calender_icon.png 10 January, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చేవేళ!

10-01-2025 12:00:00 AM

‘వైకుంఠం’ అంటే ‘కుంఠనమే లేని చోటు’. అంటే, సత్వగుణమే తప్ప రజో, తమో గుణాలు లేని ప్రదేశం. ‘వికుంఠులు’లో ‘విహి’ అంటే ‘పరమాత్మ’. ఆయనను వదిలి ఉండనివారు. ఉదా॥కు అనంత, గరుడ, విశ్వక్సేన వంటి వారందరూ ఏనాడూ పరమాత్మను వదిలిపెట్టరు. స్వామి ఏ అవతారం ఎత్తినా వీళ్లంతా ఏదో ఒక రూపంలో ఆయన వెంట ఉండవలసిందే.

ఇలా తన భక్తులతో ఏనాడు విరహం, వియోగం లేనివాడు. అందుకే స్వామిని వైకుంఠుడు అంటాం. అలాంటి స్వామి ఈరోజు మానవులకేకాక ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, అశ్విని దేవతలతోసహా మొత్తం 37 కోట్ల (33 +) దేవతలకు, ఇంకా ఒకేసారి తనను దర్శించుకోవటానికి వచ్చిన భక్తులకు దర్శనంతోపాటు పాపాలను హరింపజేసుకొనేందుకు ఉత్తర ద్వారం గుండా బయటికి విచ్చేస్తారు. అందువల్ల ఈ ఏకాదశికి ‘ఉత్తర ద్వార దర్శనం’, ‘వైకుంఠ ఏకాదశి’ అనే విశిష్టతతో కూడిన పేర్లు వచ్చాయి.

మోక్షోత్సవ దినం

‘వైకుంఠ ఏకాదశి’ సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తట్టుకోలేక దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠం చేరి, మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను విన్నవించారు. ఏ ఏకాదశి రోజు స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయమివ్వడం వల్ల దేవతల బాధ నివారణ అయ్యిందో ఆ ఏకాదశే ‘వైకుంఠ ఏకాదశి’గా స్థిరపడింది.

మధు కైటభులను శ్రీమహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్యరూపాలతో దివ్యజ్ఞానాన్ని పొంది, “దేవా! వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశీ పూజ గావించి, ఉత్తర ద్వార మార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీ వైకుంఠ ప్రాప్తి కలిగించమని ప్రార్థించారు. స్వామి తథాస్తు అన్నందున దీనికి ‘మోక్షోత్సవ దిన’మని కూడా పేరు వచ్చింది.

ముక్కోటి దేవతల బాధలను నివారించిన ఏకాదశి కనుక ‘ముక్కోటి ఏకాదశి’గానూ మారింది. వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక ‘వైకుంఠ ఏకాదశి’ అని, భగవత్ దర్శనం కావించేది కనుక ‘భగవదవలోక దిన’మనీ పేర్లు వచ్చాయి. 

‘వైకుంఠ ప్రాప్తి’ అంటే?

వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ, ఏకాదశి అని రెం డు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం అకారాంత పుం లింగం. ఇది విష్ణువునూ, ఆయన ఉండే  స్థానాన్ని సూచిస్తుంది. చాక్షష మన్వంతరంలో వికుంఠ అనే ఆమెనుంచి అవతరించినందున విష్ణువు వైకుంఠుడయ్యాడని ఉంది. స్వామి జీవులకు నియంత, సాక్షి. భూతాల స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు కూడా.

వైకుంఠం అంటేనే శ్వేత ద్వీపమైన విష్ణువు స్థానం. పునరావృత్తి లేనిది, శాశ్వతమైనది అయిన విష్ణుదేవుని పరమధామం. జీవులు అటువంటి వైకుంఠుని అర్చించి, ఉపాసించి, వైకుంఠాన్ని చేరడమే నిజమైన ముక్తి. శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుంచి వెలువడిన 11వ కళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది. బహుళ ఏకా దశి నాడు చంద్రమండలం నుంచి 11వ కళ  సూర్యమండలాన్ని చేరుతుంది.

ఇలా రాకపోకల వల్లే ఏకాదశి అనే పేరు సార్థకమైంది.‘ఏకాదశ్యాముపవసే న్న కదాచిదతిక్రమేత్’ అన్నారు. ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. ఉపవాసం నాడు ఉపవాసః స విజ్ఞేయః, సర్వభోగ వివర్జితః అని శాస్త్రవ చనం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం మాత్రమే కాదు, పాపకృత్యాలకు దూరంగా ఉండి, సకల భోగాలను వదిలి, పుణ్యకార్యాలు చేయడం.

దివ్యానుభూతి కోసం..

ఏకాదశి అంటే 11 ఇంద్రియాల సమూహం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఒక మనసు. వికుంఠం అంటే దెబ్బతిననిది. ఇంద్రియాలు వికుంఠాలు అయినప్పుడే వైకుంఠ సమార్చన ప్రశాంతంగా జరుగుతుంది. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహా వైభవంగా జరుగుతుంది.

దానిని కళ్లారా చూడాలని తపించిపోయే వారెందరో. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ముక్కోటి ప్రదక్షిణా మార్గం రంగుల విద్యుత్ కాంతులు, పూలమాలలతో మనోహరంగా అలంకారితమవుతుంది. శ్రీ స్వామివారికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రదక్షిణా మార్గంలో దర్శనానంతరం వెళ్లిన భక్తులు ఒక విశిష్ట దివ్యానుభూతిని పొందుతారు. 

- వేముగంటి శుక్తిమతి