30-01-2025 12:00:00 AM
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి :
భారతీయ వ్యవసాయం క్రీస్తుపూర్వం (బీసీ)9000 నాటికి ప్రారంభమైన మొక్కల పెంపకం, పంటల పెంపకం ఫలితంగా ప్రారంభమైందని కొ ందరు పేర్కొన్నారు. వ్యవసాయం కోసం అభివృద్ధి చేసిన పనిముట్లు ,సాంకేతికతలతో త్వరలోనే స్థిరపడిన జీవితం అనుస రించబడింది. రెండంచెల రుతుపవనాలు ఒక సంవత్సరంలో రెండు పంటలను పండించాయి.
భారతీయ ఉత్పత్తులు త్వరలో వర్తక నెట్‌వర్క్‌కు చేరుకున్నాయి. విదేశీ పంటలు ప్రవేశించాయి. భారతదేశంలోని ప్రజలు దాదాపు 500 బీసీ నాటికి చక్కెర స్ఫటికాలను ఉత్పత్తి చేసే ప్రక్రియను కనుగొన్నారు. స్థానిక భాషలో, ఈ స్ఫటికాలను ఖండ అని పిలుస్తారు. ఇది మిఠాయి అనే పదానికి మూలం.
డబ్ల్యూటీవోలో చేరికతో గడ్డుకాలం
1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో మనదేశం భాగ స్వామిగా మారిన తర్వాత వ్యవసాయానికి గడ్డుకాలం ప్రారంభమైంది. 2014 నుండి అది మరింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ రైతుల ఆత్మహత్యల పరంపర జోరందుకొంటోంది.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రకటించిన ప్రకటించిన కేంద్రం వ్యవసాయరంగాన్నికార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చట్టాలను తీసుకువచ్చింది. ఉత్తర భారత రైతాంగం వీరోచితంగా పోరాడి, సంవత్సర కాలంపాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఆ నల్ల చట్టాలను వెనక్కు తీసుకొనేలా చేశారు.
రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టం చేస్తామని రైతు నాయకులకు హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం 18 నెలలు గడిచినా దాని అమలుకు పూనుకోలేదు. బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కోతలు పెడుతూ, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, డీజిల్ ధరలతో పాటు వ్యవసాయ పరికరాల ధరలను విపరీతంగా పెంచుతూ సేద్యాన్ని భారంగా మారుస్తున్నారు.
గ్రామీణ పేదలకు వేసవిలో పనులు కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని (నరేగా) నీరుగారుస్తున్నారు. 1979నుండి విద్యుత్ రంగంలో సంస్కరణలను అమలు చేస్తూ ఇప్పుడు ఏకంగా రైతులపై పెనుభారాన్ని మోపే నూతన విద్యుత్ సవరణ బిల్లును సిద్ధం చేశారు.
స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర లభించక దేశంలో ఏటా 2లక్షల 28 వేల కోట్ల రూపాయల మేర రైతులు నష్టపోతున్నాడు. రైతు పంటలకు మద్దతు ధర కల్పిస్తామని గంభీర ప్రకటనలు చేసిన కేంద్ర ప్రభుత్వం తాము అలాంటి హామీ ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు చెప్పింది.
వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఏటేటా పెరుగుతు న్నాయి. అటు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ఇటు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దోపిడీ ఫలితంగా రైతులు అప్పుల సుడిగుండంలో కూరుకుపోతున్నారు. సగటున రోజుకు 40మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
దేశంలో చోటు చేసుకొంటున్న ఆత్మహత్యలలో 11శాతం రైతులవేనంటే ప్రమాద ఘంటికలు ఏస్థాయిలో మోగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రభుత్వాలిచ్చే అరకొర సాయం కూడా వీరికి అందటం లేదు.
రైతు గోస పట్టని కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌మాటలకు, ఆచరణకు పొంతన లేకుండా పోయింది. రైతురాజ్యం అంటూ దేశ వ్యాప్తంగా ఊదర గొడుతూ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి న ఆయనకు రాష్ట్రంలోని రైతుల గోస పట్ట లేదు. 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ హామీ నేటికీ అమలు కాలేదు.
రైతుబంధు కౌలు రైతులు, పోడు రైతులకు ఇవ్వకుండా భూస్వాములకు, రియిల్ ఎస్టేట్ వ్యాపారులకు వర్తింప చేశారు. రైతుల పంటలు కొనడానికి తాము మిల్లరమో, వ్యాపారులమో కాదని, ఎవరి పంటను వారు ఎక్కడైనా అమ్ముకోండని చెప్పారు. ప్రకృతి విపత్తుల వలన పంటలు నష్టపోయిన వారికి కనీస సాయం అందించే పరిస్థితే లేదు.
దేశంలో రైతు కూలీలు, గ్రామీణ పేదల బతుకులు మారనంతకాలం దేశం అభివృ ద్ధి చెందిందని చెప్పుకునే గొప్పలకు అర్థమే లేదు. తిండిగింజల ధరలు సామాన్యులకు అందుబాటులో వుండి. ఆహార భద్రతకు గ్యారెంటీ ఉండాలంటే వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాద శక్తులనుండి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
భూమిని సామ్రాజ్య వాదుల చేతుల్లోకి పోకుండా దక్కించుకోవాలంటే రైతు కూలీలు, పేదలు ఐక్యంగా పోరాడాలి. ఆ వైపుగా రైతుకూలీలను సంఘటిత పర్చాల్సిన బాధ్యత రైతుకూలీ సంఘాలపై ఉంది. సిరిసిల్ల, జగిత్యాల రైతాం గ పోరాటాల ప్రేరణతో పురుడు పోసుకొన్న ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం నేడు అఖిలభారత రైతు కూలీ సంఘం( ఏఐకేఎస్)గా ఎదిగి రైతుకూలీల పోరాట వేదికగా కొనసాగుతోంది.
రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రైతు సంఘాలు నిరంతరం పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, తెచ్చిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.
బ్యాంకు రుణాలను మాఫీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగు లు వేసినప్పటికీ ఇంకా 64శాతం రైతులకు రుణమాఫీ కాలేదన్న ఆందోళనలు రోజూ చూస్తున్నాం.
దేశంలో రైతుల ఆత్మహత్యలు
1970ల నుండి భారతదేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ప్రైవేట్ భూస్వాములు , బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేక పోవడంతోనే వీరిలో ఎక్కువ మంది చనిపోతున్నారు. భారతదేశం వ్యవసాయాధా రిత దేశం. గ్రామీణ జనాభాలో దాదాపు 70శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి ఉంది.
ఈ రంగం 2023లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 15శాతం వాటాను కలిగి ఉంది. రైతుల ఆత్మహత్యలకు విశ్లేషకులు అనేక వివాదాస్పద కారణాలను అందించారు. రైతు వ్యతిరేక చట్టాలు, అధిక రుణ భారాలు, ప్రభుత్వ విధానాలు, సబ్సిడీలలో అవినీతి, పంట నష్టం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు వాటిలో ముఖ్యమైనవి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 1995 - 2014 మధ్య 2,96,438 మంది రైతులు ఆత్మహత్యల ద్వారా మరణించారు. 2014 -- 2022 మధ్య తొమ్మిదేళ్లలో వారి సంఖ్య 1,00,474గా ఉంది. దేశంలోని మొత్తం ఆత్మహత్య బాధితుల్లో రైతులు 6.6 శాతం ఉన్నారు. రైతుల ఆత్మహత్యల డేటాను రాష్ట్రాలు తారుమారు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
అందువల్ల వాస్తవ గణాంకాలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. 1960కి ముందు, భారత్ దేశీయ అవసరాలను తీర్చడానికి దిగుమతులు, ఆహార సహాయంపై ఆధారపడింది. 1965,1966లోవచ్చిన రెండు సంవత్సరాల తీవ్ర కరువు భారతదేశం తన వ్యవసాయ విధానాన్ని సంస్కరించాలని , ఆహార భద్రత కోసం విదేశీ సహాయం, దిగుమతులపై ఆధారపడలేమనే వాస్తవాన్ని తెలియజేసింది.
దీంతో దేశం ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి లక్ష్యంపై దృష్టి సారించి ముఖ్యమైన విధాన సంస్కరణలను అవలంబించింది. ఇది దేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది. పంజాబ్ రాష్ట్రం దేశ హరిత విప్లవానికి నాయకత్వం వహించింది .
కుదించుకుపోతున్న సాగు
భారత దేశంలో వ్యవసాయ రంగం రోజురోజుకు తగ్గిపోతోందని పలు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. సారవంతమైన భూములు స్థిరాస్తి భూములుగా మారుతున్నాయి. ఉన్న కొద్దిపాటి భూమిలో కూడా వ్యవసాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ‘ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకు’ అన్నట్లుగా ఎంత డబ్బు సంపాదించినా సమయానికి నాలుగు ముద్దలు తిండి తినాల్సిందే. కాబట్టి ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి యువతను ప్రోత్సహించే దిశగా ప్రణాళికాబద్ధమైన విధానాలను అమలు చేయాలి.