19-03-2025 12:27:08 AM
ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరిన గెస్ట్ హౌస్
యాచారం మార్చి 18 : యాచారం మండల కేంద్రంలో నూతన అతిథి గృహ నిర్మాణ ప్రారంభానికి రాజకీయ గ్రహణం పట్టింది.రూ. 20 లక్షల రూపాయలతో నిర్మించిన అతిథి గృహం వినియోగంలో లేక కూనరిల్లుతుంది. రూ. 20 లక్షల నిధుల తో నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించాలని మండల ప్రజలు ఎనిమిదేళ్లుగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవిస్తున్న కూడా వారిలో పట్టింపు లేదు.
దీంతో లక్షల రూపాయాల నిధులతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. అందులోని ఫర్నిచర్, ఇతర సామాగ్రి తుప్పు పట్టిపోతున్నాయి. దర్వాజలు, కిటికీలకు పగుళ్లు ఏర్ప డి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గత ఎనిమిదేళ్ల కిందట అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నాగార్జునసాగర్ - హైదరాబాద్ రహదారిపై యాచారం మండల కేంద్రంలో జడ్పీ అతిథిగృహం ఉండాలని ఉద్దేశంతో నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ప్రస్తుతం జడ్పీ అతిథిగృహం విషసర్పాలకు ఆవాసాలుగా మారింది. ఈ భవనానికి కిటికీలు లేవు. తలుపులు శిధిలావస్థకు చేరుకుని పెద్ద, పెద్ద రంధ్రాలు పడ్డాయి. భవనం వ్యవసాయ పాలం సమీపంలో, చెట్ల పొదల పక్కన ఉండడంతో విష సర్పాలు చేరుతున్నాయి. కిటికీలకు తలుపులు లేకపోవడంతో పక్షులు సైతం లోపలికి వచ్చి గూళ్లు కట్టుకున్నాయి. లక్షల రూపాయాల ప్రజాధనం వృథాగా పోతున్న పట్టించుకునే వారే లేరు.
భవనం ప్రారంభిస్తే అతిథులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రాష్ట్ర రాజధానికి యాచారం అతి సమీపంలో ఉండడం ప్రస్తు తం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ... మండలానికి అతి సమీపంలో ఉండడం...తరుచూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మంత్రులు, జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారులు మండలంలో తరచుగా పర్యటనలు చేస్తుంటారు.
దీంతో పలువురు మండల అతిథి గృహాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. కేవలం రూ. నాలుగైదు లక్షలు భవన మరమ్మతుకు ఖర్చు చేస్తే ఈ భవనాన్ని పూర్తిగా వాడుకలోకి తెచ్చే అవకాశం ఉంటుంది. కాని ఆ దిశగా చొరవ చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
జెడ్పీ అతిథిగృహం ప్రారంభం అయ్యేది ఎన్నడో అంటు మండల ప్రజలు నిట్టూర్చుతున్నారు. అధికారుల, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం జెడ్పి అతిథిగృహం ప్రారంభానికి నోచుకోవడం లేదని అనేక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
వారంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
గెస్ట్ హౌస్ లో మిగిలిపోయిన పెండింగ్ పనులకు ఫర్నిచర్ కొరకు కాంట్రాక్టర్ తో మాట్లాడమని ఫర్నిచర్ రాగానే త్వరలో పెండింగ్ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని పంచాయతీరాజ్ ఏఈ సూర్య వంశీ తెలిపారు.