calender_icon.png 22 November, 2024 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైట్ తెరుచుకునేదెప్పుడో?

22-07-2024 03:12:43 AM

ప్రభుత్వం మారినా కొత్త పించన్లకు కలుగని మోక్షం

రెండేళ్ల క్రితం మూతపడ్డ పెన్షన్ దరఖాస్తుల పోర్టల్

అర్హులకు తప్పని నిరీక్షణ

రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ఎదురుచూపు

సూర్యాపేట, జూలై21 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అర్హులైన వారందరికి ఆసరా పెన్షన్లను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామని ప్రభుత్వాలు చెప్పుకొంటున్నా.. అభాగ్యులకు లబ్ధి జరుగడంలేదు. ౭ నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘చేయూత’ పథకంలో కూడా అర్హులైన వారికి లబ్ధి జరుగట్లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో వృద్ధాప్య పింఛను అర్హత వయస్సు 57 ఏండ్లకు కుదించగా, లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. కొద్దిమేరకు పించన్లను ఆమోదించి, ఆ తరువాత పరిశీలన పేరుతో కాలయాపన జరిగింది. నెల రోజుల వ్యవధిలో 2022 సెప్టెంబర్ చివరన నూతన దరఖాస్తులను స్వీకరించే సైట్ మూతబడ్డగా మళ్లీ ఇప్పటి వరకు తెరుచుకోలేదు.

లక్షల్లో దరఖాస్తులు.

దారిద్య్రరేఖకు దిగువన ఉండి సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, చేనేత, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ రోగులను ఆదుకునేందుకు ఉమ్మడి రాష్ట్రం నుంచి గత ప్రభుత్వాలు పింఛను అందించాయి. రాష్ట్రం ఏర్పాటు తరువాత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆసరా కింద అమలు చేసిన విషయం విధితమే. 2014 వరకు రూ. 200 ఉన్న వృద్దుల, వితంతువుల పింఛన్లను రూ.1000, వికలాంగుల పింఛన్లను రూ.500 నుంచి రూ. 1500 కు పెంచింది.

కాగా, 2018లో రెండోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక మరోసారి వృద్ధుల, వితంతువుల పింఛన్లను రూ.1000 నుంచి రూ. 2,016కు, వికలాంగుల పింఛన్లను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచింది. ఆ తరువాత 2019 నుంచి కొత్త పింఛన్ల మంజూరును మరిచారు. పెరిగిన భారం తగ్గించుకోవడానికి నూతన పింఛన్లు మంజూరు చేయడం లేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తరువాత 2021లో వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సు 57 ఏండ్లకు కుదించి నూతన పింఛన్లకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. 

మళ్లీ రెండేళ్లు

రాష్ట్రంలో నూతన ఫించన్లకు దరఖాస్తులు రెండేళ్లుగా లేవు. లబ్ధిదారుల ఒత్తిడిని భరించలేక గ్రామాల్లో కార్యదర్శులు, పట్టణాలలో వార్డు అధికారులు మ్యానువల్‌గా దరఖాస్తులు తీసుకుంటున్నా.. అవి చెత్త కుప్పలోకే వెళ్తున్నా యి తప్ప వాటి వల్ల ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలల గడుస్తున్నా నూతన పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

గతంలో చేసుకున్న దరఖాస్తుల్లో సుమారు 60 శాతం దరఖాస్తులు తిరస్కరించడం, మళ్లీ రెండేళ్లుగా దరఖాస్తులు చేసుకునే అవకాశం లేకపోవడంతో అర్హుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో సుమారు 4లక్షల మంది వివిద కేటగిరీల కింద పెన్షన్ పొందుటకు అర్హులు ఉన్నారని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఇదీలా ఉంటే వికలాంగులకు సకాలంలో పింఛన్లు మంజూరు కాక పోవడంతో వారి అర్హతను దృవీకరించే సదరం సర్టిపికేట్ల వ్యాలిడిటీ సైతం ముగుస్తున్నది.