calender_icon.png 19 April, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నందివాడ, పోతాయిపల్లి రోడ్డుకు మోక్షం ఎప్పుడో..

19-04-2025 12:20:56 AM

  1. సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 
  2. అధ్వాన్నమైన రోడ్డుతో అవస్థలు

తాడ్వాయి, ఏప్రిల్, 18 (విజయ క్రాంతి): ప్రభుత్వాలు మారుతున్న నాయకులు మారుతున్న ప్రజలకు అవస్థలు తప్పడం లేదు అద్వానమైన రోడ్డులోనే ప్రయాణం చేస్తూ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో ఉన్న రోడ్డుపైనే పయనం సాగిస్తున్నారు ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అవస్థలు పడుతున్నారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ,పోతాయిపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టి ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తి అవుతుంది అయినా రోడ్డుకు ఇప్పటికీ మోక్షం లభించడం లేదు నందివాడ నుంచి వయా పోతాయిపల్లి మీదుగా లింగంపేట మండలం ఐలాపూర్ వరకు బీటి రోడ్డు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది కానీ అధికారులు రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించకుండానే మధ్యలో వదిలివేసి వెళ్లిపోయారు నందివాడ సామదుబ్బ తండా నుంచి పోతాయిపల్లి శివారు వరకు మధ్యలో 4 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంది.

ఈ ప్రాంతంలో రోడ్డును నిర్మించరాదని అటవీశాఖ అధికారులు రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారు దీంతో నాలుగు కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండానే ఆగిపోయింది అప్పటినుంచి ఇప్పటివరకు ప్రజలు మట్టి రోడ్డుపైనే ప్రయాణం కొనసాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు నందివాడ నుంచి సామదుబ్బ తండా వరకు వేసిన బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయమైంది రోడ్డుపై చాలాచోట్ల గుంతలు పడడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు మండలాల ప్రజలకు ప్రయాణం సులువు అవుతుంది. - - కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ నుంచి వయా పోతాయిపల్లి మీదుగా ఐలాపూర్ వరకు నిర్మించిన బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతే తాడ్వాయి, లింగంపేట మండలాల ప్రజలకు రోడ్డు మార్గం సులువు అవుతుంది లింగంపేట మండలంలోని పోతాయిపల్లి, కోమటిపల్లి,కన్నాపూర్, ఐలాపూర్, పోల్కంపేట, రాంపల్లి గ్రామాల ప్రజలకు కామారెడ్డి జిల్లా కేంద్రం చేరుకోవడానికి రోడ్డు ప్రయాణం తక్కువ దూరం అవుతుంది.

వయా పోతాయిపల్లి మీదుగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గం 14 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు తాడువాయి మండలంలోని ప్రజలు లింగంపేట మండలంలోని గ్రామాలకు చేరుకోవడానికి దూర భారం తగ్గుతుంది అదేవిధంగా ఇక్కడి ప్రజలు మెదక్ జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి సైతం దూరం తగ్గుతుందని తెలుపుతున్నారు . ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మార్గాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు 

అధ్వానమైన రోడ్డుతో అవస్థలు 

నందివాడ నుంచి సామదుబ్బ తండా కి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి రోడ్డుపై చాలా చోట్ల గుంతలు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు నిర్వహించాలి తండా నుంచి పోతాయిపల్లి గ్రామాల మధ్య నిలిచిపోయిన నాలుగు కిలోమీటర్ల రోడ్డును సైతం పూర్తి చేయాలి.

 గణపతి, సామదుబ్బ తండా మాజీ సర్పంచ్ భర్త