calender_icon.png 27 November, 2024 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఈడీ అడ్మిషన్లు ఎప్పుడు?

25-09-2024 02:53:59 AM

  1. వెబ్‌ఆప్షన్ల నమోదుకు కళాశాల లిస్టును విడుదల చేయని అధికారులు
  2. ఇప్పటికే రెండు నెలలు గడిచిపాయె

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) అడ్మిషన్ల ప్రక్రియంతా గందరగోళంగా మారింది. ఫలితాలు వెలువడి రెండు నెలలవుతున్నా ఇంత వరకూ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు.

దీంతో అటు కళాశాల యాజమాన్యాలు ఇటు విద్యార్థులు అడ్మిషన్ల ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది అభ్యర్థులైతే వేరే కోర్సులకు వెళ్లిపోతున్నారు. అఫిలియేషన్ (గుర్తింపు) ప్రక్రియను పూర్తిచేసి, కాలేజీల వారీగా లిస్టును విడుదల చేయాలని కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఈ కోర్సు అందించే కాలేజీల్లో 50 వరకు ప్రైవేట్, 9 ప్రభుత్వ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో తనిఖీలు చేపట్టిన ఇన్‌స్పెక్షన్ టీమ్ ఓ పది కాలేజీలకు ఫైర్ ఎన్‌వోసీ లేదని తేల్చింది. వీటికి అనుమతులు ఇవ్వకపోవడంతో వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే 15 మీటర్లలోపు ఉన్న కళాశాలలకు ఫైర్ ఎన్‌వోసీ వర్తించదని కళాశాల యాజమాన్యాలు చెప్తున్నాయి. దాదాపు ఆయా కాలేజీలన్నీ జీ ప్లస్ వన్ భవనాల్లోనే ఉన్నాయని, ఫైర్ ఎన్‌ఓసీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

అడ్మిషన్ల కోసం విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేసిన అధికారులు, విద్యార్థులు ఆయా కాలేజీలను ఎంపిక చేసుకునేందుకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి కాలేజీల జాబితాను మాత్రం విడుదల చేయడంలేదు. నెల నుంచి విద్యార్థులు వేచి చూస్తున్నారు. ఈ కోర్సులో అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుందా? లేదా!..అనే ఆందోళనలో వారున్నారు.

వేరే కోర్సులకు అడ్మిషన్లు కూడా పూర్తి కావొచ్చాయి. 2023 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ కూడా ఇలానే ఆలస్యంగానే జరిగింది. ఈ విద్యాసంవత్సరం కూడా ఆలస్యంగానే మొదలవుతోంది. జూన్ లేదా జూలై నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంటుంది. రెండు నెలలు పూర్తి కావొస్తున్నా ఇంతవరకూ అడ్మిషన్లు పూర్తికాలేదు.

ఇలా ప్రతీ ఏటా అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కానుండడంతో జీరో అడ్మిషన్లతో కాలేజీలు మూతపడుతున్నాయి. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ ప్రైవేట్ డీఎడ్, బీఎడ్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కే రాధాకృష్ణ రెడ్డి ఈమేరకు విజ్ఞప్తి చేశారు.