calender_icon.png 25 April, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విస్తరణ ఇంకెప్పుడు?

25-04-2025 01:13:32 AM

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అసంతృప్తి 

ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా.. ఖాళీలు భర్తీచేయరా?

హైదరాబాద్, ఏప్రిల్ 2౪ (విజయక్రాంతి) : మంత్రివర్గ విస్తరణ  వాయిదా పడుతుండటంతో.. ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. తమకు క్యాబినెట్ బెర్తు కచ్చితంగా వస్తుందని అనుకునే వాళ్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే మంత్రివర్గ విస్తరణ.. రెడ్డి సామాజికవర్గం నేతల వల్లే వాయిదా పడుతూవస్తోందని, వాళ్ల పంచాయతీ తేలే వరకు విస్తరణ ఉండదా? అని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల నాయకులు  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు నుంచి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం కావొస్తున్నా.. పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటుకాకపోవడ మేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరు బెర్తులు ఖాళీ గా ఉన్నాయి.

వీటికోసం డజన్ మంది ఎమ్మెల్యేలు పోటీపడుతు న్న విషయం తెలిసిందే. ఈ ఆరింటిలో రెండు లేదా మూడు పదవులు రెడ్డి సామాజికవర్గానికి, ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ లేదా మైనార్టీలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే రెండు అమాత్య పదవులు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ సొంత పార్టీలోనే ప్రధానంగా వినిపిస్తోంది. ఇక బీసీ సంఘాలు కూడా జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న  వెనుకబడినవర్గాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నా యి.

విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. రాజ్యాధికారంలో కూడా సమాన వాటా ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వస్తున్నది. ఇక రాష్ట్రంలో 32 లక్షలకు పైగా ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తున్నారు. లంబాడ సామాజికవర్గం నాయకు లు కూడా మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్న విషయం తెలిసిందే.

బీసీ వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేరు దాదాపు ఖరైనట్లుగానే ప్రచారం జరుగుతుండగా, తెలంగాణలో మరో బలమైన కురుమ సామాజికవర్గానికి చెందిన బీర్ల అయిలయ్యకు, లేదంటే రజక సామాజికవర్గానికి చెందిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలనే డిమాం డ్ వినిపిస్తోంది.  ఇంతవరకు బాగానే ఉన్నా మంత్రివర్గ విస్తరణ ఒకరిద్దరి నేతల వల్ల వాయిదా వేయడం సరికాదనే అభిప్రాయా న్ని కాంగ్రెస్ వర్గాలు విజయక్రాంతితో వ్యక్తం చేశాయి.

అవసరమైతే రెడ్డి సామాజికవర్గానికి కోసం ఒకటో, రెండో రెండు మంత్రి పదవులను పక్కన పెట్టి.. మిగతా నాలుగింటిని భర్తీ చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్‌రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డితో పాటు వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు.

వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిల పేర్లు దాదాపు ఖరారైనట్లుగానే వార్తలు వినిపించిన విష యం తెలిసిందే. అయితే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి పార్టీ  హై కమాండ్ లేఖ రాయడంతో.. మంత్రివర్గ విస్తరణ వాయిదాపడిందనే చర్చ జరుగుతుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. నల్లగొండ జిల్లాలో  ఆయన తనయులు ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎంపీ జయ వీర్‌రెడ్డికి రాజకీయంగా ఇబ్బం ది  కలుగుతుందని, అందుకే రాజగోపాల్‌రెడ్డికి చెక్ పెట్టేందుకే జానారెడ్డి లేఖ రాశారని చర్చ జరుగుతోంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి మంత్రి పదవులను ఆశిస్తున్న విష యం తెలిసిందే.

వివేక్ ఎన్నికల ముందు బీజేపీ నుంచి వచ్చారని, తాను  పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి, కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన తమకే అవకాశం ఇవ్వాల ని ప్రేమ్‌సాగర్‌రావు కోరుతున్నారు. ఇప్పటికే మాల సామాజికవర్గం నుంచి డిప్యూటీ సీఎం భట్టి, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఉండగా, అదే సామాజికవర్గానికి చెందిన వివేక్‌కు ఎలా అవకాశం ఇస్తారనే ప్రశ్న సొంత పార్టీలోనే ఉత్పన్నమవుతోంది.