calender_icon.png 18 October, 2024 | 5:03 AM

పంచాయతీలకు నిధులెక్కడ?

18-10-2024 02:31:18 AM

రూ.1,600 కోట్లు పెండింగ్

  1. పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన కరవు
  2. పంచాయతీ ఎన్నికల సాకు చూపుతున్న కేంద్రం
  3. కులగణనతో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయతీల్లో పాలన గాడి తప్పింది. నిధులు లేక సకాలంలో వేతనాలు అందించకపోవడంతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయా రైంది. సర్పంచులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై ఆర్థికభారం పడుతోంది.

నిధులు విడుదలచేయకపోయినా సర్పంచులు ఏదోవిధంగా సర్దు బాటు చేసి పనులు ఆగకుండా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన షురువైంది.

కొన్నిచోట్ల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పనులు నిలిచి పోకుండా చర్యలు తీసుకుంటున్నా.. నెలల తరబడి నిర్వహణ కష్టంగా మారింది. వాస్తవానికి కేంద్రం నుంచి గ్రామ పంచాయతీల నిర్వహణకు నిధులు రావాల్సి ఉన్నా పాలకవర్గం లేని కారణంగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో జీపీల నిర్వహణ కష్టంగా మారింది.

ఎన్నికల సాకుతో పెండింగ్..

15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీల నిర్వహణకు నిధులు వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు నెలకు దాదాపు రూ.200 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. ఈ లెక్కన సెప్టెంబర్ నెల వరకు కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1,600 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 1తో పంచాయతీల్లోని పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది.

ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులను నిలిపేశారు. గతంలో ఎస్‌ఎఫ్‌సీ నిధులు రాకున్నా కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా పాలకవర్గాలు గ్రామ పంచాయతీలను నిర్వహించేవి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తేనే ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల చేస్తామని తేల్చిచెబుతుంది.

దీంతో కేంద్రం నుంచి కూడా నిధులు రాకపోవడంతో ఆదాయవనరులు లేక గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం, పంచాయతీరాజ్‌శాఖ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. 

గత ప్రభుత్వ నిర్లక్ష్యమూ ఉంది..

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

కానీ డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు మళ్లీ వాయిదాపడ్డాయి. 

కులగణన నేపథ్యంలో ఆలస్యం..

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. అయితే గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గించి 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. దీంతో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీవర్గాలు పట్టుబట్టాయి.

బీసీల డిమాండ్ మేరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కులగణనను చేపట్టేందుకు సిద్ధమైంది. దీనికోసం కులగణన నిర్వహిస్తోంది. అయితే కులగణన అనంతరం బీసీల దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. రిజర్వేషన్లలో ఏ సమస్య వచ్చినా న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది.

రాష్ట్రంలో చేపట్టే కులగణనకు ప్రభుత్వం 60 రోజుల సమయాన్ని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఏ చిక్కులు లేకుండా కులగణన, దామాషా ప్రకారం బీసీల కులగణన ప్రక్రియ పూర్తయినా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి అయి, కొత్త పాలకవర్గం ఏర్పడేవరకు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. 

నిధుల విడుదలపై బీజేపీ ఎంపీలు స్పందించాలి: మంత్రి సీతక్క

గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఇప్పటికే చాలాసార్లు విజ్ఞప్తి చేశాం. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరాం. కానీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు.

కులగణన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా మారుకుండా చూడాల్సిన అవసరం ఉంది. దీనికోసం బీజేపీ ఎంపీలు కూడా చొరవ చూపాలి. కేంద్రంలో ఉన్న వారి ప్రభుత్వానికి ఒప్పించి పెండింగ్ నిధుల విడుదలకు కృషి చేయాలి.