బీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లో చేరుతుండడం చూస్తే ఎన్నికలకు అర్థం లేదనిపిస్తుంది. ‘ఇంతకు ముందు మా పార్టీ వాళ్లను కేసీఆర్ చేర్చుకున్నప్పుడు లేని తప్పు ఇప్పుడు మేము చేర్చుకుంటే తప్పా?’ అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. ఎవరు చేసినా తప్పు తప్పే. అధికారం లేకపోతే తాము ఉత్సవ విగ్రహాలుగా మారుతామన్న భయంతో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు. కానీ, ఇలా పార్టీ ఫిరాయించిన వారిని ప్రజలు ఆదరిస్తారా అన్న విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. ఓటర్లు కూడా డబ్బుకు అమ్ముడు పోతున్న ఈ రోజుల్లో నైతిక విలువలు, పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడడం శుద్ధ దండగ అనిపిస్తుంది. కానీ, ఈ ఫిరాయింపుల జాడ్యం సమాజాన్ని తినేస్తుందనే వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
బి.సుబ్రహ్మణ్య శర్మ, హైదరాబాద్