మెట్రో రైల్వేస్టేషన్లలో లిఫ్టుల సమీపంలోనే చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని లిఫ్టులకు దూరంగా ఉంచడం వల్ల ప్రయాణికులు ప్రత్యేకించి వృద్ధులు, దివ్యాంగులకు అనవసర అవస్థలు తప్పడం లేదు. ప్రయాణికులు రోడ్డు దాటడం కష్టంగా ఉండటంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్కైవేలు నిర్మించారు. వాటికి లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. చక్రాల కుర్చీలు మాత్రం వీటికి దూరంగా ఉంచుతున్నారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు ఉచితంగా శౌచాలయాలు వాడుకొనే పరిస్థితి కూడా ఇప్పుడు లేకుండా చేశారు. స్కైవేలమీదుగా వృద్ధులు, రోగులు, మెట్రో స్టేషన్ వరకు నడవటం కష్టంగా ఉంటున్నది. కనుక, టికెట్ కౌంటర్‌ల వద్ద నుంచి చక్రాల కుర్చీలను స్కైవే లిఫ్టులవద్దకు మార్చాలి. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్