ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్, జులై 30 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ధరణి ప్రారంభించాక దేవుడి భూములు అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆరోపించారు. గతంలో మాదిరిగా దేవుడి మాన్యాలకు పాస్ బుక్‌లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. బ్రాహ్మణ సంక్షేమంతోపాటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ ప్రభుత్వం రూ.237 కోట్లు కేటాయించిందని చెప్పారు. సభలో మంగళవారం వ్యవసాయం, దేవాదాయ శాఖ పద్దులపై జరిగిన చర్చపై అయిలయ్య మాట్లాడుతూ.. యాదాద్రిలో 1958 నాటికి 125 సత్రాలు ఉండేవని, గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొండపైన, కొండ కింద ఉన్న సత్రాలను కూలగొట్టిందని ఆరోపించారు.
గుట్టలో అందుబాటులో ఉన్న భూమిలో వెయ్యి గదులతో సత్రం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధూపదీప నైవేద్యం పథకం కింద 6,271 మంది అర్చకులకు వేతనం రూ.12 వేలకు పెంచాలని విజ్ఞప్తిచేశారు. ఖాళీగా ఉన్న అర్చక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కొమురవెళ్లి మల్లన్న స్వామి దేవాలయంలో సంప్రదాయంగా గొల్ల, కుర్మలకు చైర్మన్ పదవి ఇవ్వాలని అన్నారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేస్తే 10 మండలాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమైనందున యాదగిరిగుట్ట దేవస్థానంలో పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగుల బదిలీలు నిలిపివేయాలని మంత్రి సురేఖను కోరారు.