calender_icon.png 17 September, 2024 | 1:41 AM

యాదాద్రిలో కాటేజీల నిర్మాణాలెప్పుడూ?

27-07-2024 02:00:21 AM

  1. లేఅవుట్ అభివృద్ధి చేసినా.. డోనర్ పాలసీ జాప్యం 
  2. భక్తులకు కనీస సదుపాయాలు కరువు 
  3. కొత్త ప్రభుత్వంపైనే భక్తుల ఆశలు

యాదాద్రి భువనగిరి, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే ప్రముఖ ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 12వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా భక్తులకు కనీస వసతి సదుపాయాలు మాత్రం సమకూరలేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాజుల కాలంనాటి శిలా నిర్మాణాలతో అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. కానీ దేశ విదేశాల సందర్శకులకు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న  గత సర్కార్ మాటలు ఆచరణకు నోచుకోలేదు. 

850 ఎకరాల విస్తీర్ణంలో..

దాదాపు 850 ఎకరాల విస్తీర్ణంలో యా దాద్రి ఆలయానికి అభిముఖంగా గల పెద్ద గుట్టను అత్యాధునిక వసతులతో కూడిన విల్లాలు, కల్యా ణ మండపాలు, ఫుడ్ కోర్టులతో టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రతిపాదనలు చేశారు. మొదటి దశలో 250 ఎకరాల్లో కాటేజీల నిర్మాణం చేపట్టి, ఆలయ ఉద్ఘాటన నాటికే భక్తుల వసతుల కోసం అందిస్తామన్నారు. ఆరేడు ఏండ్లు కావస్తున్నా విల్లాల నిర్మాణాలు మాత్రం చేపట్టడం లేదు. దీంతో ప్రతిరోజు వేలాదిగా తరలివచ్చే భక్తులు కనీస వసతి సదుపాయాలు లేక స్వామి సన్నిధిలో బస చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.

స్టార్ హోటల్స్‌ను తలపించేలా..

దేశ, విదేశీ భక్తులకు అంతర్జాతీయ ప్రమాణాలతో స్టార్‌హోటల్స్‌ను తలపించే రీతిలో టెంపుల్ సిటీని నిర్మించాలని అప్పటి సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకు అనువైనదిగా యాదగిరి కొండకు పడమటి దిశలో, పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అనుసంధానంగా గల పెద్దగుట్టను ఎంపిక చేశారు. స్థానిక రైతుల నుంచి దాదాపు 850 ఎకరాలను ప్రభుత్వం సేకరించి వైటీడీఏకు అప్పగించింది. పెద్దగుట్టపై 250 ఎకరాల్లో రూ.207 కోట్లతో 252 ప్లాట్లను అభివృద్ధి చేశారు. విశాలమైన రహదారులు, ల్యాండ్ స్కేప్ గార్డెన్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, ఎస్‌టీపీ  వ్యవస్థలతో టెంపుల్ సిటీ లేఅవుట్‌ను రూపొందించారు.

దాదాపు 900 చదరపు గజాలతో 5 బ్లాక్‌లుగా విభజించారు. ఢిల్లీకి చెందిన ఆర్కాప్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ విల్లా నిర్మాణాలకు డిజైన్ సైతం చేసింది. నిర్మాణాలకు విరాళాలు అందించే దాతలకు తిరుమల తరహాలో ఆలయంలో ప్రత్యేక సదుపాయాలు, సత్కారాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే విల్లాల నిర్మాణానికి రూ.2 కోట్లు, కాటేజీల్లో గదుల కేటాయింపునకు రూ.1.50 కోట్లు, కోటి, 50 లక్షలుగా విరాళాలు అందించాలని వైటీడీఏ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనకు అనుగుణంగా దాదాపు 14 మంది దాతలు సైతం ముందుకు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 

ఖరారుకాని డోనర్ పాలసీ 

కాటేజీలు, విల్లాల నిర్మాణాలకు దాతలు సంసిద్ధతను వ్యక్తం చేసినా ప్రభుత్వం మాత్రం డోనర్ పాలసీని ఖరారు చేయడంలో జాప్యం చేసింది. దీంతో టెంపుల్ సిటీలో దాతలకు ప్లాట్లను కేటాయించడానికి వైటీడీఏ అధికారులు సాహసించలేదు. ఆ తర్వాత కాలంలో ఆలయ ఉద్ఘాటనను హడావుడిగా గావించిన ప్రభుత్వం టెంపుల్ సిటీలో కాటేజీల నిర్మాణంపై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రభుత్వం మారింది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం యాదాద్రి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. 

భక్తులకు కరువైన వసతి

యాదాద్రి పున:నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి పెరిగింది. అంతకు ముందున్న మౌలిక వసతి సదుపాయాలను తొలగించడం, కొత్తగా సమకూర్చకపోవడంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది స్వామివారి సన్నిధిలో బస చేసి మొక్కులు చెల్లించుకోవాలని భావిస్తారు. అయితే భక్తులకు మౌళిక సదుపాయాల కల్పించకపోడంతో భక్తులు బస చేయడంలేదు. కొండ కిందగల ప్రైవేటు లాడ్జీలు, సామాజిక సంఘాలు ఏర్పాటు చేసిన సత్రాల్లోనే బస చేస్తున్నారు. ఈ బస అందుబాటులో లేని భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుగు పయనమవుతున్నారు. దీంతో భక్తులకు మెరుగైన వసతి సదుపాయాల కల్పనకు కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.