calender_icon.png 21 October, 2024 | 3:24 AM

కొత్త వాహన చట్టం ఎప్పుడు?

21-10-2024 01:08:40 AM

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వాహన చట్టాన్ని త్వరగా అమలు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ చట్టం అమలు చేయడమే తక్షణ కర్తవ్యమని సామాజిక వేత్తలు పేర్కొంటున్నారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లోకి వచ్చిన తీరుగానే తెలంగాణ సైతం ప్రత్యేకంగా ఓ వాహన చట్టాన్ని రూపొందించింది.

ఇటీవలే ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ కమిషనర్ కె.ఇలంబర్తీ కొత్త వాహన చట్టం విధివిధానాలను వివరించారు. దేశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సారథి వాహన్ పోర్టల్‌ను 28 రాష్ట్రాలు అమలు చేస్తుండగా త్వరలోనే తెలంగాణ సైతం అందులోకి చేరనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణ రవాణాశాఖలో పలు కీలక మార్పులు తీసుకు రానున్నారు. వెహికిల్ స్క్రాప్ పాలసీ, వాహనాల ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు, వాహన్ సారథి పోర్టల్ అమలు, ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయడం, అవగాహన కల్పించడం లాంటి అంశాలపై ఫోకస్ పెట్టారు. భారత మోటారు వాహన చట్టంలోని వాహన్ సారిథి తెలంగాణలోనూ అమలు చేయడం ద్వారా వాహనదారులకు సంబంధించిన అంతరాష్ర్ట ఇబ్బందులకు చెక్ పడుతుందని అధికాలు అంటున్నారు. 

15 ఏళ్లు దాటితే ఇక తుక్కే...

15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు, 8 ఏళ్లు దాటిన కమర్షియల్ వాహనాలను స్క్రాప్ కింద మార్చేయాలి. కాలం చెల్లిన వాహనాలు ఇబ్బడి ముబ్బడిగా రోడ్లపైకి వస్తుండడంతో వాహన కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ తరుణంలోనే రాష్ట్రంలో నూతన వాహన చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. రాష్ట్రంలో దాదాపు మొత్తం వాహనాల సంఖ్య 1.70 కోట్లు కాగా... అందులో సుమారు 10వేలకు పైగా ప్రభుత్వ వాహనాలే స్క్రాప్‌కు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. దాంతో ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తొలుత ప్రభుత్వ వాహనాలనే తుక్కుగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

వాలంటరీ స్క్రాప్ పాలసీతో ట్యాక్స్ రాయితీ..

వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అమలుకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. వాలెంటరీ వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ద్వారా వాహనదారులకు సర్టిఫికెట్లు ఇచ్చి కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే లైఫ్ టాక్స్‌లో రాయితీలు ఇచ్చేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. వాహనాలను తుక్కుగా మారిస్తే లైఫ్ ట్యాక్స్‌లో కనీసం రూ.వెయ్యి నుంచి రూ.50 వేల వరకు ట్యాక్స్ మినహాయింపులు ఒనగూరనున్నాయి.

బైక్‌లకు రూ. వెయ్యి నుంచి రూ. 5వేల వరకు,  ఫోర్ వీలర్ వాహనాలకు అయితే కనీసం రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్ ప్రతిపాదించారు. కొత్తగా కొనుగోలు చేసే వెహికల్ విలువ ఆధారంగా ఈ డిస్కౌంట్ మొత్తం ఉంటుందని అధికారులు తెలిపారు. కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలపాలసీలను అధ్యయనం చేసి తెలంగాణలోనూ అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

వాలంటరీ వెహికల్ పాలసీ ద్వారా వ్యక్తిగత వాహనం 15 ఏండ్లు దాటిన తర్వాత స్వచ్ఛందంగా తుక్కుగా రిజిస్ట్రేషన్ చేయించినవారు తర్వాత రెండేళ్లల్లో కొత్త వాహనం కొనుగోలు చేస్తే లైఫ్ ట్యాక్స్‌లో తగ్గింపు ఉంటుంది. 15 ఏండ్లు దాటిన వాహనాలు తుక్కుకు పంపించకుండా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మాత్రం అదనంగా పన్ను కట్టాల్సిదే. పాత వాహనాలను తుక్కుగా మార్చడం వల్ల రోడ్డు భద్రత పెరగడంబ గాలి కాలుష్యం తగ్గడం, ఇంధనం ఆదా, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని రవాణా శాఖ చెబుతోంది. అయితే స్క్రాప్ వాహనాల కోసం ట్యాక్స్ రాయితీ మరింతగా పెంచాలని వాహనదారులు కోరుతున్నారు. 

వాహనాల ఫిట్‌నెస్ టెస్టింగ్ కోసం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) నిర్మించేందుకు రవాణాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీవో ఆఫీసుల్లో వాహనాల ఫిట్‌నెస్ టెస్టింగ్ సరిగ్గా జరగడం లేదని అధ్యయనాల్లో తేలింది. ఇకపై ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లలో వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఏటీఎస్‌లు రానున్నాయని సమాచారం. ఒక్కో ఏటీఎస్ కోసం రూ. 8 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేసి ఈ ఏటీఎస్‌లను అత్యాధునికంగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకువస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రం, హెచ్‌ఎండీఏ పరిధిలోనూ ఈ ఏటీఎస్‌లు ఏర్పాటు అవుతాయి. ఏటీఎస్‌లు ఏర్పాటు అయ్యాక ప్రస్తుతం ఆర్టీఓ కార్యాలయాల్లో ఉన్న మ్యాన్యువల్ ఫిట్‌నెస్ తనిఖీ విధానానికి స్వస్తి పలకనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన 8 వేల మంది లైసెన్సులను ఇప్పటికే రద్దు చేశారు. రోడ్డు భద్రతపై యూనిసెఫ్ సహకారం సైతం తీసుకుంటున్నారు. కొత్తగా 113 మంది వెహికల్ ఇన్‌స్పెక్టర్లు విధుల్లోకి రాబోతున్న తరుణంలో వాహన చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది.  

స్క్రాప్ పాలసీ బాగుంది..

రవాణా శాఖ తీసుకువస్తున్న స్క్రాప్ పాలనీ బాగుంది. అయితే ఇందులో ఇస్తున్న పన్ను రాయితీని మరి కాస్త పెంచితే బాగుంటుంది. పూర్తిగా కాలుష్యాన్ని నియంత్రించే ఈవీ వాహనాల కు ఇప్పుడు కేవలం ఫ్లేమ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ రాయితీ మాత్రమే వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహించేందుకు రాయితీ ప్రకటించడంతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేస్తే ఈవీ వాహనాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. ఫలితంగా కాలుష్యం భారీగా తగ్గుతది. 

                                                                                                                                            ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి