రోడ్డెక్కి నిలదీసిన ఏబీవీపీ కార్యకర్తలు
హుస్నాబాద్ (విజయక్రాంతి): పేద విద్యార్థుల చదువులపై సర్కార్ అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగమవుతున్నాయని విద్యార్థులతో కలిసి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు ఇవ్వకపోవడంతో మధ్యలోనే చదువులు ఆపేయాల్సి వస్తోందన్నారు.
ఏటా 5.45 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా, వారికి మొండిచేయే చూపుతున్నారని విమర్శించారు. రూ.7,800 స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయని ఆవేదన చెందారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదో గ్యారంటీగా యువ వికాసం పేరుతో విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుచేస్తామని మాట ఇచ్చినా ఆ ఊసే లేదన్నారు. ఇప్పటికైనా ఆ హామీలు అమలుచేసి, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో ఆ సంఘం నాయకులు రాకేశ్, రాహుల్, చరణ్, భాను, నవీన్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.