కాంగ్రెస్ అధిష్ఠానం నాన్చివేత ధోరణి
మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల ఆశావహుల్లో నిరుత్సాహం
కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం పెండింగ్‌లోనే..
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతి అంశాన్ని నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తి కావస్తున్నా, పార్టీకి చెందిన పదవులతో పాటు.. ప్రభుత్వ పదవుల నియామకాల్లో స్పష్టత కొరవడింది. అదిగో పులి.. ఇదిగో మేక అన్నట్లుగానే కాంగ్రెస్ అధిష్ఠానవర్గం వ్యవహరిస్తోందని పార్టీ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతుంది. రెండో విడత మంత్రి వర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ, కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎంపిక కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కొందరు సీనియర్లు ఢిల్లీకి వెళ్లడం..
ఏఐసీసీ పెద్దలతో చర్చించి రాష్ట్రానికి తిరిగి రావడం పరిపాటిగా మారింది. దీనితో అధికారగణంలో కూడా నిరుత్సాహం కనిపిస్తోంది. రెండోవిడత మంత్రివర్గ విస్తరణ జరిగితే.. మంత్రుల శాఖల మారుతాయని, మళ్లీ కొత్త మంత్రులు వస్తారని అప్పుడు ఒకేసారి నిర్ణయాలు తీసుకోవచ్చులేనని ధోరణి సీనియర్ అధికారుల్లో కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పనులు కూడా కుంటుపడుతున్నాయని అధికార వర్గాలు చెబుతు న్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నిర్ణయంతో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక.. మంత్రివర్గ విస్తరణ, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవుల పంపకాలు ముడిపడి ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, మొదటి విడతలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా రాష్ట్ర మంత్రి వర్గం లో మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ బెర్తుల కోసం డజన్ మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. మంత్రి వర్గంలో చోటు దక్కని జిల్లాలు, సామాజిక వర్గాల వారిగా లెక్కలు వేసుకుంటూ.. తమకే అంటే తమకే అమాత్య పద వివరిస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చోటు దక్కలేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి గా జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క, కరీంగనర్ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అధిష్ఠానం వెనువెంటనే నిర్ణయాలు తీసుకోదని, ప్రతి అం శాన్ని నాన్చడ మే పనిగా పెట్టుకుంటుందని, తద్వారా పార్టీకి, ప్రభు త్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విషయంలోనూ సాగదీత ధోరణితో పదేళ్లు అధికారానికి దూరం కావాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. 2009 లో ఇచ్చిన ప్రకటన వెనక్కి తీసుకోకుంటే.. తిరిగి 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.