calender_icon.png 23 September, 2024 | 12:55 AM

జీవన సాఫల్యం ఎప్పుడు? ఎలా?

20-09-2024 12:00:00 AM

“నచికేతా! మానవప్రజ్ఞ దైవప్రజ్ఞకంటే భిన్నమైంది కాదు. మనిషి తన ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి. అది అలుపెరుగని, ఆగని ప్రయాణం వంటిది. సృష్టి పురోగమనంలో మానవుడి కర్తవ్యం, అస్తిత్వం, ఉనికి ఎంతో కీలకమైనవి. అందుకే, ఆతడికి భౌతిక శరీరం లభ్యమైంది. 

అతడి కర్మసాధనకు శరీరమే ఆధారమవుతున్నది. భౌతిక శరీరం నశించేదే అయినా ఎముకలు, రక్తం, మాంసం, మజ్జలతో కూడి ఏర్పడిన గూడు మాత్రమే కాదది. ఎప్పటికైనా దమనమవుతుంది కనుక దేహం. నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది కనుక శరీరం. చర్మంతో ఆసాంతమూ కప్పబడి ఉంటుంది కనుక కవచం. గతిశీలమై పరుగెడుతూ ఉంటుంది కనుక రథం. కడగా నాశనమెరుగని ఆత్మను తనలో నిలుపుకుని ఉన్నది కనుక దేవాలయం కూడా. ఇన్ని రకాల గౌరవాలను శరీరం అందుకుంటున్నది. 

అంతేకాదు, నచికేతా! మరింత శ్రద్ధగా విను. శరీరం రథం. అందులోని ఆత్మ రథికుడు. బుద్ధే సారథి. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు గుర్రాలు. మనసు కళ్ళెం. ఈ నేపథ్యంలో మనిషి తన బుద్ధిని సక్రమంగా వాడాలి. మనసును నియంత్రించుకోవాలి, నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలను మనసుతో సమన్వయం పరచుకోవాలి. తాను ప్రయాణించవలసిన మార్గాన్ని విషయవాంఛల నుంచీ తప్పించాలి. తన జీవన సాఫల్యానికై లక్ష్యించుకున్న, నిర్దేశించుకున్న ఆత్మానుసంధానం దిశగా ప్రయాణించాలి.

అయినా మానవుడి అధ్యాత్మ మార్గంలో రెండు దారులు ఏర్పడతాయ్. అక్కడే అతడు తన నిర్ణాయక శక్తితో, నిర్మల మనసుతో, వివేకంతో, విచక్షణతో, విచారణతో తనకు కావలసిన మార్గాన్ని ఎంచుకోవాలి. అది తరించే మార్గమా? అంతరించే మార్గమా? ఎంచుకోవలసింది తరించే మార్గమే! కనుక తన విజ్ఞానాన్ని, మనో నిగ్రహాన్ని ఎవరు సమన్వయం చేసుకోగలుగుతారో, వారే తన లక్ష్య గమ్యాలను సులువుగా సాధిస్తారు. ఇదే జీవన సాఫల్యం.

ఈ సాధనకే ‘నిరంతరాభ్యాసం’ అని పేరు. ఇది కేవలం మానవజన్మ ద్వారానే సాధ్యం. మనిషి, తన కళ్ళముందు కనబడుతున్న ప్రపంచాన్ని పరిశోధించ గలుగుతున్నాడు. సుందరాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. మంగళాత్మకంగా సంభావించగలుగుతున్నాడు. కానీ, సత్యాన్ని అందుకోలేకపోతున్నాడు. అందుకు కారణం, అది ఆంతరంగికం కావటమే!

ఇంకా ‘లోచూపు’ అలవడటం లేదు. నిజానికి అది అంత సులభమూ కాదు. ప్రయత్నించి ఏనాటికైనా సాధించవలసింది ఇదే. సత్యాన్వేషణ ఒక జీవిత కాలంలో ముగియక పోవచ్చు. అందుకే, ‘ఎన్ని జన్మలెత్తయినా’ సాధించాల్సిందే అనుకుంటాం! కనుక, జన్మ చక్రబంధం నుంచీ బయటపడి తాను ఆత్మగా నిలకడ చెందేవరకు ఈ అన్వేషణ ఆగనిది. అలుపెరుగనిది. మనిషి తనలోని పరిపూర్ణతను అనుభవంలోకి తెచ్చుకునే ఆ తీవ్ర అన్వేషణే అసలైన సాధన. 

అనుక్షణమూ మార్పులకు లోనయ్యే ప్రపంచాన్ని ని త్య, సత్య, శాశ్వతమని భావించటమే అజ్ఞానం. అదే మా య! ఆ మాయ పెద్ద అడ్డు తెర. అవతల ఉన్న దానిని చూడనీయదు, కలవనీయదు. తెరను తొలగించుకోగలిగిన నిష్ట, శ్రద్ధ, శక్తి ఉంటే సత్యానుభవం సులభసాధ్యమ వుతుంది. తెర తొలగి తెఱవు ఏర్పడుతుంది. ఇటువంటి సాధనకై జీవితాన్ని అంటే జీవితంలో దాగిన ప్రతీ క్షణాన్ని జీవించాలి, అర్థవంతంగా, సమర్థవంతంగా!”

యమ ధర్మరాజు శరీర ధర్మాన్ని, శరీర పరిమితిని, దాని అపరిమిత స్థితులను వ్యాఖ్యానిస్తున్నాడు, దయా స్వరూపంగా! నచికేతసుడు ధన్యతను అనుభవిస్తూ, నిత్య జీవితాన్ని సత్య సమంచితం చేసుకునే ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడు వినయంగా, కానీ ఆసక్తిగానే!

- వి.యస్.ఆర్.మూర్తి