- పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు తీరుపై హైకోర్టు ప్రశ్న
- లగచర్ల దాడి కేసులో పట్నం పిటిషన్‌పై తీర్పు వాయిదా
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అరెస్టు చేస్తే ఆయన భార్యకు నోటీసులు ఇవ్వకుండా, సలీమ్ అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పరారీలో లేని వ్యక్తిని పార్కులో ఎలా అరెస్టు చేస్తారని అడిగింది.
అరెస్టు చేసే ముందు అనుసరించాల్సిన విధానాలపై సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకరణం ఎందుకు ఉల్లంఘించారని నిలదీసింది. ఇతర నిందితుల వాంగ్మూలం, కాల్‌డాటా ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారని మండిపడింది. ప్రాథమిక విచారణ చేసి ఆధారాలు సేకరించాలి కదా అని ప్రశ్నించింది.
నరేందర్‌రెడ్డి పేరు వెల్లడించినట్టు చెప్తున్న లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాల కాపీలను అనుమతిస్తున్నట్టు పేర్కొంటూ, తీర్పు రిజర్వు చేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొడంగల్ కోర్టు జారీచేసిన డాకెట్ ఆర్డర్‌ను హైకోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి సవాల్ చేశారు.
ట్రయల్ కోర్టు డాకెట్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలనే పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ ముగించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు.
పిటిషన్ కొట్టేయండి
న్యాయమూర్తికి పెన్‌డ్రైవ్ ద్వారా పలు సాక్షాలను అందజేసిన పీపీ వాదనలు వినిపిస్తూ.. రేవంత్‌రెడ్డి అయినా జిల్లా కలెక్టర్ వచ్చినా దాడి చేయాలని పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) ప్రేరేపిస్తూ ప్రసంగించిన వీడియో ఉన్న పెన్ డ్రైవ్ పరిశీలించాలని కోరారు. లగచర్లలో అధికారులపై దాడికి ముందు, తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్న వీడియోలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని తెలిపారు.
పిటిషనర్ రెచ్చగొట్టకుంటే దాడి జరిగేదే కాదపి అన్నారు. పిటిషనర్ జ్యుడిషీయల్ రిమాండ్‌లో ఉన్నారని, దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారం సాగుతోందని చెప్పారు. వరుసగా పిటిషన్లు వేస్తూ విచారణను ముందుకు సాగకుండా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నుంచి రూ.10 కోట్లు పిటిషనర్‌కు అందినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. పిటిషన్ విచారణార్హం కాదని, కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.
అయితే సెక్షన్ 482 కేసులో పెన్‌డ్రైవ్ ఎలా సమర్పిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందస్తు పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పడానికి అందులోని వివరాలే సాక్ష్యమని పీపీ బదులిచ్చారు. ఈ సమాచారం అంతా పబ్లిక్ డొమైన్లో కూడా ఉందని అన్నారు. కోర్టులోనే వీడియోలను చూడాలని కోరగా, న్యాయమూర్తి అది సరికాదని అన్నారు.
అరెస్టు ఫొటోలను న్యాయమూర్తికి అందజేసిన గండ్ర వాదనలు వినిపిస్తూ.. 15 మంది సివిల్ డ్రెస్‌లో వచ్చి నరేందర్‌రెడ్డిని బలవంతంగా అరెస్టు చేశారని చెప్పారు. డిమాండ్ రిపోర్టులో పోలీసులు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో అరెస్టు చేశామని పేర్కొన్నారని తెలిపారు.
సమయం కూడా వేర్వేరుగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్‌ను ట్రయల్ కోర్టులో హాజరుపరిచే ముందు పలు పేపర్లపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. అందులో ఏముందో, సంతకాలు ఎందుకో చూసుకునే అవకాశం ఇవ్వలేదని చెప్పారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. చట్టపరమైన హక్కుని గుర్తుచేశారు. అవకాశం ఉన్నప్పుడు పిటిషన్లు వేయడానికి న్యాయపరమైన హక్కులు పౌరులకు ఉన్నాయని చెప్పారు. నివేదికలపై సంతకాలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గాయపడిన వారి మెడికల్ రిపోర్టు లో ప్రశ్న మార్కు ఎందుకు ఉందని ప్రశ్నించారు.
ప్రాథమిక సమాచారం తీసుకునే క్రమంలో అలా పేర్కొన్నారని పీపీ బదులివ్వగా.. విచారణ తీరుపై న్యాయమూర్తి అస హనం వ్యక్తంచేశారు. ‘ఈ కేసులో దర్యాప్తు లో భాగంగా మహిళ తన శరీరంపై కిరోసిన్ ఎందుకు పోసుకుందో చెప్పాలని వైద్యుడికి జిల్లా ఎస్పీ లేఖ రాశారు.
ఎందుకు పోశారన్న విషయం వైద్యుడికి ఎలా తెలుస్తుంది? అది తేల్చాల్సింది పోలీసులు కదా. కొందరు ఎస్పీలు ఇలా ఉన్నారు’ అంటూ న్యాయమూర్తి గతంలో జరిగిన ఓ ఘటనను వివరించారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేశారు.
ఒకే ఘటనపై పలు ఎఫ్‌ఐఆర్‌లు చెల్లవు
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): లగచర్ల ఘటనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్‌రెడ్డి భార్య శ్రుతి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. 153/2024 ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత మరో రెండు ఎఫ్‌ఐఆర్లు దాఖలు చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు.
కొత్తగా తహసీల్దార్, డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎఫ్‌ఐఆర్ 154/2024, 155/2024ను బొమరాసిపేట పోలీసులు నమోదు చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు. టీటీ అంటోనీ వర్సెస్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమని అన్నారు.
లంచ్‌మోషన్ రూపంలో దాఖలైన ఈ పిటిషన్ జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ముందుకు గురువారం వచ్చింది. అయితే, సంబంధిత పిటిషన్లు మరో బెంచ్ వద్ద ఉండటంలో ఆయన విచారణ చేపట్టలేదు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ కే లక్ష్మణ్ ముందుకు విచారణకు రానుంది.