calender_icon.png 19 April, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రులు ఎక్కడ!

17-04-2025 02:05:07 AM

గాంధీభవన్ సందర్శన మున్నాళ్ల ముచ్చటే!

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంగళం పాడారా?.. ప్రతివారం ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో  పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని ప్రకటించిన షెడ్యూల్  అటకెక్కిందా?.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.

ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారమార్గం చూపాల్సిన మంత్రులు గాంధీభవన్ ముఖం చూడటమే మానేయడంతో.. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థ్ధంకాక ఇటు కార్యకర్తలు అటు ప్రజలు గాంధీభవన్ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతు న్నారు.

అసలు మంత్రుల షెడ్యూల్లో మార్పులు ఎందుకు వచ్చాయి..?  మళ్లీ గాంధీభవన్‌కు  మంత్రుల వస్తారా..? అనేది  పార్టీ వర్గాల్లో  చర్చ జరుగుతోంది. ప్రజా పాలనలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు దగ్గర కావాలి, ప్రజ ల సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో వారానికి ఇద్దరు మంత్రులు గాంధీ భవన్‌కు రావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్  కోరారు.

సచివాలయంలో మంత్రులు తమ డిపార్ట్‌మెంట్ పనులతో బిజీబిజీగా ఉంటారని, ప్రజలు సచివాలయానికి వెళ్లినా మంత్రులను కలిసే అవకాశం పెద్దగా ఉండదని, అందు కు గాంధీభవన్‌కు వస్తే  సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పీసీసీ చీఫ్ సూచించారు.

దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  స్పందించి వారానికి రెండు రోజు లు గాంధీభవన్‌లో మంత్రులు   అందుబాటులో ఉండాలని ఆదేశించడంతో.. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పెద్దలు షెడ్యూల్ రూపొందించారు. 

ప్రతి బుధవారం, శుక్రవారం..

వారంలో ప్రతి బుధవారం, శుక్రవారం గాంధీభవన్‌లో మంత్రులు అందుబాటులో ఉంటారని పీసీసీ చీఫ్ షెడ్యూల్ ఇచ్చారు. దానికి తగ్గట్లే ఆరంభంలో  వారానికి ఇద్దరు చొప్పున మంత్రులు వచ్చారు.. ప్రజల సమస్యలను విన్నారు. అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. మొదట్లో వారానికి ఇద్దరు మంత్రులు వచ్చేవారు.

అది కాస్త తర్వాత వారానికి ఒకే మంత్రి అయ్యారు. మంత్రులు వచ్చినప్పుడు గాంధీభవన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొని తమ ఇబ్బందులు చెప్పుకునేవారు. వాటి పరిష్కారానికి మంత్రులు చొరవ తీసుకోవడంతో గాంధీభవన్‌కి వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మ కం ప్రజల్లో ఏర్పడింది. కానీ, తీరాచూస్తే కొన్ని వారాల నుంచి మంత్రులు గాంధీభవన్‌కు రావడం లేదు.

పీసీసీ అధ్యక్షుడు కూడా మంత్రులను గాంధీభవన్‌కి తీసుకువచ్చే అంశంపై సీరియస్‌గా  దృష్టి పెట్టడం లేదనే చర్చ జరుగుతుంది. స్వయంగా పీసీసీ చీఫ్ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో కార్యక్రమం మొదలుపెడితే.. కొద్దికాలంగా మంత్రులు గాంధీభవన్‌కు  రావడం లేదు. 

కార్యకర్తలు, ప్రజల ఇబ్బందులు

ఓ వైపు గాంధీభవన్‌కు మంత్రులు రాకపోవడం.. మరోవైపు సచివాలయానికి వెళ్తే మంత్రులు దొరకకపోవడంతో.. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాంధీభవన్‌కు  మంత్రులు వచ్చేలా  పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మరోసారి చొరవ తీసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా నెలా, రెండు నెలలకు ఒకసారైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీభవన్‌కు వచ్చేలా పీసీసీ చీఫ్ చొరవ చూపితే ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.