- సూర్యాపేటలో ఆటో నగర్, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు నిర్ణయించిన గత ప్రభుత్వం
- ఇమాంపేటలో 102 ఎకరాలలో ప్రతిపాదనలు
- 2023 ఆగష్టులో శంకుస్థాపన
- నేటికీ మొదలు కాని పనులు
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదరుచూస్తున్న ప్రజలు
సూర్యాపేట, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): సూర్యాపేట పారిశ్రామికంగా అభివద్ధి చెందాలనే సంకల్పంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆటోనగర్, ఇండస్ట్రీయల్ పార్కు ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదు. ఏండ్ల కాలం నుంచి కలగా ఉన్న ఆటో నగర్, ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు 2023 ఆగస్టులోఅడుగులు ముందుకు పడి.. ఆటో నగర్ ఏర్పాటుకు శంఖుస్థాపన చేయగా, ఇండస్ట్రీయల్ పార్కుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు. కాని నేటికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాగా పనులు ఒక్క అడుగుకూడా ముందుకు సాగలేదు.
102 ఎకరాలలో..
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేటలో ఆటోనగర్ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 2023 ఆగష్టులో శంకుస్థాపన చేశారు. సుమారు 102 ఎకరాలలో ఆటోనగర్, ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించి 33.24 ఎకరాల భూమిని సేకరించారు.
సేకరించిన భూమి తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పోరేషన్కు అప్పగించారు. ఇంకా 69.16 ఎకరాల భూమి సేకరించ వలసి ఉండగా ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలని నిర్ణయించారు. ఇండస్ట్రియల్ పార్కు , ఆటోనగర్ ఏర్పాటు రూ.16కోట్ల నిధులు అవసరమని ప్రాధమికంగా అంచనా వేసి అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఆటో నగర్లో ఈఎస్‌ఐ ఆస్పత్రి, కార్మిక సంక్షేమ భవనం విశామైన రోడ్లు, ప్రధాన రహదారి నుంచి చివరి వరకు విశాలమైన రోడ్లు, కమాన్ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ రెండు ప్రతిపాదనలు ఒకే చోట ఉండటంతో ఉపాధికి కేరాఫ్గా ఇమాంపేట మారతదని అందరు భావించారు.
అయితే కొన్ని రోజులు అధికారులు హాడాహుడి చేసి తరువాత పట్టించుకోలేదు. ఏర్పాటు పూర్తి అయితే దాదాపు 10వేల మందికి ఉపాధి లబించే అవకాశం ఉన్న ఉపయోగం లేకుండా పోయింది
ఏళ్ల కల నేరవేరేదెప్పుడు...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సూర్యాపేట అతి పెద్ద పట్టణం. అంతే కాకుండా జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో వ్యాపారపరంగా కూడా అగ్ర గామిగా మారింది.. ఇక్కడ దాదాపు నాలుగైదు దశాబ్ధాల నుంచి చిన్న, పెద్ద వాహనాలు భారీగా ఉండగా మెకానిక్లు సైతం అదే స్థాయిలో జీవనోపాధి పొందు తున్నారు. దాంతో ఏళ్లుగా మెకానిక్లు ఇక్కడ ఆటోనగర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
అంతే కాకుండా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుతో చిన్న, మద్య తరహా పరిశ్రమలు ఏర్పాటు జరిగి వేలాది మంది స్వయం ఉపాధి దొరికేది. గత ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఇండస్ట్రీ యల్ పార్కు, ఆటోనగర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసిన... ఈ ప్రభుత్వం నిర్ణయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.