22-02-2025 12:00:00 AM
నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ వెండితెరపై కనిపించే భాగ్యం ఎంతకూ కలుగటంలేదు. ఆమె ఎంతో ఆశగా చేసిన తొలి చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు నోచుకోలేదు. రెండో సినిమాతోనైనా వెండితెరపై కనిపించవచ్చని ఆశ పడిన ఆమెకు నిరాశే ఎదురైంది. ‘ది ఆర్చిస్’తో ఖుషీ కపూర్ నటిగా మారింది. తర్వాత పూర్తి స్థాయి హీరోయిన్‌గా సినిమా చేసేందుకు చాలా సమయమే పట్టింది. చివరకు ‘నదానియన్’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.
ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నటిస్తున్నాడు. శానా గౌతమ్ దర్శకత్వం వహిస్తుండగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇది తప్పక థియేటర్‌లో రిలీజ్ అవుతుందని ఖుషీ పెట్టుకున్న ఆశపై మేకర్స్ నీళ్లు చల్లేశారు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆమె తొలి చిత్రం ‘ఆర్చిస్’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. ఖుషీ మరో సినిమా కమిటై, అది విడుదల కావడానికి మరో ఏడాది కాలంపైనే పడుతుంది. ఈ లెక్కన పెద్ద తెరపై కనిపించే భాగ్యం కోసం ఖుషీ మరింత కాలం ఎదురుచూడక తప్పదన్న మాట!