గతంలో ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘స్త్రీ’. దీనికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. ‘స్త్రీగే లో తనదైన నటనతో ప్రేక్షకులకు మరోమారు వినోదం పంచేందుకు సిద్ధమైంది బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్ త్రిపాఠి, అభిషేక్ బచ్చ న్ బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంతో అలరించనుంది. ఆగస్టు 15 న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ట్రైలర్ చూస్తే.. ప్రీక్వెల్ కంటే సీక్వెల్‌లోనే కామెడీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ‘తూ ఝాఠీ మై మక్కార్’ సినిమా సమయంలో పరిచయమైన అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీదో శ్రద్ధా కపూర్ రిలేషన్‌లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్‌లో ఇటీవల ప్రచారం జరిగింది. అతడితో కలిసి తీసుకున్న సెల్ఫీని శ్రద్ధా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ వార్తకు బలం చేకూర్చినట్టయింది. ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న శ్రద్ధా కపూర్‌ను ఓ విలేకరి పెళ్లి గురించి ప్రస్తావించగా, తనదైన శైలిలో జవాబిచ్చింది ఆ బ్యూటీ. సినిమాలోని క్యారెక్టర్‌ను ఉద్దేశిస్తూ.. ‘స్త్రీ ఇష్టమున్నప్పుడు పెళ్లి చేసుకుంటుంది’ అని సమాధానమిచ్చింది శ్రద్ధా.