- నిపుణుల కమిటీ జాడేది!
- కొత్త డీపీఆర్ ఎప్పుడొస్తది
- గత ప్రభుత్వంలోనే రూ.590 కోట్లు కేటాయింపు
ఖమ్మం, నవంబర్ 16 (విజయక్రాంతి): ఖమ్మం నగర ప్రజలను, చుట్టు పక్కల పక్కల కాలనీల ప్రజలను వరద నుంచి కాపాడేందుకు నగరానికి సమీపంలోని మున్నేరు నదికి ఇరువైపులా కరకట్టల (సిమెంట్ కాంక్రీట్ వాల్స్)ను నిర్మించాలని గత ప్రభుత్వంలోనే ప్రతిపాదించారు.
వీటి నిర్మాణ కోసం రూ.590 కోట్లను కూడా అప్పట్లో కేటాయించారు. టెండర్లు కూడా ఖరారు చేశారు. కానీ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో కరకట్టల నిర్మాణానికి గ్రహణం పట్టింది.
గత సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలకు కనీవినీ ఎరుగని రీతిలో మున్నేరుకు భారీగా వరదలు రావడంతో నగరంలోని పలు కాలనీలు, చుట్టు పక్కల ఉన్న అనేక కాలనీలు ముంపునకు గురయ్యాయి. కరకట్టలు ఉన్నట్లయితే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయే వారు కాదు.
ఎప్పటి నుంచో ఖమ్మం ప్రజలు కరకట్టల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ అంశం చర్చనీయాంశమవుతూనే ఉంది. వరదలప్పుడు హడావిడి చేసిన మంత్రులు, అధికారులు ఇప్పుడెటు పోయారని ఖమ్మం ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వరదలతో నిలిచిపోయిన పనులు
సెప్టెంబర్ నెలలో సంభవించిన భారీ వరదలకు దానవాయిగూడెం ప్రాంతంలో చేసిన కరకట్ట పనులు వరదకు కొట్టుకుపోయా యి. కరకట్ట కోసం తవ్విన పునాదుల్లో కాంక్రీట్ వేసే సమయానికే వరదలు రావడంతో పనులన్నీ నిలిచిపోయాయి. గుత్తేదారుకు సంబంధించిన కొన్ని యంత్రాలు, ఇసుక, సిమెంట్ వరదల్లో తడిచిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం కూడా జరిగినట్లు సమాచారం.
దీంతో ఖర్చు పెరగడంతో పాటు ఇప్పుడున్న బడ్జెట్‌లో పనులు పూర్తి చేయడం కూడా కష్టమని గుత్తేదారు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన యంత్రాలను కూడా గుత్తేదారు నది ప్రాంతం నుంచి తీసుకెళ్లినట్టు తెలిసింది.
గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవ డం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఖమ్మం ప్రజలు పెద్ద ఉపద్రవాన్ని అనుభ వించడంతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు కూడా ఈ విషయమై సీరియస్‌గా చర్చించారు.
నిపుణుల కమిటీ జాడే లేదు
గత సెప్టెంబర్‌లో దాదాపు 42 అడుగులు దాకా మున్నేరుకు వరదలు రావడంతో గతంలో చేసిన డిజైన్‌ను మార్చాలని జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులతో పాటు ఖమ్మం ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావించారు. ఈ విషయంలో మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, కొత్త డీపీఆర్ తయారు చేయించే పనిలో ఉన్నట్లు తెలిసింది.
డిజైన్ చేసే ముందు నిపుణుల కమిటీని నియమిస్తామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా డిజైన్, డీపీఆర్ తయారు చేయించాలని భావించారు. కానీ ఇంతవరకు నిపుణుల కమిటీని నియమించకపోవడంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గినందున వెంటనే ముగ్గురు మంత్రులు స్పందించి కరకట్టల నిర్మాణానికి నిపుణుల కమిటీని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం నాటికి కరకట్టల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.
రక్షణ గోడలు ఎక్కడెక్కడ?
ఖమ్మం నగర ప్రజలను మున్నేరు వర దల నుంచి కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన కరకట్టలను పోలేపల్లి నుంచి ప్రకాశ్‌నగర్ వరకు కట్టాలని ప్రతిపా దించారు. దాదాపు 7.5 కిలో మీటర్ల మేర వీటిని నిర్మాణం చేయనున్నారు. నగరంలో ని 12 డివిజన్ల పరిధిలో వీటి నిర్మాణం జరగాల్సి ఉంది. ధ్వంసలాపురం వరకు రక్షణ గోడలను పొడిగించాల్సి ఉంది. అయి తే నిపుణుల కమిటీ వస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదు.