17-03-2025 12:34:03 AM
జుక్కల్, మార్చి 15 (విజయ క్రాంతి) : అసలే మారుమూల ప్రాంత మండలమైన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండల ప్రజలు ఆర్టీసీ బస్సుల కోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న బస్సు సౌకర్యాలు మాత్రం మండల ప్రజలు నోచుకోవడం లేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాలకు నేటికీ ఎర్ర బస్సు ఎరుగని గ్రామాల ప్రజలు అధికంగానే ఉన్నారు.
ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు ఎందరు మారిన జుక్కల్ మండల ప్రజల బతుకులు మాత్రం మారడం లేదు. రోడ్డు సౌకర్యాలు ఉన్నా కూడా బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గతంలో రోడ్లు మంచిగా లేవని సాకు చూపెట్టి బస్సులు నడపలేదు. ప్రస్తుతం మండలంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగిన బస్సు సౌకర్యానికి మాత్రం నోచుకోవడం లేదు.
జుక్కల్ మండలము లోని పలు గ్రామాలకు బస్సులో ప్రయాణించాలంటే బస్సులు కరువయ్యాయి. బస్సు లేకపోవడంతో ఆటోలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఎన్నో ఇబ్బందుల మధ్య గ్రామాలకు ఆయా గ్రామాల ప్రజలు చేరుకుంటున్నారు. ఎంతో రాజకీయ చైతన్యం వచ్చినా కూడా ఎంతోమంది విద్యావంతులు తయారైన కూడా కనీస బస్సు సౌకర్యానికి మాత్రం జుక్కల్ మండల లోని ఆయా గ్రామాల ప్రజలు నోచుకోవడం లేదు.
ఎన్నో ఏండ్ల తరబడి బస్సులు లేని గ్రామాలు జుక్కల్ మండలంలో ఉన్నాయి అంటే అతి యోశక్తి కాదు. మండలంలో 30 గ్రామాలకు గాను ఎనిమిది గ్రామాలకు అసలుకే బస్సులు వెళ్లలేని పరిస్థితి ఉంది. రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఆ గ్రామాల్లో బస్సులు వస్తాయన్న ఆశ ఎవరికి కూడా లేదు. ఎన్నిసార్లు అధికారులకు ఆర్టీసీ అధికారులకు విన్నవించినప్పటికీ బస్సులు వేయడం లేదంటూ ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
ఎన్నో ప్రభుత్వాలు మారిన, నాయకులు మారిన, అధికారులు మారిన బస్సు ప్రయాణం మాత్రం వారికి కలగానే మిగిలినట్టు కనిపిస్తోంది. జుక్కల్ మండలంలో లాడేగాం, సావర్గాం, సిద్ధాపూర్, మైబాపూర్, లొంగన్, బిజ్జల్వాడి, కత్తల్వాడి, చిన్నగుల్ల గ్రామాలకు బస్సులు వెళ్లవు. మెయిన్ రోడ్డుకు గేటు వద్ద దిగి సుమారు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వారి గ్రామానికి వెళ్లాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్సులు లేకపోవడంతో గ్రామంలో ఉన్న ఒకటి రెండు ఆటోల్లో ఎప్పుడు వస్తే అప్పుడు ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు మండల కేంద్రానికి రావాలంటే ఆటోలో దిక్కు. బస్సులు రాని అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉంది.
సంబంధిత అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం విషయమై దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులేని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
చాలా గ్రామాలకు బస్సులు లేవు
జుక్కల్ మండలంలో చాలా గ్రా మాలకు బస్సులు లేవు. కొన్ని గ్రా మాలకు రోడ్డు ఉ న్నప్పటికీ బస్సు లు వేయకపోవడం బాదేస్తుంది. అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర సరిహ ద్దులో ఉన్న గ్రామాలకు బస్సులు నడపాలని అధికారులకు విన్నవించాం. సంబంధిత అధికారులు స్పందించాలి.
శైలేష్, వజ్రఖండి నివాసి
మా ఊరికి బస్సు నడపండి
లొంగన్ గ్రామానికి బస్సు నడపాలని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించి న ఇప్పటివరకు బస్సు వేస్తలేరు. మెయిన్ గేటుకు దిగి నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి రావాల్సి వస్తోంది. రాత్రు ల్లో అయితే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ అధికారులు తమ గ్రామానికి బస్సు వేయాలని కోరుతున్నాం.
ప్రేమ్ జీత్, లొంగన్ నివాసి