28-04-2025 12:43:37 AM
సూర్యాపేట, ఏప్రిల్27 (విజయక్రాంతి): అభయహస్తం నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకం రద్దు కావడం, నేటికి డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో చేరి పొదుపు చేస్తున్న మహిళలకు ప్రభుత్వం అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
వృద్ధాప్య పెన్షన్లతో సంబంధం లేకుండా ఈ అభయహస్తం కింద పెన్షన్లు అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సభ్యురాలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియంగా చెల్లించే విధంగా చేసింది. పొదుపు చేసిన వారు సహజంగా మరణిస్తే రూ.30 వేల ఆర్థిక సాయం, ప్రమాదవశాత్తు అయితే రూ.75 వేలు ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించింది.
ఇక 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.500 పెన్షన్ ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏడాదికోసారి పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టి 2017 నుండి పూర్తిగా నిలిపివేశారు. అయితే కాంగ్రేస్ ప్రభుత్వం డబ్బులు తిరిగి ఇస్తామని ఏడాది గడిసిన నేటికి రాకపోవడంతో లబ్దిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
14.65 కోట్లు..
అధికారికంగా జిల్లాలో 80,300 మంది లబ్ధిదారులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంత కాలం లెక్కలను పరిశీలిస్తే ప్రతి ఏటా అందరూ రూ.365 చొప్పున ఏనిమిదేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు. జిల్లాను యూనిట్గా తీసుకుంటే 80, 300 మంది రూ.365 చొప్పున చెల్లిస్తే ఏడాదికి రూ. 2,93,09,500 అవుతుంది. 2009 నుండి 2014 వరకు ఈ పథకం కొనసాగగా..5 సంవత్సవరాలు లబ్దిదారులు తమ వాట రూ. 365 చెల్లించారు.
ఈ లెక్కన ఈ ఏనిమిదేళ్లలో రూ. 14,65,47,500 ప్రభుత్వం వద్ద ఉన్నవి. అభయహస్తం పథకం రద్దుతో ఈ నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నిధులపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకుండానే పథకాన్ని రద్దు చేయడంపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నిధులను తమకు తిరిగి చెల్లిస్తారా.. లేదా అని సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
జివో ఎంఎస్ నెంబర్ 36 ప్రకారం 2 ఏళ్లు వరుసగా ప్రీమియం కట్టించుకోనట్లైతే సభ్యురాలి ఖాతా రద్దు అవుతుంది. అయితే 5 ఏళ్ల నుండి ప్రభుత్వం ప్రీమియం కట్టించుకోవడం లేదు. ఇదే టైంలో వీరి నుండి ఇంత కాలం సేకరించిన ఫండ్ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఒక్క సూర్యాపేట జిల్లాను యూనిట్గా తీసుకుంటే ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన నిధుల పరిస్థితి ఏంటి ? పెద్ద మొత్తంలో నిధులు ఏమయ్యాయి దానిపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
2022ఏప్రిల్లో చెల్లిస్తామని..
అభయహస్తం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు గతంలో పొదుపు చేసిన మొత్తాన్ని లబ్దిదారులు ఖాతాల్లో జమ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించినట్లు 2022 ఏప్రిల్ మాసంలో అసెంబ్లీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించిన అప్పటి మంత్రులు హరీశ్రావు, ఎరబ్రెల్లి దయాకర్రావు, మల్లారెడ్డిలు వెల్లడించారు. ఆయా శాఖల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
కాని ప్రభుత్వం మారే నాటికి లబ్దిదారులకు మాత్రం తాము చెల్లించిన డబ్బులు అందలేదు. అయితే కాంగ్రేస్ ప్రభుత్వం కూడా అభయహస్తం డబ్బులు తిరిగి ఇస్తామని ప్రకటించి ఏడాది గడిసిన నేటికి అందలేదు. కాగా తాము చెల్లించిన డబ్బులను ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నారు.