calender_icon.png 8 November, 2024 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా బకాయిలెప్పుడిస్తరు?

31-08-2024 01:01:50 AM

ఆర్టీసీ కార్మికుల ఆవేదన

4,750 కోట్ల మేర పేరుకుపోయిన పెండింగులు

యాజమాన్యం తీరుకు నిరసనగా ఆందోళనలు

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తమను గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సైతం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన జీతభత్యాలు, పదవీవిరమణ చేసిన కార్మికుల బెనిఫిట్స్ సైతం ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోతు న్నారు. సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం అర చేతిలో వైకుంఠం చూపిస్తే.. కాంగ్రెస్ సర్కారు కూడా అదే మార్గంలో నడుస్తోందని విమర్శిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ఉన్నాయని చెప్తున్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అదిగో ఇదిగో అంటున్నారు తప్ప స్పందన లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను గత ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా 2018 నుంచి ఆర్టీసీలో గుర్తింపు సంఘం లేకుండా పోయింది.

ట్రేడ్ యూనియన్లు లేకుండానే ఆర్టీసీ పరిపాలన నడుస్తోంది. కనీసం తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితి కూడా లేదని కార్మికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడ్డాయి. యాజమాన్యం, ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మంగళవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 

రూ.4,750 వేల కోట్ల బకాయిలు

ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం సుమారు రూ.4,750 కోట్ల మేర బకాయి పడిందని, వడ్డీతో కలుపుకుంటే రూ.5 వేల కోట్లు దాటుతుందని యూనియన్ల నాయకులు చెప్తున్నారు. పీఎఫ్, సీసీఎస్, ఎస్సార్బీఎస్ బకాయిల విడుదలలో ఆర్టీసీ యాజమాన్యం తాత్సారం చేస్తోందని విమర్శిస్తున్నారు. 2013లో వేతన సవరణ చేయాల్సిన అప్పటి సర్కారు చేయలేదు. 2015లో స్వరాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 44 శాతం పేస్కేల్‌తో 47 వేల మంది కార్మికులకు వేతన సవరణ చేస్తున్నట్టు ప్రకటించింది.

2013లో ఉన్న బకాయిలను కొంత మేర చెల్లించింది. తర్వాత డబ్బులు లేవంటూ చేతులెత్తేసింది. మిగతా డబ్బు 8.5 శాతం వడ్డీతో చెల్లించేందుకు హామీ ఇస్తూ బాండ్లు ఇచ్చింది. 2015 అక్టోబర్ 1న కార్మికులకు చెల్లించాల్సిన డబ్బులకు సంబంధించి బాండ్ పేపర్లు ఇచ్చింది. బాండ్ పేపర్ల గడువు 2020 అక్టోబర్ 1 తోనే ముగిసింది. కార్మికుల వద్ద ఉన్న బాండ్లను భద్రంగా ఉంచుకోవడమే ఇప్పుడు కష్టంగా మారింది. గడువు ముగిసి దాదాపు 4 ఏళ్లు అవుతున్నా యాజమాన్యం స్పందించడం లేదు.

బాండ్ల రూపంలో డబ్బులు వస్తాయని భావించిన వివిధ అవసరాలకు అప్పులు చేసి వాటిని చెల్లించలేక తిప్పలు పడుతున్నట్టు కార్మికులు వాపోతున్నారు. కార్మిక సంక్షేమ నిధి (సీసీఎస్) నుంచైనా కొంత తీసుకొని అప్పులు చెల్లిద్దామనుకుంటే ఆ నిధులు కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. 2014 నుంచి ఎన్‌క్యాష్‌మెంట్ లీవ్స్ (ఈఎల్స్), 6 నెలలకోసారి ఇచ్చే కరువు భత్యం (డీఏ) కూడా ఇవ్వడంలేదని వాపోతున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికంటే ఎక్కువగా దగా పడింది తామేననే భావన కార్మికుల్లో నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు యాజమాన్యాన్ని కలిసినా లాభం లేకుండా పోయిందని కార్మికులు, యూనియన్ల నేతలు పేర్కొంటున్నారు. ‘ఎండీ గారూ.. మా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు..’ అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

నల్లబ్యాడ్జీలతో ఆగిపోం

తెలంగాణ కోసం కొట్లాడిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు, 9 నెలలు అవుతున్నా కనీసం ట్రేడ్ యూనియన్ పునరుద్ధరణ చేయలేదు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించడంలేదు. మాకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు రూ.5 వేల కోట్లను చెల్లించే విషయంలో ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే మంగళవారం రాష్ట్రమంతా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపాం. సమస్యను పరిష్కరించకుంటే న్లబ్యాడ్జీలతో నిరసనతోనే ఆగిపోం. దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. 

 థామస్‌రెడ్డి, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   

సమస్యలు పరిష్కరిస్తారనే వెంట నడిచాం

ఆర్టీసీ కార్మికుల సమస్యల న్నింటినీ పరిష్కరిస్తామని మ్యా నిఫెస్టోలో పెట్టినందునే యూ నియన్లను వదిలి ఐఎన్‌టీయూసీకి అనుబంధంగా చేరాం. కానీ 9 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. పెండింగ్ బకాయిల చెల్లింపు విషయంలో సర్కారు, యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నా యి. వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించకుంటే మా యూనియన్ తరఫున మరో పోరాటానికి సిద్ధం.

 రాజిరెడ్డి, 

ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి  

కార్మికుల సొమ్ముతో సంస్థను నడుపుతున్నారు

ఆర్టీసీ యాజమాన్యం కార్మికు లకు అన్ని రకాల బకాయిలు కలిపి సుమారు రూ.5 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉం ది. కానీ ప్రస్తుతం ఉన్న ఎండీ మా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 4 నెలల నుంచి మహాలక్ష్మి పథ కం బకాయిలు రూ.1,400 కోట్లు ప్రభు త్వం చెల్లించనే లేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలతో సంస్థ ను నడుపుతున్నట్టు అనిపిస్తోంది. యా జమాన్యం వైఖరి ఇలాగే ఉంటే రాబో యే రోజుల్లో జేఏసీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం.

 ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్  

ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు 

చెల్లించాల్సిన బకాయిలు (రూ.కోట్లలో)