా వ్యాప్తంగా  ఆయా పంచాయితీల అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరి ష్కారంలో స్పెషల్ ఆఫీసర్ల మార్పు ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ గ్రామ పంచాయతీలకు వారు వచ్చినా పెద్దగా చేసింది ఏమీ లేదని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో కొంతమంది ప్రజలకు ప్రత్యేక అధికారులు ఎలావుంటారో కూడా తెలియని దుస్థితి నెలకొంది.

దీంతో గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్యం, ఇతర సమస్యలు పేరుకు పోతున్నాయి. మండల కార్యాలయాల్లో బిజీగా ఉంటూ గ్రామ పంచాయతీ పాలనపై కనీసం అవగాహన లేని వివిధ శాఖలలో పని చేస్తు న్న అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. దీనివల్ల వారి విధులు నిర్వహిస్తూ గ్రామాల మీద సరైన దృష్టి పెట్టకపోవడంతో గ్రామ పంచాయితీల పాలన పూర్తిగా నశించిందని ప్రజ లు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక అధికారులు సరియైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో పాలన కుంటుపడుతుందని వాపోతున్నారు. 

సమస్యలను కార్యదర్శులకే చెప్పండి...

గ్రామ పంచాయతీలలో ఏమైనా సమస్యలు ఉంటే స్పెషల్ ఆఫీసర్ కు చెప్పాలి అనుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఏ సమస్య అడిగినా గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పాలనే సమాధానం వస్తుందని, దీంతో కార్యదర్శి పంచాయితీలో ఉన్న సమస్యల భారం అన్ని తామై నడిపిస్తున్నారని, ఈ మాత్రం దానికి స్పెషల్ ఆఫీసర్లు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా పంచాయతీ కార్యదర్శికి  చెప్పాలని ఉచిత సలహాలు ఇస్తున్న అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. ఇలావుండగా మండల స్థాయి అధికారులను ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడంతో వారి శాఖల పనిపై దృష్టి పెట్టలేక గ్రామ పంచాయతీలలో ఉన్న సమస్యలపై అవగాహన చేయలేక పని భారంతో ఇబ్బంది పడుతూ  ఈ సమస్య మాకెందుకు అన్నట్టుగా మారిందని పలువురు అధికారులు మదన పడుతున్నారు.