calender_icon.png 28 October, 2024 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో మీసేవ అందేదెప్పుడో?

28-08-2024 03:36:26 AM

  1. జిల్లాలో 20 కేంద్రాల మంజూరు 
  2. నిర్వాహకుల ఎంపికలో జాప్యం 
  3. మార్గదర్శకాలు రాలేదంటున్న అధికారులు

మెదక్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ప్రభుత్వ సేవలు పల్లెవాసులకు చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేయనున్న మీసేవ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని భావించింది. ఇటీవల సమీక్ష నిర్వహించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదనడం విమర్శలకు తావిస్తోంది. 

20 మీసేవ కేంద్రాలు మంజూరు

వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు, ఆధా ర్ సంబంధిత సేవలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ చెల్లింపులు వంటి సేవలను మీసేవ కేంద్రాలు అందిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జిల్లాలో కొత్తగా 20 మీసేవ కేంద్రాలను మంజూరు చేసింది. ఇందుకు ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం 40 లక్షల తో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిగా ఉండి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన సభ్యులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో చాలా మంది ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకున్నారు. 

ఎంపికలో తాత్సారం 

మీసేవ నిర్వహణకు లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, మం డల సమాఖ్యల నుంచి తీర్మానాలు సైతం తీసుకున్నది. కానీ లబ్ధిదారుల ఎంపికలో మాత్రం జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. 20 మీసేవ కేంద్రాలను జిల్లాలోని ఏయే మండలాల్లో ఏర్పాటు చేయాల నే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన డీఆర్‌డీఏ అధికారులు అనుమతుల కోసం ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. కొన్ని గ్రామా ల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం లేనట్లుగా గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏ గ్రామం లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత రాకపోవడంతో లబ్ధిదారుల ఎంపికలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

మార్గదర్శకాలు రాలేదు

జిల్లాలో 20 మీసేవ కేంద్రాలు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా చేపట్టలేదు. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. వాటికోసం ఎదురుచూస్తున్నాం. మార్గదర్శకాలు విడుదలైన తర్వాత కేంద్రాలను ప్రారంభించే గ్రామాలతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. 

 శ్రీనివాస్‌రావు, 

డీఆర్డీవో, మెదక్ జిల్లా