డా. తిరునహరి శేషు :
తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనే డిమాండ్ కేంద్రంగా బీసీలు సంఘటితమవుతున్న ఛాయలు కనపడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కూడా బీసీల డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలలో బీసీ అజెండా కీలకం కాబోతుందనే సంకేతాలు కనపడుతున్నాయి.
బీసీలు సగం, బీసీలకు సగం,ఆర్థికంలో సగం, అవకాశాలలో సగం అని బలహీన వర్గాలు దశాబ్దాలుగా నినదిస్తున్నప్పటికీ కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బలహీన వర్గాల సహజ న్యాయ డిమాండ్లపై కన్నెతైనా చూడలేదనేది నగ్నసత్యం.
78 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో బలహీన వర్గాల స్థితిగతులపై కాకా కలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చిన రిపోర్టులను పరిగణలోకి తీసుకోకపోవటమే వెనకబడిన తరగతుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతున్నది. దశాబ్దాలుగా ఉన్న బలహీనవర్గాల డిమాండ్లలో ఒకటైన జాతి ఆధారిత కులగణన దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను ఉద్యమంవైపు కదలిస్తున్నట్లుగానే కనబడుతున్నది.
తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనే డిమాండ్ కేంద్రంగా బీసీలు సంఘటితమవుతున్న ఛాయలు కనపడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కూడా బీసీల డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీసీ అజెండా కీలకం కాబోతుందనే సంకేతాలు కనపడుతున్నాయి.
దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో,ప్రత్యేక తెలంగాణలోనూ అధికారంలో, సంక్షేమంలో బీసీలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా దక్కటం లేదనే అసంతృప్తి బీసీ వర్గాలలో గూడు కట్టుకొని ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనైనా బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశించారు కానీ ‘నానాటికి తీసి కట్టు నాగం బొట్టు’ అన్న చందంగా బీసీల పరిస్థితి తెలంగాణలో తయారయింది. కాబట్టి బీసీలలో గూడు కట్టుకున్న అసంతృప్తి బద్దలవ్వటానికి బీజాలు పడుతున్నట్లుగానే కనిపిస్తుంది.
అధికారం అందని ద్రాక్ష
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ బలహీన వర్గాలకు అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 58 సంవత్సరాలు కొనసాగిన సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ, దశాబ్దపు తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రిగా ఒక్క బీసీకి కూడా అవకాశం దక్కలేదు.
సమైక్యాంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే ఒక్క సామాజిక వర్గంనుండే పదిమంది నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా మూడు పర్యాయాలు అగ్రవర్ణాలకే అవకాశం దక్కింది. బీసీలకు రాజ్యాధికారం అటుంచి రాజ్యాధికారంలో సరైన ప్రాతినిధ్యం కూడా దక్కటం లేదు.
జనాభా దామాషా ప్రకారంగా మంత్రివర్గంలో కనీసం 8 మంత్రి పదవులు దక్కాలి. కానీ గత ప్రభుత్వం మంత్రివర్గంలో నలుగురికి అవకాశం కల్పించి ఒకరిని మధ్యలోనే తీసివేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రివర్గంలో రెండు మంత్రిపదవులు మాత్రమే బీసీలకు కేటాయించారు. ఈ పది సంవత్సరాలలో ఏ పార్టీకూడా అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఎంబీసీ) ఒక్క మంత్రి పదవిని కూడా కేటాయించలేదు.
అలాగే గత శాసనసభలో 23 మంది బీసీ శాసనసభ్యులు ఉంటే ప్రస్తుత శాసనసభలో ఆ సంఖ్య 21కి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి 21 మంది బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వటం. గత నాలుగు శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో బీసీల ప్రాతినిధ్యం పట్టుమని పాతికమంది కూడా లేరంటే శాసనసభలో బీసీల ప్రాతినిధ్యం ఎంత తక్కువ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.
ఇక 17 లోక్ సభ స్థానాలలో బీసీల ప్రాతినిధ్యం రెండు, మూడు స్థానాలకే పరిమితం. అంటే రాజ్యాధికారం దక్కకపోగా మంత్రివర్గంలో అరకొర ప్రాతినిధ్యం, చట్టసభలైన శాసనసభలో, లోక్ సభలోనూ బీసీల ప్రాతినిధ్యం కూడా దయనీయం. చట్టసభలలో ఇలా ఉంటే ఇక స్థానిక సంస్థలలో మరీ దారుణం.
స్థానిక సంస్థలలో 1994 నుండి బీసీలకు కల్పించిన రిజర్వేషన్లతో ఇప్పుడిప్పుడే స్థానిక నాయకత్వం బలపడుతుంటే 2019లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి తగ్గించి బీసీలకు మరింత అన్యాయం చేసిందనే చెప్పాలి.
అధికారంలో బీసీల ప్రాతినిధ్యం ఎలా ఉందంటే ‘ఓట్లు మావి సీట్లు మాత్రం మావి కావు’ చందంగా ఉంది. బీసీలను ఓట్లు వేసే యంత్రాలు గానే పార్టీలు భావించటం వలన అత్యధిక జనాభా గల బీసీలకు అధికారంలో అత్యల్ప ప్రాతినిధ్యమే దక్కింది.
సంక్షేమ చిరునామా ఎక్కడ?
పాలకులు, ప్రభుత్వాలు బీసీల సంక్షేమాన్ని గాలికి వదిలేసి బడ్జెట్లలో అరకొర నిధులనే కేటాయించారు. బీసీల సంక్షేమం కోసం ఒకటి అరా సంక్షేమ పథకాలు ప్రకటించినా వాటిని చిత్తశుద్ధితో అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభు త్వం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకమే ఇందుకు ఉదాహరణ.
10 సంవత్స రాల బీఆర్‌ఎస్ పాలనా కాలంలో ప్రభు త్వం 10 బడ్జెట్లు ప్రవేశపడితే ఏ ఒక్క బడ్జెట్‌లోనూ 54 శాతం ఉన్న బీసీ జనాభాకు మూడు శాతం నిధులు కూడా కేటాయించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి 20వేల కోట్ల రూపాయలను కేటాయించి ఐదు సంవత్సరాలలో బీసీల సంక్షేమానికి లక్ష కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తామనే హామీని ఇచ్చిం ది.
కానీ తన తొలి బడ్జెట్ లో కేవలం 9,000 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. మొత్తం బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి మూడు శాతం నిధులు మా త్రమే కేటాయించి కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడలేదనే విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నది. బీసీ కార్పొరేషన్‌కు, ఎంబీసీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో నిధుల కోత పెట్టారు. కుల ఫెడరేషన్లను నిర్వీర్యం చేశారు.
బీసీ విద్యార్థులకు చెల్లించే ఫీజు రీయింబర్స్ మెంట్‌పై ఆంక్షలు పెట్టి బీసీల సంక్షేమాన్ని నీటి మీద రాతలుగా మార్చేశారనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్థితులలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదనే అసంతృప్తి బీసీవర్గాలలో కలుగుతున్నది.
వెనుకబాటుపై ఉద్యమం
దశాబ్దాల బీసీల వెనకబాటుపై కామారెడ్డి డిక్లరేషన్ కేంద్రంగా బీసీలు ఉద్యమ బాట పట్టినట్లుగానే కనిపిస్తున్నది. ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే డిమాండ్ వెనుకబడిన వర్గాలను ఒక సంఘటిత శక్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అణిచివేతనుండే ఉద్యమాలు పుట్టుకు వస్తాయి.
దశాబ్దాల అణచివేతపై బీసీల మెదడులో ఆలోచన మొదలవ్వాలని బీపీ మండల్ చెప్పిన విధంగానే వెనుకబాటుతనంపై, ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీసీ వర్గాల నుండి ప్రశ్నించడం ప్రారంభమైంది. ఇక ఉద్యమ రూపం తీసుకోవటమే మిగిలి ఉందని ప్రభుత్వాలు గమనించాలి. ‘ఆరక్షణ్ లాగూ కరో, వర్నా కుర్చీ ఖాళీ కరో’ అని కాన్షీరామ్ ఉద్యమిస్తే మండల్ కమిషన్ రిపోర్ట్‌లోని రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి.
ఇప్పుడు ‘జాతి గినతీ కరో, వర్నా కుర్చీ ఖాళీ కరో’ నినాదంతో వెనుకబడిన వర్గాలు జాతి ఆధారిత కులగణన సాధించాలి. అధికారంలో, సంక్షేమంలో బీసీలకు సరైన వాటా దక్కినప్పుడే ‘వికసిత భారత్’ లక్ష్యం నెరవేరుతుందని పాలకులు గుర్తించాలి. బీసీల సహజ డిమాండ్లపై, సంక్షేమంపై పాలకులు సానుకూలంగా స్పందించాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9885465877