ఎక్స్ వేదికగా ప్రశ్నించిన కేటీఆర్
హైదరాబాద్, జూన్ 30(విజయక్రాంతి): తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆదివారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు తెలంగాణలోని యువత, నిరుద్యోగులను రాహుల్ గాంధీ స్వయంగా కలిసి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటనలను సైతం విడుదల చేశారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడు నెలలు అయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ జారీ కాలేదని ఆరోపించారు.
మిగిలిన ఐదు నెలల కాలంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ విధంగా జారీ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.