calender_icon.png 5 January, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామకపత్రాలు ఇచ్చేదెప్పుడు?

04-01-2025 01:08:15 AM

  1. ఉద్యోగాలొచ్చినా చేతికందని అపాయింట్‌మెంట్ ఆర్డర్లు
  2. ఎప్పుడిస్తారని జేఎల్ అభ్యర్థుల ఎదురుచూపులు
  3. సీఎం చేతులమీదుగా ఇచ్చేందుకు అధికారుల యత్నాలు

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా ఇంకా నియామకపత్రాలు మాత్రం ఇంకా చేతికందలేదు. సర్కార్ నౌకరి వారి కల.. 14 ఏండ్ల తర్వాత జేఎల్ (జూనియర్ లెక్చరర్) నోటిఫికేషన్ వెలువడటంతో ఉద్యోగార్థులంతా సంతోషపడ్డారు.

గెజిటెడ్ హోదా ఉద్యోగం కావడంతో కష్టపడి చదివి పరీక్షల్లో సత్తాచాటారు. ఎట్టకేలకు ఉద్యోగం సాధించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది. కానీ ఇంత వరకూ అపాయింట్‌మెంట్ ఆర్డ ర్లు మాత్రం చేతికందలేదు. ఎప్పుడిస్తారని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

కానీ ఎడతెగని తాత్సారం జరుగుతోంది. అపాయింట్‌మెం ట్ ఆర్డర్ ఇచ్చేందుకు ఇంకా ప్రభుత్వ ఆమో దం లభించలేదని సమాచారం. సీఎం చేతుల మీదుగా ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే జా ప్యం జరుగుతున్నట్లు తెలిసింది.

253 పోస్టుల భర్తీ పెండింగ్..

జేఎల్ పోస్టుల భర్తీలో భాగంగా 1,392 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, వీటిలో 253 పోస్టుల భర్తీ నిలిచిపోయింది. పెండింగ్‌లో ఉన్నవాటిలో ఇంగ్లీష్, బోటనీ సబ్జెక్టుల కు సంబంధించిన పోస్టులు ఉండటం గమనార్హం. మల్టీ జోన్ 581, మల్టీజోన్ 558 చొప్పున మొత్తం 1,139 జేఎల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది.

కోర్టు కేసులతో ఇంగ్లీష్, బోటనీ పోస్టుల భర్తీ నిలిచిపోగా, కేసులు తేలే వరకు ఈ సబ్జెక్టుల పోస్టుల భర్తీ కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇవిపోగా మిగిలిన 1,139 పోస్టులకు నియామక పత్రాలను అందించనున్నారు. ఈ నెలలో సీఎం విదేశీ పర్యటనలు ఉన్న నేపథ్యంలో దీనికి ముందే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేదుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇంటర్‌విద్యకు చేరిన కథ..

జేఎల్ రిక్రూట్‌మెంట్ బాధ్యతలను టీజీపీఎస్సీకి అప్పగించారు. టీజీపీఎస్సీ ప్రక్రియనంతా పూర్తిచేసి ఇంటర్ విద్య కమిషనరేట్‌కు అప్పగించింది. ఇంటర్ విద్య కమి షనరేట్ కొత్తగా రిక్రూట్‌మెంట్ అయిన జేఎళ్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేందు కు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉండటంతో ఆమో దం కోరింది.

అయితే ప్రభుత్వం నుంచి స్పం దన లేకపోవడంతో అపాయింట్‌మెంట్ ఆర్డర్ల జారీలో జాప్యం జరుగుతు న్నట్లు చర్చ జరుగుతోంది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.. అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు తమ కు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని జేఎల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

రెండేళ్లుగా భర్తీ ప్రక్రియ..

ఉమ్మడి రాష్ట్రంలో 2008లో జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 14 ఏండ్ల తర్వాత మళ్లీ 2022లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. గత కేసీఆర్ సర్కార్‌లో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ విద్య చరిత్రలో ఒకేసారి 1,300లకు పైగా పోస్టులను భర్తీచేయడం ఇదే తొలిసారి. మొత్తం 23 సబ్జెక్టులకు సంబంధించిన 1,392 పోస్టుల భర్తీకి టీజీపీస్సీ 2022, డిసెంబర్ 9న నోటిఫికేషన్ జారీచేసింది.

2022, డిసెంబర్ 31 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 2023, సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించారు. 2023, అక్టోబర్ 18న ప్రాథమిక కీ, 2024, ఏప్రిల్ 21న తుది కీ విడుదల చేశారు. 2024, జూన్ 8న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్‌ఎల్) విడుదల చేశారు.

2024, ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. డిసెంబర్‌తో మొత్తం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యింది. ఇప్పుడు కేవలం నియామకపత్రాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. రెండేళ్లకు పైగా జేఎల్ నియామక ప్రక్రియ సాగింది.