- వానకాలం ప్రారంభమై నెలన్నర..
- ఆలస్యంగా ఈ నెల 23న టెండర్ల నిర్వహణ
- ప్రాజెక్టులు, చెరువుల్లో తగ్గిన నీటి నిల్వలు
- ఆందోళన చెందుతున్న మత్స్యకారులు
నిర్మల్, జూలై 20 (విజయక్రాంతి): వానకాలం ప్రారంభమైనా చేప పిల్లల పంపిణీ నెలన్నర ఆలస్యం కావడంతో మత్స్యకార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు వానలు లేక చెరువులు బోసిపోతున్నా చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. చేప పిల్లల పంపిణీ పక్రియ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు టెండర్ల పక్రియను ఈ నెల 23న నిర్వహించాలని సూచించడంతో ఆ దిశగా అధికా రులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఆలస్యంగా టెండర్లను పిలవడంతో చేప పిల్లల వృద్ధిపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా పిల్లల పెంపకం నిర్మల్‌లోనే చేపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో శ్రీరాంసాగర్, గడ్డెన్న వాగు, స్వర్ణ, కడెం పల్సి రంగారావుకర్ ప్రాజెక్టులతో పాటు నీటి పారుదల శాఖ పరిధిలో ఉన్న 521 చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేయాల్సి ఉంది. జిల్లాలో 214 మత్స్య కార్మిక సంఘాలుండగా 68 మహిళా కార్మిక సంఘాలున్నాయి. ఇందులో మొత్తం 13, 300 మంది మత్స్య కార్మికులు చేప పిల్లల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువుల్లో కొత్త నీరు అంతంత మాత్రంగానే వస్తుంది.
గతంలో చేపపిల్లల పంపిణీ ఇలా..
ప్రతి సంవత్సరం మే నెలలోనే చేప పిల్లల విడుదలకు కార్యాచరణ ప్రారంభం అయ్యేది. జూన్ మొదటివారంలో టెండర్లు పూర్తి చేసి నీటి వనరుల్లో చేప పిల్లలు విడుదల చేసేవారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో 20 ఎంఎం.40ఎంఎం చేప పిల్లలకు టెండర్లు ఖరారు అయ్యేవి. గతేడాది జూన్ 11 నాటికి ఈ పక్రియ పూర్తి చేసిన అధికారులు ఈసారి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 23న టెండర్లు నిర్వహించనున్నారు.
5.10కోట్ల చేప పిల్లల విడుదలకు ప్రణాళిక
నిర్మల్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, గడ్డెన్న వాగు, స్వర్ణ, కడెం, పల్సి రంగారావుకర్ ప్రాజెక్టుతో పాటు చెరువులు, కుంటల్లో 5.10కోట్ల చేప పిల్లలు విడుదల చేసేలా ప్రణాళికతో ముం దుకు వెళ్లేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. వానకాలం ప్రారంభమైన 50 రోజుల తర్వాత జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లోకి కొత్త నీరు వచ్చి చేరితే చేప పిల్లల విడుదలకు మార్గం సులువైతుంది. అయితే సర్కారు టెండర్ల పక్రియకే నెలన్నర టైం తీసుకోవడంతో టెండర్లు దక్కించుకున్న వారు చేప పిల్లల సరఫరా ఎప్పుడు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది చేప పిల్లల టెండర్లను దక్కించుకొన్న వారికి ఇంతవరకు చివరి బిల్లులు ఇవ్వలేదు. మరీ ఇప్పుడు జరిగే టెండర్‌లో పాల్గొనడానికి ముందుకు వస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆలస్యం అయితే అసలుకే మోసం
చేప పిల్లలు విడుదల చేయడానికి ఇదే అనువైన కాలం అని మత్స్యకార్మికులు అం టున్నారు. జూన్, జూలై మొదటి వారంలో చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీటిలో చేప పిల్లలు విడుదల చేస్తే ఆ తరువాత వర్షాలకు నీరు నిండి చేప పిల్లల్లో వృద్ధి ఉంటుందని అంటున్నారు. అవి ఎదగడానికి కనీసం 120 రోజులు పడుతుంది. అప్పటివరకు 3 కిలోల బరువు వరకు చేపలు వృద్ధి చెందుతాయి. 4 నెలలు తర్వాత మత్స కార్మికులు వాటిని విక్రయించుకుని లాభాలు పొందుతారు. చేప పిల్లల విడుదల ఆలస్యం అయితే వృద్ధి రేటు తగ్దే అవకాశముంటుంది.
23న టెండర్ల పక్రియ
మధుసుధన్, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్
జిల్లాలో ఈ సంవత్సరం 5.22 కోట్ల చేపపిల్లలు విడుదల చేయాలనే కార్యచరణతో ఉన్నాం. జిల్లాలోని 5 ప్రాజెక్టులతో పాటు చెరువుల్లో చేప పిల్లలను ఉచితంగా వదిలేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 23న చేప పిల్లల టెండర్లు నిర్వహిస్తున్నాం. టెండర్లు ఖరారు అయిన వెంటనే చేప పిల్లలు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.
చేపపిల్లలు సరఫరా చేయాలి
మాకు చెరువలో ఉన్న చేపలే ఆధారం. చేపలు పెరిగితేనే ఏడాది అంతా ఉపాధి దొరుకుతది. ప్రతి ఏడాది జూన్, జూలై నెలల్లోనే చేపపిల్లలు వస్తవి. ఈ సంవత్సరం ఇంతవరకు టెండర్లు కాలేదు. ప్రభుత్వం టెండర్లు వేసి చే పిల్లలను సరఫరా చేయాలి. 30 ఏళ్ల నుంచి ఈ వృత్తినే నమ్ముకొని బతుకుతున్నాం. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి.
భోజన్న, మత్య్సకార్మికుడు, అందకూర్
గతేడాది నష్టపోయినం
గత ఏడాది వర్షాలు బాగా కురిసి, వరదలు వచ్చి చేప పిల్లలు అలుగు ద్వారా కొట్టుకపోయినయి. ఆ తర్వాత వర్షాలు లేక నీళ్లు సరిపోక చేపపిల్లలు ఎదగలేదు. చెరువులో బాగా నీరు ఉంటేనే చేపలకు ఆహారం దొరుకుతుంది. వర్షాలు కురిసి చెరువులు, ప్రాజెక్టులు నిం డాలి. నిండిన చెరువుల్లో చేపపిల్లలు తొందరగా విడుదల చేయాలి. ప్రభుత్వం చేప పిల్లలను వెంటనే సరఫరా చేయాలి. మత్సకార్మికులకు ఆదుకోవాలి. దేవన్న, మత్స్య కార్మికుడు