రైతుల మోసం చేసిన రేవంత్ సర్కార్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో రుణమాఫీ ఎప్పుడు పూర్తిచేస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ అయిన రైతుల కంటే కాకుండా కంటతడి పెట్టే కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. రుణమాపీకి అర్హులైన వారికి ఎందుకు కాలేదో సమాధానం చెప్పే నాయకుడు లేడని మండిపడ్డారు.
రైతులను రేవంత్‌రెడ్డి సర్కార్ మోసం చేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని దుయ్యబట్టారు. రెండు సీజన్లు అయినా రైతు భరోసా ఇంకా ప్రారంభించలేదని, జూన్‌లో వేయాల్సిన భరోసా ఆగస్టు దాటుతున్నా రైతుల ఖాతాలో జమ చేయలేదని గుర్తుచేశారు. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు ఇవ్వలేదని, రైతు కూలీలకు రూ.12 వేలు హామీ ఇంకా అమలు చేయలేదని మండిపడ్డారు.
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తుండటంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కేటీఆర్ కోరారు. డెంగ్యూ మరణాలు లేవని వైద్యశాఖ తప్పుడు గణాంకాలు చెబుతోందని మండిపడ్డారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ రోజుకు ఐదుగురు చనిపోతున్నట్టు కథనాలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. దీనిపై ఎందుకు గోప్యత పాటిస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా మందులు లేవని, చాలా దవాఖానల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు, నలుగురిని ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారని మండిపడ్డారు.
మేధా కోచ్ ఫ్యాక్టరీ ఎదగాలి..
రాష్ట్రంలోని కొండకల్‌లో ఏర్పాటు చేసిన మేధా కోచ్ ప్యాక్టరీ వందే భారత్ రైల్ కోచ్ తయారీలో కీలకంగా మారిందని కేటీఆర్ అన్నారు. మన రాష్ట్రానికి చెందిన మేధా కోచ్ ప్యాక్టరీ అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభతో విజయవంతంగా ప్రయాణం సాగిం చడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఫ్యాక్టరీకి సంబంధించిన కశ్యప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో పాటు వారి బృందాన్ని ప్రశంసించారు. మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.