డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2’. అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా నటించిన ఈ చిత్రబృందం ఆదివారం చెన్నైలో ‘వైల్డ్ ఫైర్’ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించింది. అక్కడి లియో ముత్తు స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్లో అల్లు అర్జున్, హీరోయిన్లు నేషనల్ రష్మిక, శ్రీలీల సందడి చేశారు.
కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్‌ను శ్రీలీల కౌంట్‌డౌన్ లెక్కపెట్టి స్వయంగా లాంచ్ చేసింది. ‘దెబ్బలు పడితాయ్ రో.. కిస్సిక్’ అంటూ సాగే ఈ గీతం మాస్‌ను, క్లాస్‌ను ఆకట్టుకుంటోంది. ఈ వేడుకలో హీరో అల్లు అర్జున్ తమిళంలో మాట్లాడారు. ‘ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానిక భాషలో నేను అక్కడి ప్రజలకు నమస్కరిస్తాను.
ఆవిధంగా ఆ నేలకు నేను గౌరవిస్తాను. చెన్నై వస్తే ఆ ఫీలే వేరు. నాకు ఈ నేలతో అనుబంధం ఉంది. మీ జీవితంలోని తొలి 20 ఏళ్లు ఎలా గడిపారో.. మిగతా జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో మొదటి 20 ఏళ్లు చెన్నైలోనే గడిచాయి. నేనేం సాధించినా అదంతా చెన్నైకే అంకితం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు లేకపోతే ఈ సినిమా అసాధ్యం. ఫ్యాన్స్‌కు మించింది నాకేదీ లేదు. ఫ్యాన్స్ నాకు ముఖ్యం’ అన్నారు.
చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో చేసిన శ్రీలీల మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్‌తో డాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సెట్స్‌లో ఆయన చాలా ఫన్‌గా ఉంటారు. నాకు మొదట కొంచెం భయంగా అనిపించింది. కానీ బన్నీ సార్ మాట్లాడాక ఆ భయం పోయింది. మీరు ఒక చాట్ జీపీటీ.. అంతేకాదు మీరు ఒక వైబ్ సార్. అల్లు అర్జున్‌తో డాన్స్ అంటే ప్రాక్టీస్ చేయాలి. కానీ నేను సెట్స్‌లో వెళ్లాక అవసరం లేదనిపించింది.
నేను ఇక్కడ అల్లు అర్జున్ కాదు.. పుష్ప అని చెప్పారు’ అంటూ శ్రీలీల ప్రశంసలు కురిపించింది. ఏజెఎస్ ఎంటర్టైన్మెంట్స్ అర్చన కల్పాతి మాట్లాడుతూ.. ‘తమిళనాడులో సుమారు 600 స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం. మొదటి రోజు 3500 షోలు వేయనున్నాం’ అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, సీఈవో చెర్రీ, రష్మిక తనదైన మాటలతో ఆకట్టుకున్నారు. చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ మాట్లాడారు.