calender_icon.png 27 October, 2024 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్కారీశాఖలో బదిలీలు, పదోన్నతులు ఎప్పుడో?

27-10-2024 12:00:00 AM

  1. ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, సిబ్బంది 
  2. కొత్తగా 16 పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనను పట్టించుకోని అధికారులు 
  3. ఎన్నికల ముందు బదిలీ చేసిన వారిని.. సొంత స్థానాలకు తీసుకురావడంలోనూ నిర్లక్ష్యమే

హైదరాబాద్, అక్టోబర్ ౨6 (విజయక్రాంతి): అబ్కారీ శాఖలో బదిలీలు, పదోన్నతు లు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త స్టేషన్ల ఏర్పాటులోనూ ఆలస్యమవుతోంది. రెండు నెలల క్రితం సాధారణ బదిలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది.

అయినా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ శాఖలో పనిచేస్తున్న దాదాపు 2,700 మంది కానిస్టేబుళ్లకు ఎనిమిదేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేవు. తమ సమస్యల ను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితు ల్లో వారు ఉన్నారు. వీరితో పాటు మరో 200 మంది కానిస్టేబుళ్లు అప్‌గ్రేడేషన్ కోసం ఎదు రు చూస్తున్నారు.

గత ప్రభుత్వం మొదలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలను కలిసి తమ సమస్యలను వివరించినా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికలకు ముందు దాదాపుగా 200 మంది ఉద్యోగు లు, అధికారులు బదిలీలు అయినా.. వారిని తిరిగి సొంత స్థానాలకు తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు చొరవచూపడం లేదనే వి మర్శలు వినిపిస్తున్నాయి.

వీటితోపాటు రా ష్ట్రంలో అదనంగా 16 ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని మూడేండ్ల క్రితం ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. రీ ఆర్గనైజేషన్ చట్టం కింద సుమారు 85మంది అధికారులు వివిధ హో దాల్లో పదోన్నతులు పొంది మూడేళ్లుగా బా ధ్యతలు పనిచేస్తున్నా.. ఇంతవరకు కొత్తగా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోసారి అబ్కా రీ శాఖలో పదోన్నతులు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటులో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు వా పోతున్నారు. కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం బడ్జెట్ నిధులు కేటాయించినా.. ఇప్పటివరకు వాటిని ఏర్పాటు చేయడం లేద ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఏటా రూ.35 వేల కోట్ల ఆదాయం.. 

రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా అబ్కారీ శాఖ నుంచి దాదాపు రూ. 35 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది.  ఎక్సైజ్ శాఖలో పోలీస్‌స్టేషన్లను పెంచి అక్రమ మద్యం, గంజాయి, గు డుంబాను అరికడితే మరింత ఆదాయం వ స్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40 ఎక్సైజ్ సూపరింటెడ్ కార్యాల యాలతో పాటు 139 అబ్కారీ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.

గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే 14 పోలీస్‌స్టేషన్లలో శంషాబాద్, సరూర్‌నగర్, హ యత్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్, మల్కాజిగిరి, అమీర్‌పేట్, నాంపల్లి, జూబ్లీహిల్స్, మలక్‌పేట్, కుత్బుల్లాపూర్, లింగంపల్లి స్టేషన్లు ఉన్నా యి. దీంతోపాటు పటాన్‌చెరు స్థానంలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ఏర్పాటు చేయనుండగా, సికింద్రాబాద్, ముషీరాబాద్‌లో ఎక్సైజ్ స్టేషన్లను విభజించనున్నారు. హనుమకొండ జిల్లాలో హనుమ కొండ పేరుతో మరో స్టేషన్ రానుంది.

చెక్‌పోస్టుల వద్ద వసతులు కల్పించాలి

ఎక్సైజ్ చెక్‌పోస్టుల పనిచేసే వారి కోసం కనీస వసతులను కల్పించడం లేదనే విమర్శ లు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 ఎక్సై జ్ చెక్‌పోస్టులు ఉండగా, నారాయణపేట్‌లో (కృష్ణా చెక్ పోస్ట్) వద్ద మాత్రమే అధికారులు కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కంటెయినర్ ఏర్పాటు చేశారు.

మిగతా చోట్ల కంటెయినర్లు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో చెక్ పోస్టు వద్ద ముగ్గురు సీఐలు, ఎస్‌ఐలతో పాటు 20 మంది కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధు లు నిర్వహిస్తుంటారు. ఇప్పటికైనా  మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.