- గౌరవెళ్లి రిజర్వాయర్ పనుల పూర్తికి క్యాబినెట్ ఆమోదం
- రూ.437 కోట్ల విడుదలకు మోక్షం
- 1.06 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు
సిద్దిపేట, ఆగస్టు 2 (విజయక్రాంతి): మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాల్లోని రైతులకు సాగునీరందించాలని ఉమ్మడి రాష్ట్రంలో 2007 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెళ్లి రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో అయితే హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు వరంగల్ జిల్లాలోని పలు గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందుతుంది.
వాస్తవానికి ఈ రిజర్వాయర్ శంకుస్థాపన చేసిన 5 ఏళ్లలోపు పూర్తి కావాల్సి ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యం, అప్పట్లో తెలంగాణ ఉద్యమం కూడా కొంతమేరకు అడ్డంకిగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును సందర్శించి రీడిజైన్ చేసి 1.4 టీఎంసీలున్న రిజర్వాయర్‌ను 8.23 టీఎంసీలకు పెంచారు. దీంతో అందుకు అవసరమైన భూ సేకరణ చేయడానికి మరింత సమయం పట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండానే రిజర్వాయర్ ఎత్తు పెంచారని భూ నిర్వాసితులు జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. కానీ ఇంకా కేసు ఫలితాన్ని వెల్లడించలేదు.
నెరవేరనున్న రైతుల కల..
గౌరవెళ్లి రిజర్వాయర్ పనులు పూర్తిస్థాయిలో అయిపోతే 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరు అంది రైతుల కల నెరవేరుతుంది. ఈ రిజర్వాయర్‌కు రెండు ప్రధాన కాల్వలు ఉన్నాయి. కుడి కాల్వ ద్వారా 90 వేల ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 16 వేల ఎకరాలు సాగవుతుంది. రిజర్వాయర్ పనుల్లో భాగంగా కాల్వల నిర్మాణం కోసం ఇంకా 2,800 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. అనుమతులు లేకుండా రిజర్వాయర్ ఎత్తు పెంచారంటూ గుడాటిపల్లి భూనిర్వాసితులు హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. గతేడాది నిర్మాణ పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్వాసితులపై కేసులు పెట్టి, పోలీసుల బందోబస్తు మధ్య నిర్మాణాలు చేపట్టింది.
8.23 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లోకి 2 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు 32 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు మోటార్లను బిగించారు. 2022 జూలై 31న పది నిమిషాల పాటు మొదటి ట్రయల్ రన్ చేశారు. రెండు రోజులకు ఒకటి చొప్పున మిగతా రెండు మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించారు. మిడ్‌మానేరు ద్వారా బెజ్జెంకి మండలంలోని తోటపల్లి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గౌరవెళ్లి రిజర్వాయర్‌లోకి నీటిని నింపుతారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా మేరకు రూ.409 కోట్లతో చేపట్టిన సొరంగం పనులు పూర్తయినప్పటికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన రీడిజైన్ వల్ల అదనంగా రూ.380 కోట్లతో మిగతా పనులు చేపట్టారు.
తోటపల్లి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో రేగొండ వద్ద గౌరవెళ్లి రిజర్వాయర్ ఉంటుంది. ఇందులో 12 కిలోమీటర్ల మేర సొరంగం ఉంటుంది. 5.6 మీటర్ల టన్నెల్‌లో 32 క్యూబిక్ నీటిని తీసుకెళ్లే విధంగా సొరంగాన్ని నిర్మించారు. 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల లోతు నీళ్లసంపును, 61 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు, 130 మీటర్ల లోతుతో పంప్‌హౌస్ నిర్మాణం చేశారు. ట్రయల్ రన్ తర్వాత ఈ ప్రాజెక్టులోకి 1 టీఎంసీ నీటిని నింపారు.
మంత్రి పొన్నం కృషితో..
17 ఏళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ పనులు సాగు తూ వచ్చాయి. రిజర్వాయర్‌లో నీటిని నింపే అవకాశం ఉన్నప్పటికీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం లేకపోవడం, రిజర్వాయర్ ముంపు బాధితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల రిజర్వా యర్ అసంపూర్తిగా మిగిలింది. తాజాగా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృషితో గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ రిజర్వాయర్‌కు రూ.437 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపారు. దీంతో రిజర్వాయర్ పనులు అన్నింటినీ పూర్తి చేసి వచ్చే సీజన్‌లోపు రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.