calender_icon.png 14 November, 2024 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్ పెంచేదెప్పుడు?

13-11-2024 12:17:10 AM

  1. లబ్ధిదారుల ఎదురుచూపులు 
  2. ప్రభుత్వం నుంచి ప్రస్తావన లేకపోవడంతో నిరాశ

వికారాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తామని, నెలనెలా రూ.4 వేలు పింఛన్ అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 11 నెలలు కావొస్తున్నా పింఛన్ల పెంపు మాటెత్తడం లేదు. దీంతో లబ్ధిదారులు ఎదురుచూ స్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా మాట వరుసకైనా పింఛన్ పెంపు గురించి మాట్లాడకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. రూ.4 వేలకు పెంచి ఎప్పటి  నుంచి అమలు చేస్తారనే దానిపై లబ్ధిదారులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

తప్పని ఎదురుచూపులు 

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతువులకు ఇచ్చే రూ.2,016 పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని, దివ్యాంగులకు రూ. 6,000కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు పెంచకపోవడంతో లబ్ధిదారులు నిరాశలో ఉన్నారు. పైగా సకాలంలో పింఛన్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి నెల మొదటి వారంలో రావాల్సిన పింఛన్ డబ్బులు రెండు, మూడో వారంలో ఇస్తున్నారు. దీంతో రోజు గడవక వృద్ధులు ఇతరుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. పింఛన్ పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కొందరు వృద్ధులు సకాలంలో ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నారు. ఒక నెల పింఛన్ డబ్బులు మరో నెలలో ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.  

విచారణ పేరుతో పేర్ల తొలగింపు 

2022లో కొత్త పింఛన్లు మంజూరు చేసిన అప్పటి ప్రభుత్వం విచారణ పేరుతో ఉన్న పింఛన్లను తొలగించింది. 2022 ఏడాది కంటే ముందు జిల్లాలో 92,171 మందికి నెలనెలా పింఛన్లు అందేవి. 2022లో మరో 25,235 మందికి అప్పటి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ వెంటనే విచారణ పేరుతో జిల్లాలో 1,676 పింఛన్లు  తొలగించారు.

పలు కారణాలను చూపి జాబితా నుంచి పేర్లు తీసేశారు. దీంతో అర్హులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా లాభం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హత ఉన్న వారందరికి పింఛన్లు ఇస్తామని చెప్పడంతో 11 నెలలుగా ఆశగా ఎదురుచూ స్తున్నారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎప్పుడు అమలవుతాయంటూ కనిపించిన వారినల్లా ఆరాతీస్తున్నారు. 

వికారాబాద్ జిల్లాలో పింఛన్ల వివరాలు 

వికారాబాద్ జిల్లాలో మొత్తం 1,09,833 మంది పింఛన్లు పొందుతున్నారు. వారిలో వృద్ధులు 41,104 మంది, దివ్యాంగులు 12,592, వితంతువులు 49,492, నేత కార్మికులు 143, గీత కార్మికులు 418, ఒంటరి మహిళలు 4,608, బీడీ కార్మికులు 38, ఫైలేరియా బాధితులు 199, ఏఆర్‌టీ 1145, డయాలసిస్ బాధితులు 94 మంది ఉన్నారు.