calender_icon.png 24 November, 2024 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద సాయం ఇంకెప్పుడు?

14-10-2024 01:39:32 AM

వెయ్యి మందికి పైగా బాధితులు

సాయం కోసం పడిగాపులు 

ఖమ్మం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఖమ్మం నగరాన్ని వదరలు ముంచెత్తి రెండు నెలలు కావస్తున్నా నేటికీ ఇంకా చాలా మందికి ప్రభుత్వపరంగా అందాల్సిన సాయం అందలేదు.

నగరంలోని ప్రకాశ్‌నగర్, మోతీనగర్, వెంకటేశ్వరనగర్, జూబ్లీక్లబ్ ఏరియా, కొల్వొడ్డు మంచికంటినగర్ బోర్డు, జలగంనగర్, కరుణగిరి ఏరియా, నాయుడుపేట తదితర మున్నేరు పరివాహాక ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మందికి పైగానే ప్రభుత్వ సాయం అందలేదని తెలుస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.16,500 ల చొప్పున జమ చేశామని అధికారులు చెబుతున్నారు.

వివరాలు సేకరణ

ప్రభుత్వ ఆదేశాలతో  అధికారులతో కూడిన 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ఇంటింటికి వెళ్లి బాధితుల వివరాలు సేకరించారు. బాధితుల బ్యాంకు ఖాతా నంబర్లు కూడా సేకరించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో రెండో విడత కౌంటర్లు ఏర్పాటు చేసి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

రెండో విడత దరఖాస్తు చేసుకున్న వందలాది మందికి నేటికి పరిహారం అందక ఇబ్బంది పడుతున్నారు. వరదల్లో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు కనీసం వరద సాయం కూడా తమకు చేయలేదని చాలా మంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో 10వేల ఇళ్లకు పైగానే దెబ్బతిన్నాయి. 

యజమానుల ఖాతాల్లో పరిహారం

అద్దె ఇళ్లల్లో ఉంటున్న అనేక మంది వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. బాధితులను వదిలి ఇంటి యజమాని ఖాతాలో ప్రభుత్వం సాయం డబ్బులు జమ చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఇళ్ల యజమానులు నగర పాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి తమకు నష్టం జరిగిందని దరఖాస్తు చేసుకోవడంతో వారి పేరుతోనే పరిహారం చెలించినట్లు తెలుస్తోంది. దీని వల్ల లక్షలాది రూపాయలు నష్టపోయిన బాధితులకు తీవ్ర అన్యాయం జరిగినట్టు తెలుస్తున్నది. 

బాధితులకు సాయం చేయండి

మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. వరదల్లో ఇంట్లోని సామాన్లు, బియ్యం, దుస్తులు కొట్టుకుపోయాయి. దాదాపు రూ.2 లక్షల వరకు నష్టపోయా. అధికారులు ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. కానీ ఇంతవరకు పైసా రాలేదు. సాయం డబ్బులు ఇంటి యజమానికి చెల్లించారు. మేము నష్టపోతే పరిహారం ఇంటి యజమానికి ఇవ్వడం సరికాదు. నష్టపోయిన బాధితులకు మాత్రమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. 

 కొసిక సంతోషి, 46 డివిజన్, గొల్లబజార్ 

యజమానికి పరిహారం ఇచ్చారు 

వరదల్లో మేము రూ.2 లక్షలకు పైగానే నష్టపోతే ఇంటి యజమానికి పరిహారం అందజేశారు. పరిహారం కోసం మేము చేసిన దరఖాస్తును కాదని ఇంటి యజమాని ఇచ్చిన దరఖాస్తును పరిగణలోకి తీసుకుని, ఆయనకే పరిహారం చెల్లించారు. ఇదెక్కడి న్యాయం. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

 తడికమళ్ల రమేశ్, కాల్వొడ్డు, మంచికంటి నగర్‌బోర్డు

16న ఖమ్మంలో ధర్నా 

మున్నేరు పరివాహాక ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మంది బాధితులకు పరిహారం అందలేదు. మేము వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల వివరాలు సేకరించాం. ప్రభుత్వ పరిహారం చెల్లింపుల్లో చాలా లొసుగులు ఉన్నాయి. బాధితులందర్నీ సమీకరించి, ఈ నెల 16న ఖమ్మంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. 

 యర్రా శ్రీకాంత్, 

సీపీఎం జిల్లా నేత