19-03-2025 08:22:37 PM
మోసపూరిత బడ్జెట్..
ఆందోల్ మాజీ ఎమ్మెల్యే..
సంగారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలకు అసెంబ్లీ వేదిక అయింది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఈ సారి బడ్జెట్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ హయాంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను పాతర పెట్టి... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్టు ఈ బడ్జెట్ ఉంది. విషాదం ఏంటంటే అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా ఇచ్చిన 420 హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసింది. ఆందోల్ నియోజకవర్గానికి, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని భూములను సష్యశామలం చేసే సాగునీటి ప్రాజెక్ట్ సంగమేశ్వర, బసవేశ్వరను కేసీఆర్ ప్రభుత్వం రూపకల్పన చేయడం జరిగింది.
బసవేశ్వర పనులు కొంత మొదలైనవి, సంగమేశ్వర కూడా మొదలైంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులను పక్కనపెట్టింది. ఆందోల్ నియోజకవర్గానికే కాదు, సంగారెడ్డి జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నర లక్షల ఎకరాల రైతులకు ఈ ప్రజా ప్రభుత్వం అన్యాయం చేసింది. ఆందోల్ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఒప్పించి లింగంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం 500 ఎకరాలను కేటాయించడం జరిగింది.
భూసేకరణ పూర్తి కావడం జరిగింది. ఇప్పటికే దాదాపు 100 మందికి ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు చొప్పున నష్టపరిహారం భూమికి అందజేయడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ సంబంధించిన ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి ప్రజా ప్రభుత్వం తీరును మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రైతులకు పేద ప్రజలకు, నిరుద్యోగ యువకులకు ఉపయోగపడే అన్నింటిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించింది.