- మేము అధికారంలోకి వచ్చాక 50 వేల ఉద్యోగాలిచ్చాం
- హాయిగా రెస్ట్ తీసుకోండి కేసీఆర్.. మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు
- కొందరికి చిచ్చుబుడ్లతో కాకుండా సారాబుడ్లతో దీపావళి
- డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా పట్టుకోవద్దని దబాయింపు
- కేసీఆర్, కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం
- నూతన ఏఎంవీఐలకు నియామక పత్రాలు అందజేసిన సీఎం
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): గత పది నెలల్లో ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకున్నారని ఓ పెద్దాయన అంటున్నారని.. అయితే, తెలంగాణ ఏం కోల్పోలేదని ఆ పెద్దాయన ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుడుతూ ౧౦ నెలల్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టంచేశారు. తాము బాధ్యతలు తీసుకున్న ఎల్బీ స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి నిరుద్యోగుల తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూశామని చెప్పారు.
ఇది తనకు అత్యంత సంతృప్తి కలిగించిన సందర్భంగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. సోమవారం ఖైరతా బాద్ ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో కొత్తగా ఎంపికైన 99 మంది అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మిమ్మల్ని ప్రజలు మరిచిపోయారు.. రెస్ట్ తీసుకోండి
తమ పది నెలల పాలనలో తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని, రైతులు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారని స్పష్టంచేశారు. కోటి 5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందారని, నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని వెల్లడించారు.
49.90 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారని చెప్పారు. రూ.500కే ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతుని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందుతున్నారని పేర్కొన్నారు. 21 వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారని, 35 వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజాప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు.
వాస్తు కోసం కేసీఆర్ సచివా లయం, ప్రగతి భవన్ కట్టుకున్నాడు.. కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. విద్యే తెలంగాణ సమా జాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నామని చెప్పారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని, త్వరలో వారికి నియామకపత్రాలు అందించి, వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని స్పష్టంచేశారు. ‘మీరు లేకపోయినా ఏం బాధలేదు. మీతో ప్రజలకేం పని లేదు. తెలంగాణ సమాజం మిమ్మల్ని మరిచిపోయింది.
హాయిగా రెస్ట్ తీసుకోండి’ అని ఎద్దేవాచేశారు. బడి దొంగలను చూశాం కానీ, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుం డా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూ స్తున్నామని కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండని, లోపాలు ఉంటే సలహాలు ఇవ్వాలని కోరారు.
వారికి సారాబుడ్లతో దీపావళి
ఇంతకుముందు మత్తుపదార్థాల కేసుల్లో ఎవరెవరో అరెస్టయ్యే వాళ్లని.. కానీ, ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇంజినీరింగ్ విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు పట్టుబడు తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా తమను పట్టుకోవద్దని దబాయిస్తున్నారని అన్నారు.
ఫామ్‌హౌస్‌లో కొందరు మద్యం సేవిస్తూ, చిచ్చుబుడ్లకు బదులుగా సారా బుడ్లతో దీపావళి జరుపుకొంటున్నారని విమర్శించారు. దావత్‌ల పేరిట డ్రగ్స్ తీసుకుంటూ ఇంట్లో కూడా దావత్ చేసుకో వద్దా? అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతా చారిని రోల్ మాడల్ గా తీసుకోవాలో.. డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారి ని స్ఫూర్తిగా తీసుకోవాలో యువత ఆలోచోంచుకోవాలని సూచించారు. మన రాష్ట్రానికి గోవా, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న డ్రగ్స్‌ని అడ్డుకోవడంలో కొత్తగా నియామకమైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లది కీలక పాత్ర అని చెప్పారు.
మత్తు పదార్థాలతో తెలంగాణ సరిహద్దుల్లో అడుగుపెట్టాలంటే వాళ్ల వెన్నులో వణుకుపుట్టాలని.. ఇదే మన కమిట్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పేర్కొన్నారు. ఏఎంవీఐలుగా నియామకం అయిన వారు.. గ్రామా ల్లో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడి పోటీపరీక్షలకు సిద్ధమయ్యేలా స్ఫూర్తి నింపాలని పిలుపునిచ్చరు.
త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ తీసుకొస్తామన్నారు. నగరంలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను తెస్తున్నామని, ఇప్పటికే డీజిల్ బస్సులను జిల్లాలకు పంపించేస్తామని చెప్పారు.
రోజూ 20 మంది మరణిస్తున్నారు : మంత్రి పొన్నం
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు 20 మంది మరణిస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సీఎం చైర్మన్‌గా ఉండే రోడ్ సేఫ్టీ విభాగం ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నూతనంగా నియామకం అయిన ఏఎంవీఐలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి ముఖ్యమంత్రి రావడం ఇదే తొలిసారని, అందుకు రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వాహన్ సారథిని ఇప్పటికే 28 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.. మనం కూడా అందులో చేరాలని సీఎం సూచనతో అమలు చేస్తున్నామని తెలిపారు. 37 ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్‌కి జీవో ఇచ్చామని తెలిపారు.
వెహికిల్ స్క్రాప్ పాలసీని తీసుకొచ్చామని పేర్కొన్నారు. అన్ని శాఖల్లానే రవాణాశాఖకి ప్రత్యేక లోగో తీసుకొస్తామని తెలిపారు. తనిఖీల కోసం ప్రత్యేక వాహనాలు తీసుకొస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక కమిషనర్ వికాస్‌రాజ్, రవాణాశాఖ అధికారులు జేటీసీ రమేశ్, రవీందర్ కుమార్, చంద్రశేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ అధికారంలోకి వచ్చాకే జర్నలిస్టులకు ఇండ్లు
తాము అధికారంలోకి రాగానే మొదటి విడత జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశామని, రెండోసారి అధికారంలోకి రాగానే రెండో విడత పట్టాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ర్టం నుంచి కూడా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం కొట్లాడారని, అయినా పెండింగ్ సమస్య పరిష్కారం కాలేదని గుర్తుచేశారు. రెండో విడత ఇండ్ల సమస్యను తాము రెండోసారి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. ఇందుకోసం జర్నలిస్టులు తనకు సహకరించాలని కోరారు. జర్నలిస్టులంతా తమ సామాజిక బాధ్యత నెరవేర్చాలని సీఎం కోరారు.