calender_icon.png 22 December, 2024 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదరంగం ఒలింపిక్స్‌ను చేరేదెప్పుడు?

27-10-2024 12:00:00 AM

భారత్‌లో మంచి ఆదరణ కలిగిన క్రీడ చదరంగం. ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ రాకతో దేశంలో ఈ ఆట యువ భారతానికి ప్రేరణగా నిలిచింది. చదరంగం ఆట నాటి ‘చతురంగ క్రీడ’నుంచి వచ్చిందని తెలుస్తున్నది. చెన్నై నగరాన్ని ‘చెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణిస్తారు.

పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారిలోనూ చెస్ క్రీడపట్ల అత్యంత ఆదరణ, ఆసక్తి నెలకొని ఉంది. జైలులో శిక్ష పడిన లేదా అభియోగాలతో జైలు కెళ్లిన ఇన్‌మేట్స్ కూడా చెస్ ఆడతారు. చదరంగం బోర్డుపై మొత్తంగా 204 చతుర్బుజాలు (గడులు) ఉంటాయి. వీటిలో 64 గడులు మాత్రమే ఆటకు ప్రధానమైనవి.

ఇవి నలుపు, తెలుపు రంగువి. ఆటగాడి మేధో చురుకుదనానికి ప్రతీకగా, ఇండోర్ క్రీడగా చెస్ (చదరంగం) క్రీడకు మంచి పేరుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయడం, రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి పావులు కదపడం, ప్రత్యర్థి ఆలోచనలను అంచనా వేసి చెక్ పెట్టి విజయ పతాకం ఎగురవేయడం ఈ క్రీడ ప్రత్యేకత. హంగేరి, బుడాపెస్ట్‌లో నిర్వహించిన 2024 చెస్ ఒలింపియాడ్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో భారత జట్లు చారిత్రాత్మకంగా ప్రథమ స్థానాల్లో నిలవడం హర్షదాయకం. 

ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా దేశాల్లో 60.5 కోట్లమంది చెస్ క్రీడాకారులు ఉన్నారు. వీరిలో 80 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇలాంటి క్రీడకు మంచి ఆదరణ ఉంటేనే యువతలో మేధో వికాసం సిద్ధిస్తుంది. ప్రతి ఏట ప్రపంచ చెస్ సమాఖ్య నేతృత్వంలో రీజినల్, కాంటినెంటల్, వరల్డ్ చెస్ చాం పియన్‌షిప్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు

అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐడీఈ) లేదా వరల్డ్ చెస్ ఫెడరేషన్‌కు కూడా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గుర్తింపు ఉన్నప్పటికీ ఒలింపిక్స్ జాబితాలో నేటికీ చదరంగం క్రీడకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యకరం. నేడు ఒలింపిక్ క్రీడల జాబితాలో 241 క్రీడలు ఉండగా, పది వేలకు పైగా క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు.

1924 నుంచి చెస్ క్రీడను ఒలింపిక్స్ జాబితాలో చేర్చాలనే విఫల యత్నాలు జరుగుతున్నాయి. సిడ్నీ ఒలింపిక్స్-2000లో చదరంగాన్ని ఎగ్జిబిషన్ క్రీడగా ఆడించినప్పటికీ ఒలింపిక్ క్రీడల ప్రధాన జాబితాలో నేటికీ చేర్చలేదు. ఒలింపిక్ క్రీడగా చెస్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ క్రీడను ఒలింపిక్ క్రీడగా అనుమతించాలని చెస్ ఆటగాళ్లు, ఇతర క్రీడాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

‘ఎఫ్‌ఐడీఈ’ కార్యవర్గం తరుచుగా ‘ఐఓసీ’తో ప్రత్యక్ష అభ్యర్థనలను సమర్పిస్తున్నది. నేడు చెస్ క్రీడను ఒలింపిక్ ఒక ‘క్రీడ’గా మాత్రమే గుర్తించారు. ఈ అంశాలన్నీ కలిసి, రానున్న రోజుల్లో చెస్ మరో ఒలింపిక్ స్పోర్ట్‌గా గుర్తింపు రాగలదని క్రీడాభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. నెమ్మదిగా, ఓపికగా ఆడే చదరంగం క్రీడ ఫలితం రావడానికి సమయం ఎక్కువ పట్టడమూ దీనికి ఒక ప్రతిబంధకంగా, వీక్షకుల ఓపికను పరీక్షించే విధంగా మారిందని చెబుతున్నారు.

ప్రతిబంధకాలను అధిగమిద్దాం

నేడు చెస్ క్రీడలో కూడా భారీ మార్పులు వచ్చా యి. ఆటలో వేగం పెరిగింది. ప్రజాదరణా విపరీతంగా పెరుగుతోంది. భారత్‌లాంటి దేశాల్లో దీనికి వేల సంఖ్యలో ప్రేక్షకులు ఉంటున్నారు. ఐఓసీ, ఎఫ్‌ఐడీఈ, సభ్య దేశాల క్రీడా శాఖామంత్రులు, దేశాల చదరంగ సమాఖ్యలు కలిసి సమాలోచనలు చేసి, సత్వరమే చెస్ ఆటను ఒలింపిక్ జాబితాలో చేర్చాలని ప్రపంచ ప్రజలు కోరుతున్నారు.

చెస్ క్రీడ ఒలింపిక్స్ జాబితాలో చేరితే ఆ ఆటపట్ల కూడా అంతర్జాతీయ క్రీడా భిమానుల దృష్టి పడుతుంది. అప్పుడు చదరంగం క్రీడాకారుల సంఖ్య కూడా పెరుగుతుంది. వందేండ్లకు పైబడిన చరిత్ర కలిగిన ఒలింపిక్ క్రీడల జాబితాలో చెస్ చేరడం సమీప భవిష్యత్తులో ఖాయంగానే తోస్తున్నది.

ప్రారంభ దశలో పరిమిత (20 కన్న తక్కువ) దేశాలకు మాత్రమే అవకాశం కల్పించడం, టీమ్ ఈవెంట్‌గా మాత్రమే తీసుకోవడం, వింటర్ లేదా సమ్మర్ ఒలింపిక్స్ జాబితాలో చేర్చడం లాంటి పలు మార్గాలు ఐఓసీ ముందు ఉన్నాయి.

మోసం చేయడానికి ఆస్కారాలు ఉండడం, శారీరక శ్రమ లేక పోవ డం, ప్రేక్షకులు తక్కువగా ఉండడం, సరైన వేదికలు అందుబాటులో లేక పోవడం వంటి పలు కారణాలతో చదరంగ క్రీడకు అభిమానులు తగ్గారని చెబుతున్నారు. అత్యంత ప్రజాద రణ పొందిన క్రికెట్, చెస్, క్యారమ్ లాంటి ప్రజాదరణ పొందిన క్రీడలు నేటికీ ఒలింపిక్స్ జాబితాలో చేరకపోవడం విచారకరం.

చెస్‌ను ఒక సాధారణ క్రీడాగా కాకుండా మేధో వికసిత క్రీడగా మాత్రమే భావించడం కూడా దీనికి ప్రతిబంధకంగా మారుతున్నది. మేధో పరిణతికి కొలమానంగా భావించబడే చదరంగం కూడా రానున్న రోజుల్లో ఒలింపిక్ క్రీడల జాబితాలో చేరాలని కోరుకుందాం. 

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి