04-04-2025 01:27:22 AM
హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): కొంతకాలం నుంచి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్‌గా మారింది. ఎవరెవరికి ‘అమాత్య’ పదవులు దక్కుతాయోననే చర్చ సర్వత్రా సాగింది. కొందరు ఆశావహులైతే ‘నాకు మంత్రి పదవి వస్తుందంటే.. నాకు వస్తుంది’ అంటూ బహిరంగంగానే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా ఒకవైపు అయితే.. నాణేనికి మరోవైపు అన్నట్టు.. తెర వెనుక కథ వేరే నడుస్తున్నట్టు తెలిసింది. పార్టీ అధిష్ఠానం సామాజిక న్యాయం అనే సూత్రాన్ని పాటించాలని యోచిస్తున్నట్లు, ఒక సామాజిక వర్గానికి న్యాయం చేస్తే.. మరొక సామాజిక వర్గానికి అన్యాయం చేసినట్లవుతుందని తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.
ఇలా మంత్రి వర్గ విస్తరణ సంగతి ‘ఒక అడుగు ముందుకు పడితే.. పది అడుగులు వెనక్కి’ అన్నట్లు సాగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
రెడ్డి సామాజిక వర్గం నుంచి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు 11 మంది మంత్రులు క్యాబినెట్‌లో కొనసాగుతున్నారు. వీరుకాక మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటివ్వాలని పార్టీ భావిస్తున్నది. ప్రస్తుతం క్యాబినెట్‌లో ఒక్క రెడ్డి సామాజికవర్గం నుంచే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయినప్పటికీ.. అదే సామాజికవర్గం నుంచి పలువురు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డి మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.
నిజాబాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఈ క్యాబినెట్‌లో చోటు లేకపోయిందని, కనీసం మంత్రివర్గ విస్తరణలోనైనా జిల్లా ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.
కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఇద్దరికా?
ఇప్పటికే ఉమ్మడి నల్లగొండలో రెడ్డి సామాజికవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఇదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి కట్టబెడితే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినట్లవుతుంది. అంతేకాదు.. ఈ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికే మూడు మంత్రి పదవులు కేటాయించినట్లవుతుంది. దీంతో అధిష్ఠానం ఒకపట్టాన నిర్ణయం తీసుకోలేకపోతున్నదని సమాచారం.
లంబాడీ, మాదిగలకు చోటివ్వాలని డిమాండ్..
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖాయమనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇప్పటికే మాల సామాజికవర్గం నుంచి డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ పదవులు పొందారు. ఇప్పుడు అదే సామజిక వర్గానికి చెందిన వివేక్‌కు మంత్రిపదవి ఇస్తే.. మాదిగల నుంచి వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందనే భయం అధిష్ఠానాన్ని వెంటాడుతోంది.
తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గాల్లో ఒకటైన మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక దామోదర రాజనర్సింహకు మాత్రమే మంత్రివర్గంలో చోటుదక్కిందని, మంత్రి విస్తరణలో మరికొందరికి చోటు కల్పించాలనే డిమాండ్ ఇప్పటికే షురూ అయింది. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రిగా సీతక్కకు పదవి దక్కింది. ఈ నేపథ్యంలో లంబాడీ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ను కొందరు లేవనెత్తారు.
బీసీలకు రెండు మంత్రి పదవులు?
మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలకు చోటు కల్పించాలని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ డిమాండ్‌ను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బీసీ సామాజికవర్గాల నుంచి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌కు మంత్రి పదవులు దక్కాయి.
ఇప్పుడు మంత్రివిస్తరణ అంటూ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు మైనార్టీ వర్గానికి సైతం అవకాశం ఉంటుందని పీసీసీ చీఫ్ ఇటీవల చూచాయిగా ప్రస్తావించడం ఆ వర్గాల్లో కొత్త ఆశలు రేపింది. కాంగ్రెస్‌లో ప్రస్తుతం ముస్లిం మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు.
కానీ.. ఇటీవల గవర్నర్ కోటాలో అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ పదవి సాధించారు. ఒకవేళ మైనార్టీవర్గానికి ఛాన్స్ అంటూ వస్తే.. మంత్రి పదవి సంగతేంటో అధిష్ఠానమే తేల్చాల్సి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఒక్కరికైనా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, ఆ జిల్లాకు మంత్రివర్గంలోచోటు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు సైతం కోరుతున్నారు.
అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: మల్‌రెడ్డి రంగారెడ్డి
రాష్ట్ర జనాభాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే ఉంటుందని, అలాంటి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ఒకరికైనా చోటు కల్పించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఈ రెండు జిల్లాల నుంచి కనీసం 4 6 మందికి మంత్రి పదవులు దక్కేవని, మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు ఎమైనా అడ్డు వస్తే, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేస్తున్నారు. అధిష్ఠానం సూచించిన వ్యక్తిని బరిలో దింపి గెలిపిస్తానన్నారు.