16-03-2025 01:52:45 AM
అప్పులు తప్పులు చేసి పారిపోయారు!!
కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు సరేనన్నారు..
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎన్నిగంటలైనా చర్చిద్దాం
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాం తి): కృష్ణాజలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడానికి బీఆర్‌ఎసే ప్రధాన కారణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణాజలాలను ఏపీకి అప్పనంగా అప్పగించింది కేసీఆర్, ఆయన అల్లుడు హరీశ్‌రావేనని చెప్పారు. తద్వారా తెలంగాణకు, ఇక్కడి రైతాంగానికి శాశ్వతంగా మరణశాసనం రాశారని సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పదేళ్ల విధ్వంసాన్ని, నియంతృత్వాన్ని పారదోలిన ప్రజలు మార్పును కోరుకొని తమను ఆశీర్వదించారన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో ఆయన స్పందించా రు. తమ సర్కారు చేస్తున్న ప్రతి పనికి వారు మోకాలడ్డుతున్నారని దుయ్యబట్టారు. తమ విధానాలపై రేబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ ఇచ్చినట్లు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నార న్నారు.
దాదాపు 2.30 గంటలపాటు సాగిన సీఎం ప్రసంగం కృష్ణా జలాలు, కేసీఆర్, బీఆర్‌ఎస్‌పై విమర్శలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రధానాంశాలుగా సాగింది. కృష్ణాజలాల విషయంలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు వస్తే.. ‘తెలంగాణకు 299 టీఎంఎసీలు చాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో..
వాళ్లు నిత్యం తిట్టిపోసుకునే నాటి ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఈ మామ, అల్లుడు మోకరిల్లి.. ఏపీకి 512 వాడుకోవచ్చని సంతకాలు పెట్టింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. తమకు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు మాత్రమే చాలని 2021లో మరోసారి కేసీఆర్ శాశ్వతంగా సంతకాలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాము అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాలను రీఓపెన్ చేశారమన్నారు. పరివాహక ప్రాంతాన్ని లెక్కగడితే తెలంగాణకు 68 శాతం కృష్ణా జలాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకే గతంలో చేసిన ఒప్పందాలను తిరగరాయాల్సిందేని, తెలంగాణకు 70శాతం కృష్ణా జలాలు కేటాయించాలని కేంద్రంలో చర్చలు జరుపుతున్నామన్నారు. దీనిపై ఇప్పటికే కేఆర్‌ఎంబీతో పాటు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లామన్నారు.
కృష్ణా జలాల కోసం తాము కొట్లాడుతుంటే, బీఆర్‌ఎస్ తప్పిదాలు ఎక్కడ బయపడుతాయోనని అబద్ధాలు చెబుతూ.. ఎదురుదాడికి దిగుతున్నారని సీఎం మండిపడ్డారు. దేశ చరిత్రలో అతితక్కువ కాలంలో 57, 924 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగం 22.9శాతం ఉంటే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 18.1శాతానికి తగ్గించామన్నారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. కేంద్రంతో సంత్ససంధాలను ఏర్పరుచుకుంటే తప్పేంటని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకు తాను 32 సార్లు ఢిల్లీకి వెళ్లానని, ప్రతిసారి తాను ఢిల్లీ వెళ్లినప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు విమర్శిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైన ౩00 సార్లు ఢిల్లీ వెళ్తానని సీఎం చెప్పారు.
మూడుసార్లు ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు నిధులు అడిగానని అన్నారు. దేశ ప్రధానిని కలవడంలో రాజకీయం ఏముందని నిలదీశారు. దేశ ప్రధానిగా ఆయన తనకు బడేభాయ్ అని సీఎం ఉద్ఘాటించారు. తను ప్రధానిని బడేభాయ్ అంటే తప్పేమిటని ప్రశ్నించారు.
కమీషన్లకు కక్కుర్తిపడిన కేసీఆర్
కమీషన్లకు కక్కుర్తిపడిన కేసీఆర్.. జూరాలను రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ నీళ్లను శ్రీశైలానికి పంపించడం వల్ల ప్రాజెక్టును పూర్తిచేసినా నీళ్లవ్వలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. 2004లో వైఎస్ ఆశీర్వాదంతో కేంద్రమంత్రి అయిన కేసీఆర్.. నాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేస్తుంటే..
ఆయన చూస్తూ ఊరుకున్నది నిజం కాదా? అని సీఎం నిలదీశారు. ఒకవైపు పోతిరెడ్డిపాడును నాటి కాంగ్రెస్ నేత పీజేఆర్ వ్యతిరేకిస్తూంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని, నాడు బీఆర్‌ఎస్ సహకరించకపోతే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదయ్యేదా? అని ప్రశ్నించారు.
రోజుకు 10 టీఎంసీలను తరలించుకుపోయే ప్రాజెక్టులను ఏపీ నిర్మిస్తుంటే పదేళ్ల పాటు కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. రోజమ్మ రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కేసీఆర్.. ఏపీ ప్రాజెక్టులకు సహకరించారని, మరి రాజకీయ భిక్ష పెట్టి, 2009లో పల్లకీలో పార్లమెంట్‌కు పంపిన పాలమూరును పడావుపెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కృష్ణాజలాలపై చర్చకు కేసీఆర్ సిద్ధమా?
2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేయాల్సి ఉందని, కానీ పదేళ్లయినా పూర్తి చేయకుండా నల్లగొండకు అన్యాయం చేసింది నిజం కాదా? అని సీఎం ప్రశ్నించారు. ఇప్పుడు జరిగిన ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి బీఆర్‌ఎస్ కారణం కాదా నిలదీశారు. కృష్ణా పరివాహకంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ప్రాజె క్టులను ఎందుకు పూర్తి చేయలేదన్నారు.
తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందనే సభ నుంచి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. అందుకే కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చపెట్టాల్సిందేనని స్పష్టంచేశారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజె క్టులను పూర్తిచేసి ఉంటే నల్లగొండ ప్రజల కష్టాలు తీరేవి అన్నారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చపెడుదామని, తాము లెక్కలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని, తాము ఏమైనా తప్పు మాట్లాడితే అవసరమైతే క్షమాపణలు చెప్పడానికి కూడా వెనుకాడబోమని వివరించారు.
కృష్ణా జలాలపై గతంలో రాష్ట్రానికి జరిగిన నష్టంపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ అంశంపై కేసీఆర్ సభకు వస్తే తెల్లవారుజామున మూడు గంటల వరకైనా అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమేనని సీఎం చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం జరిగే పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇంట్లో తలుపు వేసుకొని డ్యాన్స్‌లు వేస్తున్నారన్నారు.
‘మార్చురీ’ వ్యాఖ్యలపై సీఎం క్లారిటీ
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ‘స్టేచర్’, ‘మార్చురీ’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ఉద్దేశించి చేశారని బీఆర్‌ఎస్ చేసిన విమర్శలపై అసెంబ్లీ వేదికగా సీఎం క్లారిటీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌కు స్టేచర్‌పై ఉన్న శ్రద్ధ.. తెలంగాణ ఫ్యూచర్‌పై లేదని మండిపడ్డారు. తాను కేసీఆర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, బీఆర్‌ఎస్ మార్చురీలో ఉందని తాను మాట్లాడినట్లు స్పష్టం చేశారు.
2023లో బీఆర్‌ఎస్‌కు ఒక స్టేచర్ ఉండేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్ట్రెచక్‌పైకి వెళ్లిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మార్చురీలోకి వెళ్లిందని, తాను ఈ కోణంలో మాట్లాడినట్లు చెప్పారు. కేసీఆర్ ఆయుష్షుపై మాట్లాడేంత కుంచితబుద్ధి తనకు లేదని, ఆయన నిండునూరేళ్ల బతకాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ ఎప్పుడూ అలాగే, ప్రతిపక్షంలో ఉండాలి, తాను ఇలాగే అధికార పక్షంలో ఉండాలని అని సీఎం అన్నారు. కేసీఆర్ దగ్గర ఉన్న ప్రతిపక్ష నేత హోదా సీటు కోసం హరీశ్, కేటీఆర్ పోటీపడుతున్నారని, అందులో భాగంగానే తన వ్యాఖ్యలను ఇద్దరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.
గవర్నర్ వ్యవస్థను అగౌరవపర్చిన బీఆర్‌ఎస్
రాజ్యాంగ వ్యవస్థలను అందరూ గౌరవించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాన్నే గవర్నర్ ప్రసంగిస్తారని, తాము చేసిన పనులు, చేయబోయే కార్యక్రమాల గురించి గవర్నర్ ప్రసంగంలో చేర్చామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు ఇది తెలియదా? అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ ప్రెస్‌మీట్‌లా ఉందని బీఆర్‌ఎస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు.
అవగాహన లేనివాళ్లు.. మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి వారికి అర్హత ఉందా అని నిలదీశారు. గత ప్రభుత్వం హయాంలోని గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించలేదా? అని ప్రశ్నించారు. తాము గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తామన్నారు. కానీ గవర్నర్ వ్యవస్థపై నమ్మకంలేని గత సర్కారు తమిళసైని అవమానించారన్నారు. ఆ తప్పు తాము చేయబోమని మరోసారి స్పష్టంచేశారు.
2022లో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. సీనియర్లమని, పదేళ్లు మంత్రులుగా పనిచేశామని చెప్పుకునే వాళ్లు గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టారని చెప్పకొచ్చారు. వారు అజ్ఞానాన్ని తమ విజ్ఞానమని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేస్తున్నామని, తాము అమలుచేసిన వాటినే మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు. ఆ విధంగా ఆమోదించిన అంశాలనే గవర్నర్ చదివారన్నారు.
తాలు తీస్తే తోలు తీస్తా..
రైతుల సమస్యలపై కేసీఆర్‌తో చర్చించడానికి తాను ఎప్పుడైనా సిద్ధమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భూమికోసం ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. 70శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధాపడినట్లు చెప్పారు. భూమిని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంగా సీఎం అభివర్ణించారు.
అమ్మ ఎంతనో రైతన్నకు భూమాత అంతే అని, అందుకే వారిని ఆదుకునేందుకు రూ.20,624కోట్ల రుణమాపీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదంటూ నాటి కేసీఆర్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయలేదని, పైగా వరి వేస్తే ఉరే అన్నదని మండిపడ్డారు. కానీ తాము చివరి గింజవరకు వడ్లను కొన్నామని, మూడు రోజుల్లోనే నగదును జమచేశామని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చామన్నారు.
గత సర్కారు హయాంలో 10 కిలోలు తాలు రూపంలో తీస్తే.. తాము గింజ కూడా తీయనియలేదన్నారు. తాలు తీస్తే తోలు తీస్తామని హెచ్చరించామన్నారు. ఇందులో పకడ్బందీగా విజిలెన్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం లేకుండా దేశంలో అత్యధికంగా 266 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేశామన్నారు.
బీఆర్‌ఎస్ మాకు ఇచ్చిన అప్పు రూ.8.19లక్షల కోట్లు..
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై సీఎం అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత పదేళ్ల బీఆర్‌ఎస్ సర్కారు రూ. 6.69 లక్షల కోట్ల అప్పులను తమకు అప్పగించిందని, అలాగే, రూ. 40,154 కోట్ల పెండింగ్ బిల్లులు, సింగరేణి, డిస్కమ్స్ లాంటి ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు రూ. 1,09,740 కోట్లు ఉన్నాయన్నారు.
ఇవన్నీ కలిపితే ప్రభుత్వ రూ. 8.19 లక్షల కోట్లు బాకీ పడిందన్నారు. ఇందులో రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ. 8 వేలకోట్లు ఉన్నట్లు చెప్పారు. అలాగే తమ సర్కారు చేసిన అప్పులపై కూడా సీఎం క్లారిటీ ఇచ్చారు. రూ. 1,58,041 కోట్లు అప్పులు చేశామని, ఇందులో గత సర్కారు చేసిన అప్పులకు ప్రిన్సిపల్ అమౌంట్ కింద రూ. 88,591 కోట్లు కట్టామని, మిత్తీ కింద రూ. 64,768 కోట్లు చెల్లించామన్నారు. ఇవన్నీ పోనూ తాము చేసిన అప్పు కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే అన్నారు.
సోషల్ మీడియాపై సీఎం మండిపాటు
సోషల్ మీడియాలో కొందరు హద్దు మీరుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఉన్నది తానని, తనపై విమర్శలు చేయకుండా ఇంట్లో వాళ్లను దూషిస్తే ఊరుకునేది లేదని స్ప ష్టం చేశారు. ఏది పడితే అది మాట్లాడేవారు జర్నలిస్టులా? అని ప్రశ్నించారు.
భూభారతి విషయంలో విమర్శలు చే స్తూ.. తనను, తన భార్య, బిడ్డలను కొంద రు విమర్శలు చేస్తూ పెట్టిన పోస్టులపై ఆయన మండిపడ్డారు. కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే తోడ్కలు తీస్తానని, గుడ్డలూడదీసి తంతా అని ఘాటుగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. చ ట్టప్రకారం అన్ని రకాల చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు చేసిన వారిని అరెస్టు చేస్తే బీఆర్‌ఎస్ నాయకులకు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించా రు. జర్నలిస్టు ముసుగులో తనను, ఇం ట్లో ఉన్న మహిళలను తిడితే తాను ఉపేక్షించేది లేదన్నారు. వారి ఇళ్లలోని మహిళ లను అంటేఊరుకుంటారా? వారి అమ్మ, చెల్లిని అంటే ఊరుకుంటారా? తన భార్యాబిడ్డలను