calender_icon.png 7 March, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఓటమికి కారణాలేమిటి?

07-03-2025 01:53:46 AM

  1. సమన్వయ లోపమే శాపం! 
  2. కమలం పార్టీకి ఉత్తర తెలంగాణ ఓటర్లు జై
  3. టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే 
  4. కాంగ్రెస్ పుట్టి ముంచిన ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం 

విజయక్రాంతి నెట్‌వర్క్, మార్చి 6: నేతల మధ్య విభేదాలు.. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయలోపం అధికార కాంగ్రెస్ పార్టీని ఓటమి పాలు చేశాయి. పెద్దల సభ పోరులో ఆ పార్టీకి పరాభవం మిగిల్చాయి.

ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పోటీలోనే లేకపోవడం, బీజేపీకి క్యాడర్ అంతంతే ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అన్న తరుణంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా బీజేపీ అభ్యర్థులు మల్క కొమురయ్య, అంజిరెడ్డి  విజయంసాధించడం చర్చనీయాంశంగా మారింది.

గత ఎడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీని ఓడించి, అనూహ్య విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసిన కాంగ్రెస్, కేవలం ఏడాదిలోపే ఇంతటి పరాభవాన్ని ఎదుర్కోవడం ఆ పార్టీ శ్రేణులకే రుచించడం లేదు. 

అనుచరుల వెన్నుపోటు

అటు ప్రచార సమయంలో పెద్ద ఎత్తున ఓట్లు తెచ్చిపెడతామని నమ్మించి డబ్బులు వసూలు చేసిన తన అనుచరులు చివరి నిమిషంలో గాలికి వదిలే యడంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఓడిపోయారని ప్రచారం జరుగుతోంది. అంతేకాక కొందరు కాంగ్రెస్ నాయకులు, అనుచరులు నరేందర్‌రెడ్డికి వెన్నుపోటు పొడిచినట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాల్లో నాయకుల మధ్య వర్గపోరు పార్టీకి తీరని నష్టంచేస్తున్నాయి. పార్టీలో చేరిన కొత్త నేతలకు ప్రాధాన్యం దక్కడం, దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు ఇవ్వకపోవడం వంటి ఘటనలు కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాయని ప్రచారం జరుగుతోంది.

కరీంనగర్‌లో..

*ప్రచారంలో పాల్గొన్న క్యాడర్‌ను ఏకతాటిపైకి తేవడంలో వైఫల్యం

* పార్టీకి క్యాడర్ ఉన్నా సమన్వయం లేకపోవడం 

* కాంగ్రెస్ టికెట్ ఆశించి, బీఎస్పీ నుంచి పోటీచేసిన ప్రసన్న హరికృష్ణకు కొందరు బీసీ నేతలు, ఎమ్మెల్యేలు సహకరించడం 

* కాంగ్రెస్ అభ్యర్థికి భారీగా వచ్చిన చెల్లని ఓట్లు

జగిత్యాలో..

జగిత్యాల జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకుల మధ్య సమన్వయ లోపం       

* పార్టీ క్యాడర్ ఏ నాయకుని మాట వినాలో, ఎటు వైపు నడవాలో అర్థంకాని అయోమయ స్థితి

* ఆరు గ్యారెంటీల అమలులో ఆశావహులు ఎక్కువగా,  లబ్ధిదారులు తక్కువ సంఖ్యలో ఉండటం

* డబ్బు పంపిణీలో జరిగిన ప్రచారంఆదిలాబాద్‌లో..

  1. ఆదిలాబాద్ జిల్లాలో పలువురు సీనియర్ నేతల సస్పెన్షన్
  2. కొత్తగా చేరిన ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి ఒంటెత్తు పోకడ
  3. అధిష్ఠానం అందించిన పార్టీ ఫండ్‌ను ఖర్చు చేయకపోవడం
  4. ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతల ఆధిపత్యం నిజామాబాద్‌లో..
  5. నరేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం ఇష్టంలేని కొన్నివర్గాల సహాయ నిరాకరణ
  6. నరేందర్‌రెడ్డి ఓడినా కాంగ్రెస్‌కు నష్టం లేదని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లు
  7. నియోజకవర్గ బాధ్యులు డబ్బులు దండుకొని ముఖంచాటేయడం కామారెడ్డిలో..
  8. ముఖ్య నాయకులు, ద్వితీయశ్రేణి నాయకుల మధ్య డబ్బుల పంపిణీలో భేదాభిప్రాయాలు
  9. గ్రామీణస్థాయి వరకు చేరని ప్రచారం
  10. అధికార పార్టీ కావడంతో క్యాడర్‌పై అతి విశ్వాసం సంగారెడ్డిలో..
  11. క్షేత్రస్థాయిలో అభ్యర్థి ప్రచారానికి వెళ్లకపోవడం
  12. జిల్లాలో సభలు, సమావేశాలు పెట్టకపోవడం
  13. శ్రేణులను సమన్వయ పర్చడంలో స్థానిక మంత్రి వైఫల్యం

నేతల మధ్య సమన్వయం లోపంతోనే పార్టీకి నష్టం

కొత్త, పాత నేతల మధ్య నెలకొన్న సమన్వయం లోపంతోనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించడమే ఇందుకు నిదర్శనం. నాయకులు స్వార్థాన్ని వీడి పార్టీ కోసం పని చేయాలి. కొత్త రక్తం, పాతరక్తం అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ కార్యకర్తలను గౌరవించాలి.  

 ఏఐసీసీ సభ్యులు డాక్టర్ నరేశ్ జాదవ్ 

గట్టి ప్రయత్నం చేస్తే విజయం దక్కేది 

పలుచోట్ల పార్టీ క్యాడర్ గట్టిగా ప్రయత్నం చేయాల్సి ఉండె. కొన్నిచోట్ల పార్టీ క్యాడర్ ఓటరు వరకు వెళ్లలేకపోయింది. మంత్రి శ్రీధర్‌బాబు సమన్వయంతో ముందుకెళ్లాం. ప్రాధాన్యత ఓటుపై అవగాహన కల్పిస్తూ ప్రజల వద్దకు వెళ్లి ఉంటే నరేందర్‌రెడ్డి ఓడిపోయేవారు కారు. కొన్ని ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ ఈ అంశంపై దృష్టి సారించలేదు. అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ స్థానం చేజారడం బాధాకరం.  కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, 

కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్