calender_icon.png 28 April, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రేషన్‌కార్డులు ఇంకెప్పుడు?

28-04-2025 01:50:17 AM

  1. లక్షలాది మంది పేదల ఎదురుచూపు.. 18 లక్షల వరకు దరఖాస్తులు
  2. ఇప్పటివరకు ఎంపిక చేసింది 1.26లక్షలు మాత్రమే 
  3. సంక్షేమ పథకాలకు, వైద్యానికి రేషన్‌కార్డులే ప్రామాణికం
  4. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సామాన్యులు 
  5. సన్నబియ్యం తినడానికి నోచుకోని పరిస్థితి 

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలం దాటుతున్నప్పటికీ..రేషన్‌కార్డుల జారీ అదిగో..ఇదిగో అంటూ ప్రభుత్వం చెబుతున్నా.. కొత్త కార్డులు మాత్రం జారీ కావడం లేదు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కొత్తకార్డులు జారీ చేయకపోవడంతో, లక్షలాది మంది రేషన్‌కార్డులకు నోచుకోలేదు.

పెళ్లిళ్లు చేసుకుని వేరుగా కాపురాలు పెట్టినా పిల్లలు, కుటుంబసభ్యుల పేర్ల నమోదు, తీసివేతల కోసం పలు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో..ప్రజావాణి, మీసేవా కేంద్రాల ద్వారా దాదాపు 18 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో కూడా రేషన్‌కార్డులు లేనివారి వివరాలను వెల్లడించారు. అయితే ఇప్పటివరకు 1.26 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త కార్డులు ఇవ్వనప్పటికీ.. పాతకార్డుల జాబితాలో కొత్త పేర్లు నమోదు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినా.. ఇంకా అమలుకావడం లేదు.

రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి(ఎల్‌వోసీ) దరఖాస్తు చేసుకోవాలన్న, ఆస్పత్రి బిల్లులు సమర్పించి సీఎం రిలీఫ్‌ఫండ్ పొందాలన్న రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే రేషన్‌కార్డుల్లో పేర్లు లేకపోవడంతో సామాన్య, నిరుపేదలు, పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

వడపోతలో జాప్యంతోనే.. 

కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు లక్షల సంఖ్యలో రావడంతో వాటిని వడపోసి, అర్హత కలిగిన కుటుంబాలను ఎంపిక చేయడానికి తీవ్ర జాప్యమవుతోంది. ఇప్పటివరకు ఎంపికచేసిన 1.26లక్షలకు పైగా కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేయలేదు. అయితే వీరికి లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉండటంతో రెండు నెలలుగా బియ్యం పంపిణీ చేస్తున్నారు.

ఇవికాకుండా మరో 4.32 లక్షల కుటుంబాలపై కసరత్తు చేస్తుండగా, మరో 1.50 లక్షల ఒంటరి సభ్యుల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో కొందరు పాతకార్డుల్లోకి వెళ్తారా.. కొత్తగా ఎంపిక చేసిన 1.26 లక్షల జాబితాలోకి వెళ్తారా? లేక 4.32 లక్షల కార్డుల్లోకి చేరుతారా? అనేది పూర్తిస్థాయి కసరత్తు తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధి కారులు చెబుతున్నారు.

ఈ కసరత్తు పూర్తయితే ఐదున్నర లక్షలకు పైగా దరఖాస్తుల సర్వే పూర్తవుతుంది. కానీ దరఖాస్తుల సంఖ్యకు..ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్యకు పోల్చి చూస్తే చాలా తేడా ఉంది. దీంతో సుమారుగా 10 లక్షలకు పైగా కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు మీ సేవా కేంద్రాలతో పాటు కలెక్టర్లు నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఇప్పటికీ దరఖాస్తులు వస్తున్నాయి. అయితే సమగ్ర కుల గణన సర్వేను ప్రతిపాదికన తీసుకుని లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్లు సమాచా రం.  

సన్నబియ్యం తీసుకోలేకపోతున్నాం.. 

కాగా, ఉమ్మడి రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌కార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం  రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పంపిణీ నిరుపేద లబ్ధిదారులకు ఆర్థికంగా కొండంత అండగా మారింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి కుటుంబంలో ఒకరికి 6కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పాతకార్డుల్లో ఉన్న పేర్ల మీదనే సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. కొత్త కార్డుల కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నా.. పేర్లు నమోదుకాకపోవడంతో సన్నబియ్యం చాలామంది తీసుకోలేకపోతున్నారు. 

చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న పేదలు..

చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న పేదలు, కూ లీలు, అసంఘటిత కార్మికులు, నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ ఆర్థిక భరోసాగా మారింది. రేషన్‌కార్డుల ద్వారా ప్రతీనెల సగటున ఒక కుటుంబం 20 నుంచి 30 కిలోలకు పైగానే ఉచితంగా సన్నబియ్యం పొందుతున్నారు.

అయితే  ఈ సన్నబియ్యం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అందకపోవడంతో..బయట మార్కెట్ నుంచి బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. తద్వారా ఆర్థికంగా కుటుంబంపై భారం పడుతుందని కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.